ఈ కాలపు ప్రపంచ చరిత్రలో ‘9/11’ ( సెప్టెంబర్ 11) మరువలేనిది, మరువరానిది. చూస్తుండగానే ఇరవై ఏళ్ళు గతించిపోయాయి. కళ్ళ ముందే వందల అంతస్తుల ఆకాశ హర్మ్యాలు పేకమేడల్లా కూలిపోయాయి. వేలాదిమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తర్వాతి కాలంలో అక్కడ నవ్య భవనాలు నిర్మాణమైనా ఆ రక్తపు మరకలు ఇంకా పచ్చిగా, వెచ్చగా అలాగే ఉన్నాయి. ఇంతటి ఘోరం, అంతటి అరాచకం జరిగింది ఎక్కడో కాదు. అన్నింటా మేమే అగ్రజులం అని గొప్పగా చెప్పుకొనే అగ్రరాజ్యం అమెరికాలో. సరిగ్గా ఇరవైఏళ్ల క్రితం, 11 సెప్టెంబర్ 2001నాడు ఆ మహా దుర్ఘటన జరిగింది. శతృదుర్భేద్యం అని భాకా భజాయించుకొనే అమెరికా దేశపు అగ్రభవనాలపై విమాన దాడులు జరిగాయి. ట్విన్ టవర్స్ గా పిలుచుకొనే డబ్ల్యూ టి ఓ (ప్రపంచ వాణిజ్య సంస్థ ) మహా నిర్మాణం నిముషాల వ్యవధిలోనే కుప్ప కూలిపోయింది. రక్షణశాఖ కార్యాలయంలోని ఓ మహాభవనాన్ని మరో విమానం ఢీకొట్టింది. శ్వేతసౌధం (వైట్ హౌస్ ) లక్ష్యంగా మరోదాడి జరిగింది. ఆ మారణహోమంలో 2996 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామిక్ ఉగ్రవాదానికి -అగ్రరాజ్యపు అహంకారానికి మధ్య జరిగిన పోరులో అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. తన అహంకారం పటాపంచలై పోయింది. ఆ చావుదెబ్బ కొట్టిన అల్ ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ ను అంతమొందించడానికి అగ్రరాజ్యానికి మరో పదేళ్లు పట్టింది. అదీ కుయుక్తితో… పాకిస్తాన్ సాయంతో, అఫ్ఘాన్ ఇంటలిజెన్స్ అధికారులకు డబ్బు ఎరచూపి బిన్ లాడెన్ ను అంతం చేయగలిగింది. అది కూడా సాక్షాత్తు పాకిస్తాన్ వేదికగానే సాగింది. పాక్ లోని అబోటాబాద్ లో తలదాచుకున్న బిన్ లాడెన్ ను 2 మే 2011 వ తేదీ అర్ధరాత్రి సమయంలో అమెరికా సేన హతమార్చింది. లాడెన్ అంతంతో తనపని చాలా వరకూ పూర్తయిందని అమెరికా భావించింది. అల్ ఖైదాను సమూలంగా నాశనం చేయాలనుకొని మరో పదేళ్లు పోరాడింది. కానీ అది జరగలేదు. కుదరలేదు.
Also read: ఆగ్రహంతో రగిలిపోతున్న అఫ్ఘాన్ మహిళలు
ఇంకా సజీవంగానే అల్ ఖైదా
అల్ ఖైదా బృందాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని ప్రపంచ దేశాలన్నీ గొల్లుమంటున్నా ఏమీ ఎరగనట్లు అమెరికా మౌనం దాలుస్తోంది. ఇస్లామిక్ ఉగ్రవాద ముఠాలు ఈ రెండు దశాబ్దాలలో మరింతగా పెరిగాయి, మరెంతో బలోపేతమయ్యాయి. ‘9/11’ దాడికి ప్రతిగా, అమెరికా ప్రతిదాడి మొదలు పెట్టి వచ్చే అక్టోబర్ 7వ తేదీకి ఇరవైఏళ్ళు పూర్తవుతాయి. ఆ దాడుల్లో భాగంగా అఫ్ఘాన్ ను అమెరికా తన స్వాధీనంలోకి తీసుకుంది. అప్పటి దాకా రాజ్యమేలుతున్న మరో ఉగ్రవాద ముఠా తాలిబాన్ ను దించి, ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికింది. అటు అల్ ఖైదాను – ఇటు తాలిబాన్ ను అంతం చేయాలని రెండు దశాబ్దాల పాటు భీకర సమరం చేసింది. కోట్లాది రూపాయలు కుమ్మరించింది. ఈ యుద్ధక్షేత్రంలో అన్ని వైపుల బలగాలతో పాటు అఫ్ఘాన్ సామాన్యపౌరులు కూడా బలైపోయారు. యుద్ధంలో అలసిపోయి లేదా కొత్త కుట్రకు తెరదీస్తూ అమెరికా తోక ముడిచింది. మళ్ళీ తాలిబాన్ ముష్కరులకు అఫ్ఘాన్ ను అప్పగించేసింది. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. రెండు లక్షల కోట్ల డాలర్ల వ్యయం బూడిదపాలైంది. జరిగిన నరబలి మరో నరబలికి స్వాగతం పలుకుతోంది. తాలిబాన్ మునుపటికి మించిన విజయగర్వంతో వీరవిహారం చేస్తున్నారు. ఉగ్రవాదం అంతరించక పోగా, మరింత ఉగ్రరూపం దాలుస్తోంది. అల్ ఖైదా అవశేషాలు అలాగే ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్ అఫ్ ఇరాక్ మహారూపాన్ని సంతరించుకుంది. అఫ్ఘానిస్థాన్, పాకిస్తాన్ వంటి దేశాలన్నీ ఉగ్రవాద ముఠాలకు అడ్డాలుగా మారాయి. తాలిబాన్ ను ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలోకి అమెరికా వెళ్ళిపోయింది. ఉగ్రవాద సంస్థల నుంచి ఏదో ఒక రోజు అమెరికాకు ముప్పు తప్పదని ప్రపంచ దేశాలు కోడై కూస్తున్నాయి. మళ్ళీ ‘9/11’ వంటి దుర్ఘటనలు పొంచేవున్నాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Also read: గుడారం పీకేసిన ప్రపంచ పోలీసు
చైనా వ్యూహం వేరు
ఇవ్వేమీ ఎరగనట్లు, తమ దాకా వచ్చినప్పుడు చూసుకుందామని అమెరికాను దెబ్బకొడదామని, భారత్ వంటి దేశాలను తన గుప్పెట్లో పెట్టుకుందామని మరో పెద్ద దేశం చైనా కొత్త నాటకానికి తెరదీసింది. తాలిబాన్ కు తాళం వేస్తోంది. చైనా వెంట తిరుగుతున్న రష్యా కూడా అదే పల్లవి అందుకొన్నది. ప్రతి సంఘటననూ తనకు అనుకూలంగా మలుచుకుంటూ, పాకిస్తాన్ తనదైన ద్వంద్వ,కాదు కాదు.. బహువైఖరితో దౌత్యం నడుపుతోంది. అటు అమెరికా -ఇటు చైనా రెండింటినీ పాకిస్తాన్ బుట్టలో వేసుకుంది. ఇక తాలిబాన్ తోనూ, ఉగ్రవాదులతోనూ ఎప్పటి నుంచో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతోంది. మొత్తంగా ఈ పర్వంలో, ఈ తరుణంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసింది, దౌత్యనీతిని ప్రదర్శించాల్సింది మనమే. ఇప్పటికే చైనాను,అమెరికాను నమ్ముకొని చాలా నష్టపోయాం. అఫ్ఘాన్ విషయంలోనూ అదే జరిగింది. ఇప్పటికైనా మేలుకోవాలి. విదేశాంగ విధానంలో మరింత రాటుతేలాలి. అమెరికాను నమ్మడం, దానిపైన పూర్తిగా ఆధారపడడం మానుకోవాలి. చైనా,అమెరికా, రష్యా వంటి దేశాలతో సత్ సంబంధాలను కాపాడుకుంటూనే ,మనం స్వయం శక్తిమంతులం కావాలి. తాలిబాన్ ప్రభుత్వంతోనూ దౌత్యం నెరపాలి. జమ్మూ,కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఆటలు సాగకుండా చూసుకోవాలి. మతపరమైన ఉగ్రవాదం ఎప్పటికైనా, ఎవరికైనా ప్రమాదమే. ఉగ్రవాదాన్ని సమూలంగా అంతచెయ్యడానికి దేశాలు ఏకం కాకపోతే… సమాజాలు అంతరించిపోతాయి. ఏ లక్ష్యం కోసం అమెరికా యుద్ధం ఆరంభించిందో, అది నెరవేరలేదు. ‘9/11’ మరకలు అరలేదు.అఫ్ఘాన్ ప్రజల రక్తకన్నీరు ఆగలేదు. అది మన దాకా పాకకుండా ఉండాలని కోరుకుందాం. తాలిబ్ అంటే విద్యార్థి (ఏకవచనం), తాలిబాన్ = విద్యార్థులు (బహువచనం). వీళ్లు విద్యార్ధులా??
Also read: తాజా అఫ్ఘాన్ రణక్షేత్రం పాంజ్ షీర్!
India’s make inIndia program needs verbal implimentstion and maintaining wise relations with world and Balanceddiplomacy