దిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి సుప్రీంకోర్టులో పరిస్థితి అనుకూలించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుపైన రాష్ట్ర హైకోర్టు లోగడ స్టే మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయం తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుపై స్టే విధించింది. వెంకటేశ్వరరావు టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ శాఖ అధిపతిగా పని చేశారు. ఆ సమయంలో తన కుమారుడి కంపెనీ పేరుతో డ్రోన్లూ, ఇతర నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయనీ, ఈ పరికరాలు దేశ భద్రతకు ముప్పువాటిల్లేవిగా ఉన్నాయనీ రాష్ట్ర ప్రభుత్వ ఆరోపించింది. ఈ కారణంపైన ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది. కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ కూడా రావును సస్పెండ్ చేయడం సమంజసనీయమేనని నిర్ణయించింది.
ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు చిసిన రెండవ సానుకూల నిర్ణయం. బుధవారం కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెప్టెంబర్ లో ఇచ్చిన స్టేను తొలగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వు ఇచ్చింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అడ్వకేట్ జనరల్ గా పని చేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇందుకు సంబంధించి రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక)లో పేర్కొన్న అంశాలను పత్రికలలో ప్రచురించరాదనీ, టీవీ చానళ్ళలో చూపించరాదనీ, సోషల్ మీడియా ప్రచారం చేయకూడదనీ చెబుతూ ఉత్తర్వు జారీ చేసింది. ఆ ఉత్తర్వు చెల్లదని సుప్రీంకోర్టు బుధవారం నాడు నిర్ణయించింది.