రామాయణమ్ – 71
‘‘కోదండమో అది అసురుల పాలిటి యమదండమో, ధనుర్ధారి రాముడిని చూడగానే దండధారి యముడు గుర్తుకు వస్తాడు. ఆయన చేతిలోని ఆటబొమ్మ ఆ ధనుస్సు! ఎప్పుడు బాణము తీస్తున్నాడో, ఎప్పుడు సంధిస్తున్నాడో, ఎప్పుడో వదులుతున్నాడో, చూసేవారి కన్నులకు అస్సలు అగుపడదు. మన సైన్యములోని వారు టపటప నేలకూలడమే నాకు కనుపించింది. వడగళ్ళవానకు పంటచేలు నాశనమైనట్లుగా మనవారు చనిపోవడమే నేను చూశాను.
Also read: రావణాసురిడిని తూలనాడిన శూర్పణఖ
‘‘ఒంటరివాడు. పైగా పాదచారి. వీడేమిచేయగలడు? అని అనుకుంటే కేవలము ఒకటిన్నర ముహూర్త కాలములో అందరినీ మట్టుబెట్టాడు. ఆడుదానిని చంపటము ఎందుకని నన్ను ఒక్కదానిని మాత్రము వదిలివేశాడు. రాముడికి ఒక తమ్ముడున్నాడు వాడు వీడి అంతటి వాడు. అన్న అంటే వానికి సర్వస్వము. వాడు రాముడికి బయట తిరుగాడే ప్రాణము. వాని పేరు లక్ష్మణుడు. రాముడి వెంట అతని భార్య కూడా ఉన్నది. ఆవిడ పేరు సీత. ఆవిడ సౌందర్యాన్ని ఏమని వర్ణించను! ఆమె శరీరము తళుకులీనే బంగారు కొండ! ఆమె శరీరపు సుగంధము సంపెంగ దండ వాసన వస్తున్నది! ఆవిడ ఇందు వదన, కుందరదన.
‘‘ఆ అందము ముల్లోకాలలో వెతికినా కాన రాదు. ఆ చక్క దనాల చుక్క నీ ప్రక్కన లేకపోవడమే నీకు తక్కువ. ఆమె వలపులు నీకు మాత్రమే తగినవనే తలపు నన్ను ఉసిగొల్పగా నీకు కానుకగా ఆ జవ్వనిని ఇవ్వాలని నేను ప్రయత్నించాను. కానీ నా ప్రయత్నాన్ని క్రూరుడైన లక్ష్మణుడు వమ్ము చేసి నా అవయవములు ఖండించి నన్ను విరూపను చేశాడు. ఆ సుందరిని చూశావా ఇక అంతే సంగతులు. మన్మధుడి బాణాలు నీ ప్రాణాలు తోడేస్తాయి. లే! ఇక ఆలస్యము చేయకు. నీ కుడి పాదము ఇప్పుడే ఎత్తు !(బయలుదేరు). ఆవిడని ఎత్తుకొనిరా’’ అని తొందర చేసింది శూర్పణఖ.
Also read: సీతను రావణుడు అపహరించాలని అకంపనుడి వ్యూహం
శూర్పణఖ చెప్పిన విషయము పూర్తిగా విన్నాడు. మంత్రులందరినీ వెళ్లిపొమ్మన్నాడు. తాను ఏమి చేయాలో దీర్ఘముగా ఆలోచించి గుణ దోష విచారణ పూర్తిగా చేసి చేయవలసిన పనిగురించి ఒక అవగాహనకు వచ్చి వాహనశాలకు చేరుకున్నాడు. రధాన్ని సిద్ధము చేయమని సారధికి ఆజ్ఞ ఇచ్చాడు. సారధి అతిశీఘ్రముగా రత్నాలంకార భూషితమైన రధాన్ని సిద్ధము చేశాడు. దానికి శ్రేష్ఠమైన గాడిదలు కట్టబడ్డాయి. వాటి ముఖాలు పిశాచాల ముఖములాగా ఉన్నాయి.
ఆ రధాన్ని ఎక్కి రావణుడు సముద్ర తీరము వైపుగా వెళ్ళాడు.
పది ముఖములు, ఇరువది భుజములు, పది కంఠములు, పది శిరస్సులతో వైఢూర్యమువంటి నిగనిగలతో స్వర్ణాభరణ భూషితుడై ఆకాశమార్గాన ప్రయాణం చేస్తుంటే చూసేవారికి కొంగలతోకూడిన నల్లటి మేఘములాగా కనపడ్డాడట.
ఆ తీరమంతా నయన మనోహరముగా ఉన్నది. వివిధ వృక్షజాతులు, ఎన్నో రకాల పక్షులు, గంధర్వులు, మునులు, దేవతలు, అప్సరసలు మొదలగు వారిచేత శోభాయమానముగా ఉన్నది.
Also read: ఖర,దూషణాదులను యమపురికి పంపిన రాముడు
ఆ సముద్రాన్ని దాటి ఆవలి వైపుకు వెళ్ళాడు రావణుడు అక్కడ సుందరముగా, పవిత్రముగా, ఏకాంతముగా ఉన్న ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు.
అక్కడ కృష్ణా జినాన్ని, జటలను, నారచీరను ధరించి ,ఆహార నియమాలు పాటిస్తూ తాపస వృత్తిలో ఉన్న ముని వేష ధారియైన మారీచుని చూశాడు. వచ్చిన రాక్షస రాజుకు యధావిధిగా అతిధి సత్కారాలు గావించాడు మారీచుడు. అంత త్వరగా మరల తనవద్దకు రావడానికి గల కారణమేమిటి? అని ప్రశ్నించాడు.
Also read: పెద్ద సేనతో రాముడిపై యుద్ధానికి బయలుదేరిన ఖరుడు
వూటుకూరుజానకిరామారావు