- క్రమశిక్షణ కృష్ణకు పుట్టుకతో వచ్చింది
- టాలీవుడ్, బాలీవుడ్ హద్దులు చెరిపేసిన వ్యక్తి
- ప్రజల గుండెల్లో ఆయనకు శాశ్వతంగా ‘సింహాసనం’
నిన్నటి తరం అధినాయకుల శకం కృష్ణ మరణంతో ముగిసిపోయింది.
ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు…ఈ నలుగురు టాప్ స్టార్స్. పై ముగ్గురు ఎప్పుడో వెళ్లిపోగా, చివరి తార కూడా మంగళవారం తెల్లవారుజామున రాలిపోయింది. వయసు రీత్యా వారందరిలో చిన్నవారు కృష్ణ. కానీ, ఆయన స్థానం విలక్షణమైంది. మాటలకందని మంచితనంతో అందరి గుండెలపై సింహాసనం వేసుకొని కూర్చున్నారు కృష్ణ. స్వర్గనరకాలు అనేవి నిజంగా ఉంటే అక్కడ కూడా ఆయన ఆసనం సింహాసనమే. నిజజీవితంలోనూ సింహంగానే జీవించారు. దేనికీ,ఎవ్వరికీ, ఎప్పుడూ వెరవలేదు, వెన్ను వంచలేదు, కన్ను దించలేదు. ‘నటసింహం’ ఎన్టీఆర్ ని కూడా ఎదిరించిన గుండెబలం ఆయనది. సహజమైన మంచితనం, పుట్టుకతో వచ్చిన క్రమశిక్షణతో కేవలం సుకీర్తిని మూటకట్టుకున్న పుణ్యపురుషుడు. ధైర్యం, సాహసం, శీలం, సౌందర్యం, విజ్ఞత, వివేకం, మానవత్వం కలిగిన మహోన్నతమూర్తి ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి.
Also read: ధార, ధారణ సంవిధాన ధౌరేయులు కొప్పరపు కవులు
ఎన్ని సాహసాలు చేశారో లెక్కలేదు
ఎనిమిది పదుల జీవితం, నాలుగు పదులపైబడిన సినిమా జీవితం జయప్రదంగా, శుభప్రదంగా సాగింది. 340కు పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించినా, ఎక్కువ భాగం హీరోగానే ఉన్నారు. మాస్, క్లాస్, టాలీవుడ్, బాలీవుడ్ బౌండరీలను చెరపేశారు. మంచినటుడు, గొప్ప నిర్మాత.అంతకుమించి మంచిమనిషి. ఆయన చేసినన్ని సాహసాలు ఎవ్వరూ చెయ్యలేదు, చెయ్యలేరు. ఎన్ని ప్రయోగాలు చేశారో లెక్కేలేదు. సంచలనాలు సృష్టించారు. ‘జ్యోతిచిత్ర’ పత్రిక నడిపిన పోటీలో ప్రతిసారీ ఆయనే సూపర్ స్టార్. సినిమా జీవితంలో తొలి అడుగులు వేస్తున్న తరుణంలోనే బాపురమణల వంటివారు ఆయనను హీరోగా తమ సొంత సినిమాకు ఎంపిక చేసుకున్నారు. ఆదుర్తి సుబ్బారావు వంటి అగ్ర దర్శకులు కూడా హీరోగా ఎంపిక చేసుకున్నారంటే మనం ఎవ్వరమూ దర్శించని, దర్శించలేని ప్రతిభను, కోణాన్ని వారు గుర్తించి ప్రోత్సహించి పోషించారు. కృష్ణలోని ప్రత్యేకతను గమనించినవారిలో అక్కినేని, కె విశ్వనాథ్ కూడా ఉన్నారు. ఎన్నో ఏళ్ళు రోజుకు మూడు షిఫ్ట్స్ పనిచేసిన ఘనత కృష్ణది. ఒకే రోజు ఒక పాత్ర నుంచి ఇంకొక పాత్రలోకి, దాని నుంచి మరో పాత్రలోకి వెంటవెంటనే పరకాయ ప్రవేశం చేయడం అసామాన్యమైన అంశం.
Also read: గుజరాత్ పై బీజేపీ గురి
ఆయన సినిమాలు సూపర్ హిట్స్
నిర్మాతగా ఆయన తీసిన అనేక సినిమాలు సూపర్ డూపర్ హిట్స్. కథల్లోనూ, పాత్ర పోషణలోనూ, నిర్మాణంలోనూ, నటీనటులను ఎంపిక చేసుకోవడంలోనూ ఆయనకు ఆయనే సాటి. చిత్రసీమలోని గొప్ప నటులంతా ఆయన సినిమాల్లో ఉండేవారు. తొలి సినిమా స్కోప్, కౌబాయ్ మొదలు ఎన్నో ప్రయోగాలతో సాహసాలు చేశారు.సంచలనాలు సృష్టించారు. ఆ చిట్టా చాలా పెద్దది. దర్శకత్వం చేపట్టి అక్కడా రాణించారు. హిందీలోనూ సినిమాలు తీసి, దర్శకత్వం వహించి తెలుగువాడి సత్తా చూపించారు. కృష్ణ నటించిన, నిర్మించిన సినిమాల గురించి చెప్పాలంటే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. అల్లూరి సీతారామరాజు, దేవదాసు, ఈనాడు, కురుక్షేత్రం, పండంటికాపురం, పాడిపంటలు, సింహాసనం…ఈ సినిమాలన్నీ ప్రత్యేకమైనవే భారతకథను, పాత్రలను ఏ మాత్రం వక్రీకరించకుండా తీసిన ధన్యత ఆయనకే చెందుతుంది. సినిమాలపై, తన బలబలాలపై స్పష్టత కలిగిన వ్యక్తి. సినిమా జయాపజయాలను కచ్చితంగా అంచనా వేయగలిగిన శక్తి ఆయన సొంతం. జ్ఞాపకశక్తి అమోఘం .ఎంత పెద్ద సంభాషణలనైనా ఏకబిగిన చెప్పగలిగిన ప్రజ్ఞామాన్యుడు.
Also read: అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు సమంజసమే
శ్రీశ్రీతో ప్రత్యేక అనుబంధం
ఛత్రపతి శివాజీ వంటి తన కలల ప్రాజెక్టును తెరకెక్కించలేకపోయారనే చిన్న చిన్న వెలుతులు తప్ప చాలా వరకూ ప్రతి సంకల్పాన్నీ నెరవేర్చుకున్నారు. రాజకీయాల్లో కొంతకాలం సందడి చేసినా అది కేవలం రాజీవ్ గాంధీతో అనుబంధం వల్ల మాత్రమే. రాజీవ్ మరణంతో రాజకీయాలకు స్వస్తి పలికారు. నిర్మాతలు,తోటి నటులు, సాంకేతిక నిపుణుల కష్టాలు తెలిసి నడుచుకున్న పెద్దమనిషి. నిర్మాతలను ఆదుకొని పరిశ్రమ పదికాలాల పాటు పచ్చగా ఉండాలని ప్రవర్తించిన పెద్దమనిషి. ప్రజలకు, ఆప్తులకు ఎన్నోసార్లు ఆపన్నహస్తం అందించి ఆదుకున్న ధన్యకీర్తి. ‘మహాకవి’ శ్రీశ్రీ అంటే కృష్ణకు చాలా ఇష్టం. వారిద్దరిదీ ప్రత్యేకమైన అనుబంధం. కృష్ణ నటించిన చివరి సినిమా పేరు ‘శ్రీశ్రీ’ కావడం కాకతాళీయమే అయినా అదే విశేషం. కృష్ణ జీవితానికి, సినిమా జీవితానికి సంబంధించిన మ్యూజియం ఏర్పాటుచేసి ఆ గొప్ప జ్ఞాపకాలను పదిలపరచాలి. కృష్ణ విజయంలో సోదరులు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు పాత్ర ఆదర్శప్రాయం. కొండను పిండి చేయగల గుండెబలం కలిగిన అసాధ్యుడు, అఖండుడు కృష్ణ గుండెపోటుతో మరణించడం అత్యంత విషాదం. ఇద్దరు భార్యలు, పెద్దకొడుకు వరుస మరణాలు ఆ గుండెను పిండి ఉంటాయి. ఆవేదనతో అలసిన ఆ గుండె ఆగిపోయింది. తెలుగువాడి గుండెల్లో కృష్ణ సూపర్ స్టార్ గా ఎన్నటికీ నిండే ఉంటారు. ఆ జ్యోతి అఖండంగా వెలుగుతూనే ఉంటుంది.
Also read: ఏ విలువలకీ ప్రస్థానం?