- రైతు సమస్యల పరిష్కారానికి కమిటీ
- ట్రాక్టర్ల ర్యాలీపై రైతు సంఘాలకు నోటీసులు
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త సాగుచట్టాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నలుగురు సభ్యులతో కమిటీని నియమించింది. భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు భూపేందర్ సింగ్ మన్, షేత్కారి సంఘటన్ నేత అనిల్ గణ్వంత్, వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ గులాటి, అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ కు చెందిన ప్రమోద్ జోషిలను కమిటీ సభ్యులుగా నియమించింది. కమిటీ ప్రభుత్వాన్ని శిక్షించడంకాదని కేవలం క్షేత్ర స్థాయి పరిస్థితులు పై ధర్మాసనానికి నివేదిక సమర్పించేందుకేనని కోర్టు తెలిపింది. నూతన సాగుచట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పిటీషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది.
ఇది చదవండి: సర్కార్ కు సుప్రీంకోర్టు దారి చూపుతుందా?
సాగు చట్టాలపై పరిష్కారం కావాలనుకునే వారంతా కమిటీని సంప్రదించాలని ధర్మాసనం సూచించింది. రైతులు నేరుగా లేదా తమ న్యాయవాదులద్వారా సమస్యలను కమిటీకి వివరించాలని తెలిపింది. అయితే రైతులు కమిటీ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేరని రైతుల తరపు న్యాయవాది ఎంఎల్ శర్మధర్మాసనానికి తెలియజేశారు. రైతులు చట్టాల రద్దుకే మొగ్గు చూపుతున్నారని న్యాయవాది తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం సమస్య పరిష్కారం కావాలంటే అభిప్రాయాలు చెప్పాల్సిందేనని చెప్పారు.
ఇది చదవండి: మెట్టుదిగని సర్కార్, రాజీపడని రైతు
ట్రాక్టర్ ర్యాలీపై రైతు సంఘాలకు నోటీసులు:
జనవరి 26న రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ పై సుప్రీంకోర్టు రైతు సంఘాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ సోమవారం చేపడతామని తెలిపింది. గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీ రాజ్ పథ్ లో ట్రాక్టర్ల ర్యాలీని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఢిల్లీ పోలీసు విభాగం దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ చేపట్టిన కోర్టు వివరణ ఇవ్వాల్సిందిగా రైతులకు నోటీసులు జారీ చేసింది.
కోర్టు తీర్పును స్వాగతించిన రైతు సంఘాలు:
మరోవైపు కొత్త సాగు చట్టాలపై సుప్రీంకోర్టు తీర్పును రైతు సంఘాలు స్వాగతిస్తున్నట్లు తెలిపాయి. అయితే చట్టాలను రద్దు చేసేవరకు ఆందోళనను విరమించేది లేదని తేల్చి చెప్పాయి. మరోవైపు 40 సంఘాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న కిసాన్ మోర్చా సమావేశం కానుంది. కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ముందు హాజరవ్వాలా లేదా అన్న అంశంపై తుది నిర్ణయం సమావేశంలో తీసుకుంటామని కిసాన్ మోర్చా స్పష్టం చేసింది.
ఇది చదవండి: రైతు సంఘాలు, కేంద్రానికి మధ్య కొలిక్కిరాని చర్చలు