Tuesday, November 5, 2024

రెండుకన్నుల రవిశశులు ఏకకాలన తేజరిల్లినట్టు

తిరుప్పావై -22

మాడభూషి శ్రీధర్

6 జనవరి 2024

అంగణ్ మాజ్ఞాలత్తరశర్ అభిమాన
బజ్ఞ్గమాయ్ నన్దు నిన్ పళ్ళిక్కట్టిల్ కీళే
శజ్ఞ్గమిరుపార్ పోల్ వన్దుతలై ప్పెయ్ దోమ్
కింగిణివాయ్ చ్చెయద తామరప్పూప్పోలే
శెంజ్ఞ్గణ్ శిరిచ్చిరిదే యేమ్మేల్ విళియావో
తింగళు మాదిత్తియను మెళున్దార్పోల్
అజ్ఞ్గణ్ణిరణ్డుం కొండు ఎజ్ఞ్గళ్ మేల్ నోక్కుదియేల్
ఎజ్ఞ్గళ్ మేల్ చాబ మిళన్దేలో రెమ్బావాయ్.

తెలుగు భావార్థ గీతిక

‘విపులాచ పృథ్వి’పై భూములేలెడు రాజులమెల్ల కదలి

పెద్దగుంపుగా వచ్చి నీ పాదపీఠము కింద నిలిచినాము

సింహాసనాహంకారములు వీడి నీవె శరణనికొలిచినాము

చిరుమువ్వ, అరవాయి, అరవిరియు కమలమ్మువోలె

రెండుకన్నుల రవిశశులుఏకకాలన తేజరిల్లినట్టు

వాత్సల్యాన ఎరుపైన ఆ కన్నులరవిచ్చి కాంచవయ్య

 ఆచూపుసోకిన జాలు మాశాపాలు పాపాలు కాలి పోవు

మాయలెరుగని మాకు నీ చూపులే నోముఫలములయ్య

అర్థం:

అమ్ = అందమైన, కణ్ = విశాలము, మా = పెద్దదీ అయిన ఞాలత్తర్ శర్ =ఈ భూమిని పాలించిన, అర్ శర్ = రాజులంతా, అభిమాన భంగమాయ్ =తమఅహంకారం విడిచి, వందు =వచ్చి, నిన్= నీ, పళ్లిక్కట్టిల్ కీజే = మంచం కింద, శఙ్గం =సంఘములుగా, ఇరుప్పార్ పోల్ = దాసులైఉన్నట్టే, వన్దు = వచ్చి తలైప్పెయ్ దోమ్ =మేము కూడా వచ్చి చేరిపోతిమి, కింగిణి =సిరిమువ్వ గజ్జెల వలె, వాయ్ చ్చెయ్ ద = నోరు తెరిచినట్టు, తామరైప్పూప్పోలే = తామర పూవుల వలె, శెమ్ కణ్ = వాత్సల్యపు చేత ఎర్రనైన నేత్రములను, శిణిచ్చిఱిదే = నెమ్మదినెమ్మదిగా కొద్దికొద్దిగా, ఎమ్మేల్ = మాపైన, విజియావో = ప్రసరింపచేయవా, తింగళుం= చంద్రుడూ, అదిత్తియమం= సూర్యుడూ, ఎజన్దార్ పోల్ = ఒకేసారి ఉదయించినట్టు చల్లని కాంతులీనుతూ, ఇరణ్డుం కొండు = రెంటిలోనూ, ఎంగళ్ మేల్ = మాపైన, నొక్కుదియేల్= చూపినట్టయితే, ఎంగళ్ మేల్ = మాపైనున్న, శాపమ్ = పాపములన్నీ నశిస్తాయి, ఏల్ ఓర్ ఎం పావాయ్ = ఇదే మా గొప్ప నోము.

