Friday, December 27, 2024

‘దిశ’ కేసులో అనుమానితులను పోలీసులు కాల్చిచంపారు: సిర్పుర్కర్ కమిషన్

  • నిజం నిగ్గుతేల్చడంలో క్రియాశీలకపాత్ర పోషించిన మహిళాహక్కుల నాయకులు
  • పోలీసులు చెప్పనవన్నీ అబద్ధాలేనని కమిషన్ నిర్థారణ
  • సుప్రీంకోర్టుకు కమిషన్ నివేదిక సమర్పణ
  • పది మంది పోలీసులపైన హత్యానేరం విచారణ జరపాలని కమిషన్ సూచన
2019 Hyderabad encounter of rape accused fake: Inquiry Commission to  Supreme Court

‘దిశ’ హత్యాచారం కేసులో అనుమానితులను పోలీసులు కావాలనే కాల్చి చంపివేశారని జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ నిర్థారించింది. నిందితులకూ, తమకూ మధ్య ఎన్ కౌంటర్ జరిగిందనీ, కాల్పుల్లో నిందితులు మరణించారనీ పోలీసులు చెప్పింది కట్టుకథ అని కమిషన్ తేల్చి చెప్పింది. 06 డిసెంబర్ 2019లో నిందితులు పోలీసు కాల్పుల్లో చనిపోయిన వెంటనే మహిళ, శిశువుల హక్కుల కార్యకర్తలు సజయ్, ప్రొఫెసర్ పద్మజాషా, తదితరులు హైకోర్టుని ఆశ్రయించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు సుప్రీంకోర్టు జస్టిస్ సిర్పుర్కర్ నాయకత్వంలో ముగ్గురు సభ్యుల విచారణ కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ శుక్రవారంనాడు తన నివేదికను సుప్రీంకోర్టుకు దాఖలు చేసింది. దీన్ని ప్రైవేటు దస్తావేజుగా పరిగణించి రహస్యంగా ఉంచాలన్న తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది ప్రజలకు అందుబాటులో ఉండవలసిన డాక్యుమెంటు అనీ, బహిరంగ విచారణ జరిగిన తర్వాత నిర్ణయాలను రహస్యంగా ఉంచడంలో అర్థం లేదనీ సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్థారించింది. సిర్పూర్కర్ కమిషన్ లో సభ్యులుగా జస్టిస్ రేఖా పి సొందర్ బల్డోటా, డాక్టర్ డిఆర్ కార్తికేయన్ ఉన్నారు. ఈ కమిషన్ ను సుప్రీంకోర్టు 12 డిసెంబర్ 2019న ఏర్పాటు చేసింది.

షాద్ నగర్ సమీపాన చలాన్ పల్లి గ్రామ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ జరిగినట్టు చెబుతున్న పోలీసుల కథనం కేవలం కట్టుకథ అనీ, పోలీసులు నిందితులను చంపే ఉద్దేశంతో కాల్చి చంపారనీ, ఈ కేసులో పదిమంది పోలీసులపైన కేసు పెట్టి విచారణ జరిపించాలనీ కమిషన్ సూచించింది. పోలీసు కాల్పుల్లో చనిపోయిన నలుగురు అనుమానితులు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు. వీరిలో చివరి ముగ్గురు హత్య జరిగిన నాటికి మైనర్లు.

సజయ, ప్రొఫెసర్ పద్మజాషా

ఇరవై ఆరు సంవత్సరాల వెటరినరీ వైద్యురాలు షాదర్ నగర్ దగ్గర క్లినిక్ ను దర్శించి ఇంటికి బయలు దేరిన సమయంలో కొందరు వ్యక్తులు ఆమెను పట్టుకొని సామూహికంగా అత్యాచారం చేసి పెట్రోలు పోసి కాల్చిచంపారు. శవాన్ని రహదారి దగ్గర సొరంగ మార్గంలో ఉంచారు. ఈ ఘోరం బుధవారంనాడు జరిగింది. దేశం అంతా గగ్గోలు పెట్టింది. 2012 డిసెంబర్ లో దిల్లీలో నడుస్తున్న బస్సులో యువతిపైన సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన దుర్ఘటన కళ్ళల్లో మెదిలింది. నిందితులను పట్టుకొని కొట్టి చంపివేయాలంటూ రాజకీయ నాయకులు అన్నారు. ఇటువంటి ఉద్వేగపూరితమైన వాతావరణంలో పోలీసులు శుక్రవారంనాడు (6 డిసెంబర్ 2019) నలుగురు  అనుమానితులనూ పట్టుకొని, ఘాతుకం జరిగిన ప్రాంతానికి తీసుకువెళ్ళి కాల్పిచంపారు. మృతుల తల్లిదండ్రులు ఇప్పటిది ఎన్ కౌంటర్ కాదనీ, పోలీసులు తమ పిల్లల్ని కాల్చి చంపారనీ చెబుతూనే ఉన్నారు.

