- సూపర్ స్ప్రెడర్ అనే మాట నిందాపూర్వకమైనది
- ఫ్రంట్ లైన్ వారియర్స్ వంటి మాట వీరికి కూడా ఏదైనా ఉపయోగించాలి
కరోనాకు కళ్ళెం వేస్తూ తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా వివిధ సేవలందించే వర్గాల వ్యక్తులకు మే నెల 28 నుంచి 30 వరకు టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ఆటో, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బోయస్, కూరలమ్మే వాళ్ళు, దుకాణాలలో ఉండే వ్యక్తులు ఇలా నిత్య జీవితంలో ఎక్కువమందితో కలిసే అవకాశమున్న వర్గాల ద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రించాలనుకోవడం మేలైన ఆలోచనే. నిజానికి ఇటువంటి చర్యలు నెలన్నర క్రితమే తీసుకుని వుంటే బాగుండేది. వైద్యశాలల్లో సేవలందించే సిబ్బందిని ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా పరిగణించి టీకాలు వెయ్యడం మనకు తెలిసిందే. ఎందుకంటే రోగులకు సేవలందించే సమయంలో వారు ప్రమాదంలో పడకూడదు.
లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది ప్రజలు కాలు కదపకుండా జీవితం వెళ్ళబుచ్చుతున్నారంటే పాలు, దినసరి సరుకులు, కూరలు, ఔషధాలు, గ్యాస్ సిలిండర్లు ఇలాంటి వాటిని ఎంతోమంది తమ ఉపాధి కోసం సేవలందిస్తున్నారు. వీరు సేవలందించకపోతే ఇంటి గడపలోనే వుండే లక్షలాది మందికి జీవితం మరింత దారుణంగానే ఉండేది. అంతే కాదు కరోనా మరింతగా విజృంభించి ఉండేది.
ఇలా ప్రత్యేక టీకా వెయ్యాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు, సమాచారం ఇస్తున్నప్పుడు స్ప్రెడర్స్, సూపర్ స్ప్రెడర్స్ అనే మాటలు వాడుతున్నారు. ఈ మాటల వాడకంలో వాచ్యార్థం పరంగా తప్పు లేకపోయినా – ఆ వ్యక్తులతో ఈ మాటలు వాడడం ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితికి, వివక్షకు దారి తీస్తుంది. ఇది షాపింగ్ మాళ్ళను, థియేటర్లను, రద్దీగా ఉండే ప్రాంతాలను హాట్ స్పాట్స్ గా అనడం వంటిదే అని కొందరు భావించవచ్చు. ప్రాంతాలు వేరు, వ్యక్తులు వేరు అనే మౌలికమైన తేడా ను విస్మరించలేము.
నిజానికి ఇటువంటి అనాలోచిత పదప్రయోగం తరువాతి కాలంలో తొలగించుకోవడానికి చాలా శ్రమపడాల్సి వస్తుంది. ఇలాంటి విషయం చుట్టు సరిగ్గా సంవత్సరం క్రితం దూరం, సామాజిక దూరం, భౌతిక దూరం అనే పద ప్రయోగాల సంబంధించి ఎంత చర్చ జరిగిందో మనకు తెలుసు. కనుక దీనికి సంబంధించి ఇప్పుడే జాగ్రత్త అవసరం. మే 25 నుంచి ఈ మాట అధికార వర్గాలు దాటి మాస్ మీడియా, సోషల్ మీడియా ద్వారా జనసామాన్యంలోకి వచ్చేసింది. పరిస్థితి జటిలం కాకుండా తక్షణం ఈ మాటకు బదులు సెకండ్ లైన్ వర్కర్స్ వంటి గౌరవప్రదమైన మాటకోసం అన్వేషించి, ఆ మాటను ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. విపత్కర సమయంలో తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందించేవారికి తగిన మూల్యం మనమూ చెల్లించడం లేదు. కానీ, గౌరవించడం కన్నా ముందు, వారు వివక్షకు గురికాకుండా చూడటం మన విధి.
ఇక్కడ వివరంగా చెప్పుకోవలసిన అవసరం లేదు కానీ, హెచ్ ఐ వి/ ఎయిడ్స్ నియంత్రణ, నిర్మూలన సమయంలో, రెండు దశాబ్దాల క్రితం, నల్ల పోస్టర్లు, తెల్ల పుర్రెలు, ఎర్ర అక్షరాలు వంటి వాటిని ప్రపంచ వ్యాప్తంగా వాడి తరువాతి దశలో పరిహరించుకోవడం మనకు తెలిసిందే. అలాగే ట్రక్కు డ్రైవర్లు అంటూ, హైవేలు అంటూ బ్రాండు వేసి తరువాత ఆ మాటలను రద్దు చేసుకోవడం కూడా మనకు తెలుసు.
కనుక గౌరవప్రదమైన మాట వాడకం మన నాగరికతలో, మన సంస్కారంలో ప్రతిఫలించాలి.
Also read: నేడు రాజ్యాంగ రూపకల్పనకు మూలమైన జాతీయోద్యమ స్ఫూర్తి ఎక్కడ?
(రచయిత మొబైల్: 9440732392)