Also read: నాకు మరేదారీ లేదు అంటేనే శరణాగతి

శాపములను, కర్మములు

సుందరమైన విశాలమైన ఈ భూమినేలిన రాజులు తమకంటే గొప్పవారు లేరనే అహంకారం వదులుకుని, తమను జయించిన సార్వభౌముని సింహాసనం కిందకు గుంపులుగుంపులుగా చేరినట్లు, మేము కూడా మా అభిమానాన్నిభంగం చేసుకుని వచ్చిఉన్నాం. చిరుగజ్జె ముఖం వలె, విడియున్న తామరపూవు వలె, వాత్సల్యంతో ఎరుపెక్కిన నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై చూపులను ప్రసరింపజేయి. సూర్య చంద్రులు ఇరువురు ఒకే సారి ఆకాశంలో ఉదయించినట్టున్న నీ రెండు నేత్రాలతో మమ్ము కటాక్షిస్తే మేము అనుభవించక తప్పని శాపములను, కర్మములు కూడా మమ్మల్ని వీడిపోతాయి అందుకే మా ఈ వ్రతము అని గోపికలు అంటున్నారు.

శ్రీకృష్ణుడు శయనించి ఉన్నప్పుడు, యుద్ధంలో సహాయం కోరి వచ్చిన దుర్యోధనుడు  పాదాల దగ్గర ముందు కూచున్నాడు. తరువాత అహంకారంతో ఈ యదుగోపాలుడి కాళ్లమీద కూచోవడమా అని వదిలేసి, తల తర్వాత కూచున్నాడట. అప్పుడు అర్జునుడు రాగానే ప్రేమతో పాదాభివందనం చేసి అక్కడే ఉంటాడు. నిద్రలేవగానే బావా ఎప్పుడు వచ్చినీవు అని ముందు అర్జునుడే చూస్తాడు. ఆ తరువాత కాస్సేపుతరువాత దుర్యోధనుడు కనపబడతాడు. ఈ లోగా సహాయం ఇవ్వడానికి ముందు కోరుకునే అవకాశం అర్జునుడికి ఇస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పార్థసారథి అయినాడు.  లేవగానే కనిపించినపుడు వెనుక ఇంత కథ ఉంటుంది.


‘‘నాకేమీ లేదు అంతా భగవానుడే’’

చీమకు బ్రహ్మకు కూడా అహంకారం సమంగానే ఉంటుందట. చీమకున్నంతలో చీమ అంతా తనదే ననుకుంటుంది. ‘నేను’ అనుభవిస్తున్నాననీ ‘నేనే’ చేస్తున్నానని అహంభావిస్తుంది. అయితే బ్రహ్మకే లభించని మోక్షం చీమకు ఏ విధంగా లభిస్తుంది? బ్రహ్మ ముందుగా తనకు విశాలమైన సంపద తన వల్లనే ఉందనుకుంటాడు. ఆ సంపదనంతా పరమాత్మకు సమర్పించి మోక్షము పొందాలని కోరుకుంటే, తన అత్యధిక సంపద అంతా సమర్పించడానికి చాలా సమయం పడుతుంది. ఆయన కోరిక ననుసరించి ఫలితంకూడా ఆ విధంగానే ఉంటుంది.

అదే శరణుగతి

ఏమీ లేని సామాన్యుడు ‘‘నాకేమీ లేదు అంతా భగవానుడే’’ అనుకుని నిశ్చింతగా ఉంటాడు. ఇతను ఇచ్చేది ఏమీ లేదు, ఆచరించేదీ ఏమీ లేదు. అంతా ఆయనే అనుకుని అన్నీ ఆయనకే వదిలిన వాడు గనుక భగవంతుడే ఆతని బాధ్యత వహిస్తాడు. అదే శరణాగతి. కనుక వాడు నిశ్చింతగా మోక్షం పొందుతాడు. చీమకే సులువు, సామాన్యుడికే మోక్షం సులువు. ప్రపంచాన్ని రెండేళ్లనుంచి అల్లకల్లోలం చేస్తున్న కోవిడ్ వైరస్ అతి సూక్ష్మజీవి అనుకుంటే దానికెంత అహంకారం ఉండాలి?

