- మూఢనమ్మకం కాదు, శాస్త్రీయం
- విటిమిన్ – డి ప్రదాత సూర్వుడు
- యోగలో అంతర్భాగం, ఆరోగ్యప్రదం
భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ ‘గ్లోబల్ సూర్య నమస్కార్’ కార్యక్రమాన్ని చేపట్టింది. జనవరి 14 వ తేదీన నిర్వహించాలని నిర్ణయించింది. పాల్గొనాలనుకునేవారు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా ఈ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చెయ్యడం ఎంతో అభినందనీయం. కోవిడ్ -19 ను ఎదుర్కొన గలిగిన శక్తి సూర్య నమస్కారాల ద్వారా సాధించవచ్చు అనే భావనను ప్రధానంగా నిలుపుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్గనిర్దేశం చేసినట్లుగా కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి సర్బానంద్ వివరించారు. సంక్రాంతి పర్వ దినాలలో సూర్య నమస్కారాలు చేయడం లేదా శ్రీకారం చుట్టడం శుభకరం, సుఖకరం, పరమ ఆరోగ్యకరం.ఇది మనం కొత్తగా నేర్చుకుంటున్న విద్య కాదు. వందల సంవత్సరాల పూర్వం నుంచీ భారతీయులు సాధన చేస్తున్న యోగాభ్యాసంలో భాగమే ఈ విన్యాసం.
Also read: యూపీలో బీజేపీకి టోపీ
ఇది యోగవిద్య
ఇది నూటికి నూరు పాళ్ళు ‘యోగ విద్య’. మానసిక,శారీరక శక్తిసామర్ధ్యాలను పెంపొదించడంలో దీని పాత్ర అమోఘం. సూర్యశక్తికి మోకరిల్లడం మానవ పరిణామ క్రమంలో అనాదిగా ఉన్న ఆచారం. ఎప్పుడు మేల్కొని పనులు చేస్తూ ఉండాలి,ఎప్పుడు నిద్ర ద్వారా విశ్రమించాలి అని తెలిపేది సూర్య చంద్రులే. ఆరోగ్య ప్రదాత కాబట్టే సూర్యుడిని ‘ప్రత్యక్ష నారాయణుడు’గా భారతీయులు భావించి, పూజిస్తారు. ఇది మూఢ నమ్మకం కాదు, గొప్ప ఆరోగ్య సూత్రం. విటమిన్ – డి లోపంతో నానా బాధలు పడుతున్న ఆధునిక మానవుడు ఆ వెలుగు కోసం, వేడి కోసం బయటకు రాక తప్పదని వైద్యులు సూచించిన తర్వాత కానీ, సూర్యుడి విలువను తెలుసుకోలేకపోతున్నాడు.
Also read: మౌనమే మాయావతి భాష
నాగరిక ప్రస్థానంలో మానవులు విద్యావంతులైన తర్వాత సూర్యుడిని నమస్కరించే క్రమానికి ఒక సిలబస్ ను తయారు చేసుకున్నారు. ‘యోగవిద్య’లో భాగంగా ఆసనాలతో పాటు సూర్య నమస్కారాలు చేయడం ఒక పద్ధతి. నమస్కరించే క్రమంలో ఉఛ్వాస నిశ్వాసలతో, మంత్రోచ్చరణతో సూర్య నమస్కారాలను సాధన చేయడం ఉన్నతమైన మార్గంగా భావిస్తారు. ఆ మంత్రాక్షరాలను పలకడం కూడా ఆరోగ్యదాయకం. అందులో గొప్ప రసాయనిక చర్య దాగివుంది. యోగాసనాలు, ప్రాణాయామం, మంత్రోపాసన, ధ్యానం, శారీరక శ్రమ అన్నీ ఇందులో మిళితమై ఉన్నాయి. ప్రధానంగా 12 భంగిమలు ఉంటాయి.
ఒకొక్క భంగిమలో ఒక్కొక్క యోగాసనం ఉంది. హస్త ఉత్తానాసనం, పాద హస్తాసనం, ఆంజనేయాసనం, పర్వతాసనం,సర్పాసనం మొదలైన ఆసనాలు ఉన్నాయి. సాష్టాంగ నమస్కారం కూడా ఈ సాధనలో అలవాటవుతుంది. సూర్య నమస్కారాల సాధన సర్వరోగ నివారిణి. జ్ఞాన సముపార్జనకు మనిషిని మానసికంగా సిద్ధం చేయడంలో సూర్య నమస్కారాల పాత్ర వెలకట్టలేనిది.
Also read: లాక్ డౌన్ అనివార్యమా?
రోగనిరోధక శక్తి
సహనం,సంతోషం,విశ్లేషణ, వివేకం అన్నీ సాధనలోకి వస్తాయి. రూపాయి డబ్బు ఖర్చు లేదు, కాస్త సమయాన్ని వెచ్చిస్తే చాలు. మనసును నిలిపితే చాలు అనంతమైన ఆరోగ్యసంపద దరి చేరుతుంది. కోవిడ్ వంటి వైరస్ లను తట్టుకోగలిగిన సామర్ధ్యం, రోగ నిరోధక శక్తులు సొంతమవుతాయి. సామాజిక ఆరోగ్యం కూడా నిర్మాణమవుతుంది.
కేంద్ర ఆయుష్ శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక యోగ శిక్షణా కేంద్రాలు, ఇండియన్ యోగా అసోసియేషన్, నేషనల్ యోగా స్పోర్ట్స్ ఫెడరేషన్ మొదలైన సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి. ప్రపంచానికి యోగవిద్యను, మార్షల్ ఆర్ట్స్ ను పరిచయం చేసిన మన దేశం తిరిగి పూర్వ వైభవాన్ని సాధిస్తుందని ఆశిద్దాం. మన విద్యలను మనమే కాపాడుకుందాం.మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకుందాం.
Also read: ఎన్నికల నగారా మోగెన్