Sunday, December 22, 2024

సర్కార్ కు సుప్రీంకోర్టు దారి చూపుతుందా?

  • వ్యవసాయచట్టాల అమలు నిలిపివేయడం ద్వారా సంక్షోభం నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కిస్తుందా?

ఢిల్లీలో తీవ్ర స్థాయిలో జరుగుతున్న రైతు ఉద్యమం విషయంలో కీలక పరిణామాలు ఆరంభమయ్యాయి. కేంద్రం తీరుపై సుప్రీం కోర్టు  అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల పక్షాన నిలవడానికే ఎక్కువగా  మొగ్గు చూపినట్లుగా కనిపిస్తోంది. చట్టాలను రద్దు చేయడం తప్ప ప్రత్యామ్యాయాన్ని రైతులు కోరుకోవడం లేదు. చట్టాలను రద్దు చేయడానికి ప్రభుత్వం ఏ మాత్రం ఇష్టపడడం లేదు.

పట్టువదలని కేంద్రం

సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలోనూ కేంద్రం అదే సంకేతాన్ని న్యాయ వాదుల ద్వారా తెలిపింది. ఈ చట్టాల కొనసాగింపు విషయంలో ప్రభుత్వం పట్టు వీడేలా ఎక్కడా కనిపించడం లేదు. దీన్ని ఆత్మగౌరవ అంశంగానే కేంద్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. రైతులు -ప్రభుత్వం మధ్య నువ్వా? నేనా? అనే ధోరణి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఉద్యమంలో కొన్ని రాష్ట్రాల వారే పాల్గొంటున్నప్పటికీ, పెద్ద సంఖ్యలో రైతులు ,ఒకటిన్నర నెల నుండి  ఆందోళనలు చేస్తున్నారు.

ప్రాణాలకు తెగించి రైతుల పోరాటం

కరోనా, చలి,వయస్సు, ప్రాణం దేన్నీ వీరు లెక్క చేయడం లేదు. ఇతర దేశాలలోనూ వీరికి మద్దతుగా వాణి వినిపిస్తోంది. అన్నాహజారే వంటివారు కూడా ఉద్యమంలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. కేవలం రైతులే కాక, మిగిలిన రంగాల వారి నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. ఇదే ధోరణి ఇలాగే కొనసాగితే, మిగిలిన రాష్ట్రాల రైతులు కూడా ఈ ఉద్యమానికి తోడుగా నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Also Read : కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు

సుప్రీం కోర్టు చేసిన తాజా వ్యాఖ్యలను విశ్లేషించుకోవాలి.(1) నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు – కేంద్ర ప్రభుత్వం మధ్య ఉన్న ప్రతిష్ఠంభన తొలిగేంత వరకూ చట్టాలపై స్టే ఇవ్వాలనుకోవడం (2) సమస్య పరిష్కారానికి కమిటీ వేయడం, అందులో మాజీ ప్రధాన న్యాయమూర్తులు లేదా న్యాయమూర్తులు సభ్యులుగా ఉండడం, ఆ పేర్లను సూచించమని ప్రభుత్వాన్ని కోరడం, ఈ విషయంలో ఒక్కరోజు అలస్యాన్ని కూడా సుప్రీం సహించకపోవడం (3) రైతులు సమస్యలను కమిటీకి నివేదిస్తే, వాటిని  పరిశీలిస్తామని హామీ ఇవ్వడం (4) సమస్యను పరిష్కరించడం లో ప్రభుత్వం వైఫల్యం చెందిందనే అభిప్రాయాన్ని  వ్యక్తం చేయడం (5) చర్చల్లో ఏమి జరుగుతుందో కూడా తెలియడం లేదని అనడం (6) ఆత్మహత్యలు, మరణాలు సంభవిస్తున్న పరిణామాలను చాలా తీవ్రంగా తీసుకోవడం (7)దేశమంతా కూడా చట్టాల పట్ల వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్య చేయడం (8) చట్టాలు ప్రయోజనకరమని చెప్పడానికి ఒక్క ఉదాహరణ కూడా బలంగా కనిపించడం లేదని అభిప్రాయపడడం  (9) ఉద్యమం చేస్తున్నవారిలోని వృద్ధులు, మహిళలు వెనక్కి వెళ్లేలా చూడాలని కోరడం. ఇవి, ఈరోజు ప్రధానంగా సుప్రీం కోర్టు నుంచి వినవచ్చిన మాటలు.

కాలయాపన కుదరదు

దీన్ని బట్టి చూస్తే, కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తే కోర్టు ఊరుకునే పరిస్థితిలో లేదని అర్ధమవుతోంది. కమిటీ నివేదిక ఇచ్చేవరకూ వ్యవసాయ చట్టాలను నిలిపే విధంగా సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. ఈరోజు రేపటిలోపే ఈ తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి దాకా కేంద్ర ప్రభుత్వం – రైతు సంఘాల మధ్య ఉన్న ఆత్మగౌరవ సమస్యకు ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా జత చేరినట్లు కనిపిస్తోంది.

సాయినాథ్ సూచన శిరోధార్యం

రైతులు -ప్రభుత్వం మధ్య చర్చలు కొలిక్కి వచ్చి, కొత్త ప్రతిపాదనలు రూపు దిద్దుకునే వరకూ, కొత్త చట్టాలను సస్పెన్షన్ లో పెట్టడం మంచి నిర్ణయమని ప్రముఖ జర్నలిస్ట్,గ్రామీణ, వ్యవసాయ అంశాల నిపుణుడు, రామన్ మెగసేసే పురస్కార గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ ఎప్పుడో సూచించారు. ఈ అంశాన్ని ఎవరూ తలకెక్కించుకోలేదు. ఇప్పుడు సుప్రీం కోర్టు చేసిన సూచనలు దీనికి దగ్గరగా ఉన్నాయి.

చట్టాన్ని రద్దు చేసే అధికారం కోర్టుకు లేదు

“ఏ చట్టమైనా ప్రాథమిక హక్కులు, రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తప్ప చట్టాన్ని నిలిపివేసే హక్కు కోర్టుకు లేదు “, అని ఈ సందర్భంగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ప్రతిస్పందించారు. దీన్నిబట్టి చూస్తే, కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చట్టాలను రద్దు చేయదు అని మరోమారు అర్ధం అవుతోంది. ఈ చట్టాల వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనే మాటే కేంద్రం అంటోంది. కమీషన్ ఏజెంట్లు డబ్బులు ఖర్చు పెడుతూ, ప్రతిపక్షాలు చేయించే నకిలీ ఉద్యమంగానే బిజెపి పెద్దలు భావిస్తున్నారు. వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఎవరి రహస్య ఎజెండా ఇది?

ఢిల్లీ పెద్దలది కేవలం పట్టుదల, ఆత్మగౌరవ అంశం కాదని, అదాని, రిలయన్స్ పెద్దలతో ఉన్న అంతర్గత, రహస్య ఎజెండా, ఒప్పందంగానే ఉద్యమం చేస్తున్న  రైతు సంఘాలు భావిస్తున్నాయి. వ్యవసాయపరమైన వ్యాపారాలు మేము చేయడం లేదని ఇటీవలే రిలయన్స్ అధినేత ప్రకటించారు. ఇదంతా బూటకమని రైతు సంఘాలు ప్రతివ్యాఖ్య చేశాయి. దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో రైతు ఉద్యమం జరగడం ఇదే మొదటిసారి.

ఆకస్మికంగా మారిన ప్రభుత్వ వైఖరి

కేంద్రం 2017లో తెచ్చిన ఏ పి ఎం సి మోడల్ చట్టం  (అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ ),2018లో రూపొందించిన మోడల్ కాంటాక్ట్ ఫార్మింగ్ చట్టం ,వాటికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తెప్పించకున్న నివేదికలు, 2020లో ఈ అంశాల కేంద్రంగా ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో  మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకొని, కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేస్తే, సమస్యలు చాలావరకూ పరిష్కారమవుతాయని కొందరు వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు.

తెగేదాకా లాగుతున్నారా?

ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే, కేంద్ర పెద్దలు తెగే దాకా లాగుతున్నారని పరిశీలకులు  అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా, పట్టుదలకు పోకుండా, పట్టువిడుపులు పాటించి, సమస్యలను పరిష్కరించుకోవడం వివేకం. ప్రభుత్వ పెద్దలు, రైతు సంఘాల నాయకులు ఏమి చేస్తారో? చూద్దాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles