రామాయణమ్ – 65
గోదావరిలో స్నానము చేసి సకల దేవతార్చనము పూర్తి చేసి తిరిగి పర్ణశాల చేరుకొని సుఖంగా ముగ్గురూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు.
అప్పుడు.
ఒక ముసలి రాక్షస స్త్రీ, అక్కడకు వచ్చి దగ్గరగా రాముడిని చూసింది.
నయనమనోహరంగా కనబడ్డాడు రాముడు దానికి.
Also read: పంచవటిలో పకడ్బందీగా, సుందరంగా పర్ణశాల నిర్మాణం
విశాలమైన వక్షస్థలం, బలిష్ఠమైన బాహువులు, విచ్చిన తామరపూవుల వంటి కన్నులు, నల్లకలువ వంటి శరీర ఛాయ, మన్మధుని వంటి సౌందర్యముతో మహేంద్రుడిలాగా ఠీవిగా ఉన్నాడు రాముడు.
రాముడిని చూడగానే దాని మనస్సును మన్మధబాణాలు సూటిగా వేగంగా వచ్చి తాకాయి.
రాముడి ముఖము చాలా అందముగా ఉన్నది, దాని ముఖము వికృతము!
రాముడి నడుము సింహపు నడుములాగా సన్నగా ఉన్నది. దానిది బాన పొట్ట.
ఆయన నేత్రాలు విశాలము, దాని నేత్రాలు వికారము!
ఆయనది నల్లని జుట్టు, దానిది రాగి జుట్టు.
Also read: పంచవటి సందర్శన
చూసేవారి కన్నులకు ఆనందము కలిగించే రూపము ఆయనది, దానిది భయంకరమైన రూపము.
ఆయన కంఠ ధ్వని మధురము, దాని పలుకులు కర్ణ కఠోరమైనవి.
ఆయన నవయవ్వనుడు. ఆవిడ వృద్ధురాలు.
ఆవిడ పేరు శూర్పణఖ. ఆవిడ రావణుడి చెల్లెలు!
రాముడిని సమీపించి రాముడితో ‘‘ఎవరు నీవు? భార్యా సమేతుడవై, ధనుర్బాణాలు ధరించి ముని వేషముతో, రాక్షస నివాస ప్రాంతమునకు ఎందుకు వచ్చావు? నీకు ఏమి పని ఇక్కడ?’’ అని పలికింది.
‘‘నీవెవ్వరవు?’’ అని శూర్పణఖ అడిగిన ప్రశ్నకు ఉన్నదున్నట్లుగా తెలిపాడు రాముడు. తమ ముగ్గురి పేర్లు తాము అడవికి ఎందుకు వచ్చినదీ సవివరంగా తెలిపాడు. రాముడు ఋజువర్తనుడు కావున ఏదీ దాయకుండా చెప్పాడు.
Also read: అగస్త్య ముని చెంతకు సీతారామలక్ష్మణులు
తమ గురించి చెప్పి ‘‘మరి నీవెవరవు?’’ అని అడిగాడు
అందుకు ఆ రాక్షసి “రావణో నామ మే భ్రాతా బలీయాన్ రాక్షసేశ్వరః”
‘‘విశ్రవసుని కుమారుడైన రావణుడు నా సోదరుడు. వాడు మహా బలవంతుడు.
ఎల్లప్పుడూ నిద్రలో ఉండే కుంభకర్ణుడు, ధర్మాత్ముడు రాక్షస ప్రవృత్తిలేని విభీషణుడు కూడా నా సోదరులే’’ అని పలికింది.
పరాక్రమవంతులైన ఖరదూషణులు నా సోదరులు.
‘‘రామా, నేను వాళ్ళెవరినీ లెక్క చేయను. నిన్ను తొలిసారిగా చూసిన దగ్గరనుండీ మనోభావముచేత నిన్ను భర్తగా అనుకున్నాను. నా ఇష్టము వచ్చిన చోటికి విహరింపగల శక్తి నాకున్నది. రా, నాతొ ఉండు. నా భర్తగా ఉందువుగాని, ఈ సీతతో నీకేమి పని?
Also read: రాక్షసులతో రాముడికి అకారణ వైరం ఎందుకు: సీతమ్మ ధర్మసందేహం
ఈ సీత ఆకారము, రూపములో కూడా వికారముగా ఉన్నది. నీకు తగినది కాదు. నేనే నీకు తగిన దానను. నన్ను భార్యగా పొందు. ఈ మనుష్య స్త్రీ ఆకారమేమిటి ఇలా ఉన్నది? ఈమె పొట్ట లోనికిపోయి అణగి ఉన్నది. దీనిని తినివేస్తాను నేను. మనమిరువురమూ కలిసి దండకారణ్యములో స్వేచ్చగా విహరిద్దాము’’ అని పలికింది.
దాని మాటలన్నీ విన్న రామచంద్రుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు.
Also read: దండకారణ్యంలో నివాసయోగ్యమైన స్థలంకోసం రాముడి అన్వేషణ
వూటుకూరు జానకిరామారావు