- విరాట్ సేనకు సన్నీ కితాబు
- విజయమంత్రం అదేనన్న మాజీ కెప్టెన్
పవర్ ఫుల్ ఇంగ్లండ్ తో జరిగిన క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టే విజేతగా నిలవడంతో మాజీ కెప్టెన్,విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్ పొంగిపోతున్నారు.ఇంగ్లండ్ తో తొలి అంచెగా ముగిసిన నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ను భారతజట్టు 3-1తో నెగ్గడం ద్వారా టెస్టు లీగ్ ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకొంది. అంతేకాదు రెండో అంచెగా జరిగిన పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ను సైతం భారతజట్టు 3-2తో గెలుచుకోగలిగింది.ఇక సిరీస్ లోని ఆఖరి అంచెగా ముగిసిన తీన్మార్ వన్డే సిరీస్ లోని ఆఖరిమ్యాచ్ ను 7 పరుగుల తేడాతో నెగ్గడం ద్వారా విరాట్ సేన సిరీస్ విజేతగా నిలిచింది.
విరాట్ నాయకత్వం అదుర్స్….
Also Read: విజయం మాది…అవార్డులు వారికా?
భారతజట్టు గత కొద్దివారాలుగా క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణించడమే కాదు ఇంగ్లండ్ లాంటి ప్రపంచ మేటి ప్రత్యర్థిని ఓడించగలగడం అపూర్వమని, విరాట్ కొహ్లీ నాయకత్వ ప్రతిభే దీనికి కారణమని గవాస్కర్ కితాబిచ్చారు.ఆట అన్ని విభాగాలలోనూ భారత్ అత్యంత సమతూకంతో ఉందని, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వికెట్ కీపింగ్ ఇలా ఏ విభాగం చూసినా దేనికదే సమతూకంతో కనిపిస్తోందని, మ్యాచ్ విన్నర్లు తుదిజట్టులో చాలామంది ఉండటం భారత్ బలమని క్రికెట్ దిగ్గజం గవాస్కర్ వ్యాఖ్యానించారు.శక్తిమంతమైన ఓపెనర్లజోడీ, కుదురైన మిడిలార్డర్ అంతకు మించి సమతూకంతో కూడిన బౌలింగ్ ఎటాక్, దూకుడుగా ఆడే వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ భారత అమ్ములపొదిలో ఉన్నారని గవాస్కర్ అభివర్ణించారు.
రోహిత్- శిఖర్ ఇద్దరూ ఇద్దరే…
భారత వన్డే జట్టుకు ఓపెనింగ్ జోడీనే ప్రాణమని, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ల రూపంలో దూకుడుగా ఆడే ఇద్దరు ఓపెనర్లు జట్టు బ్యాటింగ్ కు ఆయువుపట్టని గుర్తు చేశారు.కెప్టెన్ కొహ్లీ మూడువన్డేల్లో రెండు సూపర్ హాఫ్ సెంచరీలు సాధించడం, రాహుల్ ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాధించడం, రిషభ్ పంత్ క్రీజులోకి దిగిన ప్రతిసారీ స్కోరుబోర్డును పరుగులెత్తించడం భారత్ ను బలమైన జట్టుగా నిలిపాయని తెలిపారు.
అదే విజయమంత్రం…
ఓ జట్టులో 11 మంది ఉన్నా నిలకడగా రాణించే నలుగురు ఆటగాళ్లలో ఇద్దరు బౌలర్లు, ఇద్దరు బ్యాట్స్ మన్ ఉండితీరాలని, అదే ఏ జట్టు విజయానికైనా మూలమంత్రమని గవాస్కర్ విశ్లేషించారు. భారతజట్టులో అలాంటి ఆటగాళ్లున్న కారణంగానే అధికవిజయాలు, అల్పపరాజయాలతో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిందని చెప్పారు.తీన్మార్ వన్డే సిరీస్ లో భారతజట్టు 300కు పైగా స్కోర్లు అలవోకగా సాధించడమే దానికి నిదర్శనమని లిటిల్ మాస్టర్ కితాబిచ్చారు.
Also Read: భారత క్రికెటర్లకు సరికొత్త ముప్పు