నలుగురు యువకుల హత్యను సమర్థించుకోవడానికి పోలీసులు చెప్పిన కట్టకథలను విశ్వసించకుండా పోలీసులను దోషులుగా కమిషన్ నిలబెట్టింది. పదిమంది పోలీసులను భారత శిక్షాస్మృతి (ఐపీసీ) 302, 34, 201సెక్షన్ల కింద నేరవిచారణ జరిపించాలని కమిషన్ సిఫార్సు చేసింది.

నలుగురు నిందితులనూ పోలీసులు కాల్చి చంపిన రోజునే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలయింది. పిటిషన్ దారులలో సజయ, పద్మజాషాతో పాటు హక్కుల కార్యకర్తలు దేవి, గడ్డం ఝాన్సీ, విమల, సంధ్య, బి విజయ, కెఎన్ ఆశాలత, సునీత, వర్షాభార్గవ్, ఖలీదా పర్వీన్, కహనీజ్ ఫాతిమా, సంజీవ్ ఉన్నారు. కమిషన్ హైదరాబాద్ లో బహిరంగ విచారణ జరిపినప్పుడు బాధితుల కుటుంబ సభ్యులకు  మద్దతు ప్రకటించి, అండగా నిలబడటమే  కాకుండా కమిషన్ నివేదిక సమర్పించేవరకూ ఈ కేసును విడవకుండా దృష్టి కేంద్రీకరించినందుకు, శ్రమకోర్చినందుకు ఈ పిటిషనర్లని అభినందించాలి. దేశంలో ఎన్నో ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. పోలీసుల కథనం నమ్మి ప్రజలు మిన్నకుంటున్నారు. అందుకు భిన్నంగా బూటకపు ఎన్ కౌంటర్ జరిగిన వెంటనే స్పందించి న్యాయస్థానం తలుపులు కొట్టి నిజాన్ని నిగ్గు తేల్చడంలో ప్రదాన పాత్ర పోషించినందుకు ఈ మహిళా కార్యకర్తలు వందనీయులు.

సుప్రీంకోర్టు విచారణ కమిషన్ ను నియమించక ముందే జాతీయ మానవహక్కుల సంస్థ (నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్-ఎన్ హెచ్ ఆర్ సి) సీనియర్ సూపరిండెంట్ మంజిల్ సైనీ నాయకత్వంలో ఒక బృందాన్ని హైదరాబాద్ కు వెళ్ళి, ‘ఎన్ కౌంటర్’ జరిగిన స్థలం చూసి, దర్యాప్తు చేసి రమ్మనమని పంపింది. ఈ బృందంలో సఫ్దర్ గంజ్ ఆస్పత్రికి చెందిన ఒక వైద్యుడు కూడా ఉన్నారు. ఈ బృందం 2019 డిసెంబర్ 7 నుంచి 11 వరకూ షాద్ నగర్ ప్రాంతంలో పర్యటించింది. పలువురు అధికారులనూ, సాక్షులనూ ప్రశ్నించింది.

కమిషన్ విచారణ జరుగుతుండగానే మహేష్ భగవత్ నాయకత్వంలో ప్రత్యేక పరిశోధన బృందం(స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ – సిట్) తన పని తాను చేస్తూనే ఉన్నది. సిట్ విచారణను ఆపు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించలేదు.

కమిషన్ మాత్రం పోలీసులు చెప్పిన కాకమ్మ కథలను కొట్టిపారేసింది. అతిథి గృహానికి సంబంధించిన కథనంలో అసలు అద్దె ఒప్పంద పత్రాలు లేవు. ఉన్నాయని కొందరు, లేవని కొందరు సాక్ష్యం చెప్పడంతో ఇది కథ మాత్రమేననే నిర్థారణకు కమిషన్ సభ్యులు వచ్చారు. ‘దిశ’కు చెందిన వస్తువులను అక్కడే ఉన్న పొదల చాటు నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సంఘటన జరిగిన రోజు ఘటన జరిగిన ప్రాంతంలో విలేఖరులకు నాటి పోలీసు కమిషనర్ విసి సజ్జనార్ చెప్పారు. దాని తర్వాత కమిషన్ ప్రశ్నించినప్పుడు తాను లోగడ చేసిన ప్రకటన సరైనది కాదని చెప్పారు. ‘దిశ’కు చెందిన వస్తువుల స్వాధీనం విషయంలో భిన్నకథనాలు వినిపించాయి. ఆ వస్తువులను ‘దిశ’ తల్లిదండ్రులకు చూపించలేదు. వాటిని గుర్తు పట్టడానికి వస్తువులను ఆమె తల్లిదండ్రులకు ఎందుకు చూపలేదన్న కమిషన్ ప్రశ్నకు సరైన సమాధానం లేదు.

Disha Encounter Case: Commission Says Cops' Version 'Concocted', Wants  Murder Charges Against 10 Officers
నాటి పోలీసు కమిషనర్ సజ్జనార్, ఇతర పోలీసు ఉద్యోగులు

అదే విధంగా తమ కళ్ళలో మట్టి కొట్టి నిందితులు పారిపోయారని పోలీసులు చెప్పారు. అయితే, ఈ సంగతి పోలీసులు దాఖలు చేసిన మొదటి ఫిర్యాదులో పేర్కొనలేదు. నలుగురు బందీలుగా ఉన్న యవకులు పన్నెండుమంది పోలీసుల కళ్ళలో మట్టి కొట్టి పారిపోయారనడం నమ్మశక్యంగా లేదన్నది కమిషన్ అభిప్రాయం. ఇద్దరు పోలీసు ఉద్యోగులకు గాయాలై రక్తం కారిందనీ, వారిని కేర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించామని చెప్పిన దాంట్లో కూడా నిజం లేదని కమిషన్ నిర్థారించింది. ఎందుకంటే ‘ఎన్ కౌంటర్ ’ జరిగిన ప్రాంతంలో మధ్యాహ్న 12.45 నుంచి 2.45 వరకూ జరిగిన కార్యక్రమానికి ప్రత్యక్ష సాక్షులుగా వీరిద్దరి పేర్లనూ చూపించారు. కేర్ అసుపత్రిలో ఉదయం ఎనిమిది గంటలకు చేర్చినట్టు మరోవైపు చెప్పారు.  పైగా పోలీసులకు వైద్యం చేసినట్టు చెప్పిన కేర్ డాక్టర్ వీరిద్దరి దుస్తులపైనా రక్తపు మరకలు లేనేలేవని చెప్పాడు. పోలీసులు చెప్పిన అబద్ధాలు అతకలేదన్న మాట. సైదుపల్లి అనే పోలీసు ఉద్యోగిని శివ అనే నిందితుకు కర్రతో కొట్టాడనీ, వెంకటేశ్వర్లు అనే మరో పోలీసు ఉద్యోగిపైన జొల్లి నవీన్ అనే కుర్రవాడు రాళ్ళతో దాడి చేశాడనీ పోలీసులు చెప్పిన కథనం సాక్ష్యాధారాలు లేక బూటకమని తేలిపోయింది.

అదే విధంగా నలుగురు అనుమానితులూ తమ చేతుల్లోంచి పిస్తోళ్ళను లాక్కున్నారనీ, ఆ తర్వాత తమ పైన కాల్పులు జరిపారనీ, తాము ఎదురు కాల్పులు జరపవలసి వచ్చిందనీ పోలీసులు చెప్పారు. తమ దగ్గరి నుంచి లాక్కున్న ఆయుధాలతో నిందితులైన ఆరిఫ్, చెన్నకేశవులు జరిపిన కాల్పులలో తక్కిన ఇద్దరు మరణించి ఉండవచ్చుననే పోలీసుల వాదనలో పస లేదని కమిషన్ నిర్ణయించింది. ఇది కూడా అబద్ధమేనని కమిషన్ తేల్చింది. పోలీసులు తమకు బందీలుగా ఉన్న నలుగురు యువకులపైన కాల్పులు కావాలనే జరిపి నలుగురినీ హత్య చేశారని కమిషన్ స్పష్టంగా తేల్చిచెప్పింది. సాక్ష్యాధారాలు సమర్పించినట్లయితే వాస్తవం ఎక్కడ వెల్లడి అవుతుందోనని పోలీసులు కమిషన్ కు సీసీ టీవీ టేపులను సమర్పించలేదుని కమిషన్ వ్యాఖ్యానించింది.

నలుగురిని కాల్చి చంపిన తర్వాత మూడు రోజులకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కల్పనాకన్నబీరన్  ‘ద హిందూ’లో ఒక వ్యాసం ప్రచురించారు. ‘నేరవిచారణకు చట్టం ఒకానొక పద్ధతిని నిర్దేశించింది. ఈ విధానం రాజ్యాంగ సూత్రాలకు లోబడి ఉంటుంది. రాజ్యాంగపాలనను సజీవంగా ఉంచాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని పెద్దలు రాపాడారు. ‘చట్టం ప్రకారం అనివార్యమైతే తప్ప ఏ మనిషికీ 21వ అధికరణ ప్రసాదించిన వ్యక్తిస్వేచ్ఛను కానీ ప్రాణాలకు భద్రతను కానీ ఎవ్వరూ పరిహరించరాదు. చట్టం నిర్థారించిన విధానం ప్రకారం ఏ వ్యక్తి ప్రాథమిక హక్కులను కూడా హరించరాదు,’ అని రచయితలు గుర్తు చేశారు.     

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles