రైతులు చేపట్టిన నిరసనలను ప్రస్తుతానికి కొనసాగించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిరసనలు తెలిపే హక్కు రైతులకు ఉందని అయితే నిరసనల వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. సాగు చట్టాలు, రైతుల ఆందోళనలపై దాఖలైన పలు పిటీషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు విచారణ చేపట్టింది. తొలుత రైతులను ఖాళీ చేయించాలన్న అంశంపైనే విచారిస్తామని కోర్టు తెలిపింది. చట్టాలను రద్దు చేయాలన్న పిటీషన్లను తర్వాత పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.
సమస్య పరిష్కారానికి చర్చలే శరణ్యం
నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని రైతులు తమ ఆందోళన కొనసాగించవచ్చని ధర్మాసనం తెలిపింది. ఢిల్లీని నిర్బందిస్తే ప్రజలు ఆకలి కేకలు పెరుగుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే సమస్య పరిష్కారానికి ఇది ఒక్కటే సరైన పద్దతి కాదని చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. హింసాత్మక సంఘటనలకు పాల్పడడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నేతలు చర్చలు జరపాలని ఇరు పక్షాల వాదనలు వినేందుకు నిష్పాక్షిక, స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అన్ని రైతు సంఘాల వాదనలు విన్న తరువాతే కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: వ్యవసాయ సంక్షోభం : విభజనలు కావు, విన్-విన్ సొల్యూషన్ సాధించాలి
చట్టాల అమలు ఆపగలరా?
పిటీషన్ లపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానంలో విచారణ పూర్తయ్యే వరకు చట్టాల అమలుపై ఎలాంటి కార్యనిర్వాహక చర్చలు తీసుకోమని హామీ ఇవ్వగలరా అని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ ను ప్రశ్నించారు. అలా చేస్తే రైతు సంఘాల నేతలు చర్చలకు రాకుండా బెట్టుచేస్తారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం చర్చలు జరిపిన అన్ని రైతు సంఘాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వెకేషన్ బెంచ్ చేపడుతుందని ధర్మాసనం తెలిపింది.
ఇదీ చదవండి:రైతు సంఘాలకు చట్ట సవరణలపై ప్రతిపాదనలు పంపిన కేంద్రం
బీజేపీ నేతల కీలక భేటి
రైతుల ఆందోళనలతో నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరదించేందుకు బీజేపీ విస్తృతంగా చర్చలు జరుపుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ లు ఢిల్లీలో సమావేశమయ్యారు. సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇదీ చదవండి: ఉధృతంగా రైతుల ఆందోళన-పోలీసులకు కరోనా