- అంతర్గత విచారణ తర్వాతే నిర్ణయం తీసుకున్నామన్న న్యాయస్థానం
- తదుపరి సీజేఐగా జస్టిస్ రమణ నియామకం లాంఛనమే
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును ప్రతిపాదించిన రోజే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. జస్టిస్ ఎన్వీ రమణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదును సుప్రీం కోర్టు కొట్టివేసింది. అమరావతి భూ కుంభకోణంలో సీనియర్ జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ, ఫిర్యాదు సమయంలో ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న మరికొందరు జడ్జిలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని ఈ రోజు (మార్చి 24) వెల్లడించింది. సర్వోన్నత న్యాయస్థానం తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును సిట్టింగ్ సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన గంటల వ్యవధిలోనే ఫిర్యాదు పై సుప్రీంకోర్టు ప్రకటన విడుదల చేసింది.
జగన్ ఫిర్యాదు సారాంశం:
చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూ సేకరణలో భారీ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం జరిపిన దర్యాప్తులో ఆధారాలుకూడా లభించాయని వైఎస్ జగన్ ఆరోపించారు. దీనిపై విచారణ ముందుకు సాగకుండా ఏపీ హైకోర్టులోని కొందరు జడ్జిలు అడ్డుపడుతున్నారని వారికి సుప్రీంకోర్టు జడ్డి జస్టిస్ ఎన్వీ రమణ అండగా ఉన్నారంటూ 2020 అక్టోబరులో సీజేఐ బోబ్డేకు అఫిడవిట్ రూపంలో జగన్ ఫిర్యాదు చేశారు. భూ కుంభకోణంలో జస్టిస్ ఎన్వీ రమణ కూడా లబ్ది పొందారని జగన్ ఆరోపించారు. అంతేకాకుండా జగన్ తన ఫిర్యాదులో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పరోక్షంగా ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Also Read: సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్ వి రమణ
అంతర్గత విచారణ అత్యంత రహస్యం:
అమరావతి భూ కుంభకోణంలో జస్టిస్ ఎన్వీరమణ పాత్రపై జగన్ చేసిన ఫిర్యాదును అంతర్గతంగా అత్యంత రహస్యంగా విచారించిన తర్వాతే కొట్టివేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అమరావతి భూముల విషయంలో చేసిన ఫిర్యాదుపై నిబంధనల ప్రకారం ఇన్-హౌస్ విచారణ జరిపినట్లు సుప్రీంకోర్టు బుధవారం (మార్చి 24) విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. అదే సమయంలో జస్గిస్ రమణపై కోర్టులో అంతర్గతంగా సాగిన సుదీర్ఘ విచారణ తీరుతెన్నులు ఎప్పటికీ రహస్యంగానే ఉంటాయని సామాన్య ప్రజలకు వాటిని బహిర్గతపరిచే వీలుండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సీజేఐ ఎంపిక లాంఛనమే!
ఫిర్యాదు చేసిన 5 నెలల తరువాత అంతర్గత విచారణలో ఏపీ సీఎం ఫిర్యాదును తోసిపుచ్చామంటూ సుప్రీంకోర్టు ప్రకటించడం సంచలనంగా మారింది. తదుపరి సీజేఐగా జస్టిస్ రమణను ప్రతిపాదించిన కొద్ది గంటలలోనే సుప్రీంకోర్టు ప్రకటన విడుదల చేయడం విశేషం. దీంతో తదుపరి సీజేఐగా జస్టిస్ రమణ నియామకానికి అడ్డంకులు తొలగినట్లేనని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కుదరదు