- వైసీపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో వరుసగా మూడో విజయం
న్యూదిల్లీ : సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి ఎన్. వి. రమణపైన ఆరోపణలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైన తగిన చర్య తీసుకోవాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్ ను సుప్రీంకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది.
న్యాయమూర్తులు ఎస్.కె. కౌల్, దినేష్ మహేశ్వరి, హృషీకేశ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది: ‘‘పిటిషినర్లు జమిలి ప్రార్థన చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పరువుతీసే వ్యాఖ్యలపైన సీనియారిటీ ఉన్న ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తి చేత కానీ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేత కానీ దర్యాప్తు చేయించాలన్నది మొదటి వినతి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైన ఆరోపణలు చేసిన కారణంగా ఆయనకు ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత లేదంటూ రిట్ ఆఫ్ కోవారంటో జారీ చేయాలన్నది రెండో వినతి. రెండవ వినతి న్యాయపరంగా సమర్థనీయం కాదు. ఇక మొదటి వినతి విషయంలో పిటిషనర్ కు ఏమి కావాలో పిటిషనర్ కే తెలియదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలను ఆ విషయాలను పరిశీలిస్తున్న బెంచికి పంపిస్తున్నారు. తగిన సందర్భం ఉన్నప్పటికీ ప్రస్తుత పిటిషన్ ను పరిశీలించడంలో ప్రయోజనం లేదని భావించి పిటిషన్ ను కొట్టివేస్తున్నాము.’’
Also read: ఎఫ్ఐఆర్ పైన ఏపీ హైకోర్టు ఉత్తర్వును నిలిపివేసిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో సినియారిటీ ప్రకారం రెండో స్థానంలో ఉన్న న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణపైన అసత్యమైన ఆరోపణలు చేసినందుకూ, న్యాయనిర్వహణలో జోక్యం చేసుకున్నందుకూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపైన చర్య తీసుకోవాలని కోరుతూ ప్రాక్టీసు చేస్తున్న ఇద్దరు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన అదికార హోదాను దుర్వినియోగం చేసి న్యాయమూర్తిపైన అప్రదిష్టకరమైన వ్యాఖ్యలు చేయడం న్యాయవ్యవస్థ స్వేచ్చను దెబ్బతీయడమేనని పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరు న్యాయవాదులలో ఒకరైన జీఎస్ మణి కోర్టులో వాదించారు.
‘‘అది అప్రదిష్టకరమైన వ్యాఖ్య అయినప్పటికీ , దానిని (లేఖ) బహింరగపరిచిన తర్వాత అందులో దర్యాప్తు చేయవలసింది ఏమున్నది’’ అని జస్టిస్ కౌల్ ప్రశ్నించారు.
‘‘సవ్యంగా ఆలోచించకుండా దాఖలయ్యే ఇటువంటి వినతులను అంగీకరించజాలము,’’ అని కూడా అన్నారు.
న్యాయవ్యవస్థను పరిపాలన వ్యవస్థ అధిగమించరాదనీ, ప్రస్తుతం న్యాయమూర్తిగా పని చేస్తున్న వ్యక్తిపైన అసత్యమైన ఆరోపణలు చేయడం ద్వారా జగన్ మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థ స్వేచ్ఛను చిందరవందర చేశారనీ పిటిషనర్లు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ లు వాదించారు.
‘‘ఈ పిటిషనర్లతో సహా ఎవ్వరు కూడా ప్రభుత్వంలో అవినీతిని ఎన్నడూ సహించలేదు. అదే సమయంలో న్యాయవ్యవస్థ స్వేచ్ఛ, నైతికత చాలా ముఖ్యమైనవి. గౌరవనీయమైన న్యాయస్థానంపైనా, గౌరవనీయుడైన న్యాయమూర్తిపైనా అసత్యమైన ఆరోపణలు చేయడం ద్వారా ఒక రాష్ట్ర ప్రభుత్వాధినేతగా ఉన్న వ్యక్తి న్యాయవ్యవస్థను మించిపోకూడదు. న్యాయవ్యవస్థపైన ప్రజల విశ్వాసం అత్యంత ముఖ్యమైనది. న్యాయవ్యవస్థపైన ప్రజలు విశ్వాసం కోల్పోతే ఇక మిగిలేది ఏమీ ఉండదు,’’ అంటూ వారిద్దరూ వాదించారు.
‘‘రెడ్డికి సంబంధించిన అంశం ఏదైనా కోర్టులో అపరిష్కృతంగా ఉంటే ఆయన దాన్ని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొని వెళ్ళవచ్చు. అటువంటి న్యాయబద్ధమైన చర్యలు ఏమీ తీసుకోకుండా ‘అస్పష్టమైన ఆరోపణలు’ సర్వోన్నత న్యాయస్థానంలో పనిచేస్తున్న ఒక న్యాయమూర్తిపైన చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దాన్ని విడుదల కూడా చేశారు. సర్వోన్నత న్యాయస్థానం పరువుప్రతిష్టలను బజారుకీడ్చడమే ఆయన ఉద్దేశం,’’ అని అన్నారు.
తన వ్యక్తిగత లాభం కోసం న్యాయవ్యవస్థపైన ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి రెడ్డి ప్రయత్నించారనీ, ఆయనపైనే సీబీఐ, న్యాయస్థానాలు పెట్టిన కేసులు అనేకం ఉన్నాయనీ న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొని వచ్చారు.
రాజకీయంగా సున్నితమైన అంశాలలో ప్రధాన ప్రతిపక్షం ప్రయోజనాలను పరిరక్షించేందుకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోమన్ రెడ్డి భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డేకి అక్టోబర్ 11న ఒక లేఖ రాశారు.
లేఖ రాసిన తర్వాత నాలుగు రోజులకు ఒక శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం ముఖ్యమంత్రి ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను ఒక విలేఖరుల గోష్ఠిలో మీడియాకు విడుదల చేశారు. హైకోర్టులో న్యాయనిర్వహణపై సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్ వి రమణ ప్రభావం వేస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. బాబ్డే పదవీ విరమణ అనంతరం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడానికి జస్టిస్ రమణ సిద్ధంగా ఉన్నారు.
రెడ్డి రాసిన లేఖాంశాలు న్యాయవ్యవస్థపైన ప్రజల విశ్వాసాన్ని సడలించే విధంగా ఉన్నాయని పిటిషనర్లు విన్నవించారు. లోగడ ఇఎంఎస్ నంబూద్రిపాద్ కేసులో స్థిరీకరించిన సూత్రాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉల్లంఘించారని కూడా ఆరోపిస్తూ వారు నాటి తీర్పును పిటిషన్ కు తగిలించారు. సెప్టెంబర్ 15 వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను కూడా పిటిషన్ తో జోడించారు. అమరావతి భూముల కుంభకోణంపైన వ్యాఖ్యలు చేసిన ఎఫ్ ఐ ఆర్ లోని అంశాలను పత్రికలు ప్రచురించరాదనీ, టీవీ చానళ్ళ ప్రసారం చేయరాదనీ, సోషల్ మీడియా ప్రచారం చేయరాదనీ నిషేధపుటుత్తర్వులను సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం నవంబర్ 25 న కొట్టివేసింది. ఈ కేసును వచ్చే సంవత్సరం జనవరి (వచ్చే నెల)కు వాయిదా వేసింది.
Also read: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్సన్ పై స్టే తొలగించిన సుప్రీంకోర్టు