ఇంత విశాలమైన పృథ్విలో ఓ చిన్న రాజ్యానికి రాజైతే మొత్తం ధరిత్రినే ఏలుతున్నంత గర్వం నెత్తికెక్కుతుంది. పదవి పెరిగినాకొద్దీ అహంకారం అంతకంతకూపెరుగుతూ ఉంటుంది. ఆ పొగరు నశించడం కష్టం. వారిలో కొందరు రాజులు అశాశ్వతమైన ఈ పదవుల హీనత్వాన్ని అర్థం చేసుకుని అహంకారాన్ని వదిలించుకుని నీ రక్షణ కోరి వస్తారు. ఒక్కో రాజు మరింకే రాజుతోనో పరాజితులౌతూ ఉంటాడు. రాజులందరినీ ఓడించగల మహాపరాక్రమశాలివి నీవే కదా అంటూ శ్రీకృష్ణుడి సింహాసనం కిందకు చేరారు ఆ రాజులంతా. రాజ్యాలు అహంకారాలు వదులుకుని వచ్చిన రాజులు మళ్లీ తమకు ఏ హీనమైన పదవులు అంటగడతారో అనే వైరాగ్యంతో నీ శ్రీ చరణాలను ఆశ్రయిస్తున్నారు. మీ రాజ్యాలను మీరు సక్రమంగా పాలిస్తూ ఉండండి అని చెప్పినా నిరాకరించి భగవంతుని సన్నిధానంలోనే గుంపులు గుంపులుగా పడిఉన్నారట. స్వామీ వారి వలెనేమేము కూడా మా స్త్రీత్వాభిమానాన్ని బంధువులను భోగభోగ్యాలను వదులుకని నీ వాకిట నిలిచి ఉన్నాము. వారంతా మీ బాణాలకు గాయపడి ఓడిపోతే మేముం నీ సద్గుణాల ఓడిపోయి ఉన్నాం. మాకు ఏ జ్ఞాని మార్గదర్శకత్వమూ లేదు. జ్ఞానుల ఆచార్యత్వంలో కూడా పొందడం అసాధ్యమైన సర్వోన్నత పదవిని అజ్ఞానులమైన మా గొల్లపిల్లలకు మాకు మీ సన్నిధి లభించడమంటే మాటలా అని వారు ఆశ్చర్య చకితులవుతున్నారు. గోపికలు శత్రువులతో పోలిక తెచ్చుకుని వారి వలె మేమూ నీ శరణు కోరామని అంటే శ్రీ కృష్ణుడు వీరి హృదయాంతరాళములలో ఇంకా ఏముందోనని పరీక్షించాలనుకుంటాడట. అప్పుడు గోపికలు మరోసారి స్వామీ మాకు అన్యథా శరణం నాస్తి. (ప్రత్యామ్నాయం లేదు) ఇది అనన్య గతిత్వం.

Also read: జ్ఞాని నాకు ఆత్మతో సమానుడు – శ్రీకృష్ణ

దాశరథి రంగాచార్యుల వివరణ

         దాశరథి రంగాచార్యులు ‘‘పిడికిలి బిగించి వస్తాడు. చేతులు చాచుకుపోతాడు’’ అంటూ అన్నీ అశాశ్వతం అనే శాశ్వత నియమాన్ని అందంగా చెప్పారు. భూమి చిన్న మట్టి ముద్ద. ఈ మహాసృష్టిలో అది అణువంత: ఈ అణువులో మరింత చిన్న చుక్కంత రాజ్యం కోసం యుధ్దాలు చేస్తున్నారు. గెలుస్తున్నారు అనుభవిస్తున్నారు, అని రాజ్యం వదిలి సుకవి అయిన భర్తృహరి. సుకవితా యద్యస్తిరాజ్యేనకిం? అక్షరాన్ని మించిన అర్థం (సంపద) ఏముంది అంటున్నాడు.  జ్ఞానికి భూమండలం అణువుగా కనిపిస్తుంది. ఎందుకంటే జ్ఞానం భూమండలం కన్న గొప్పది. అజ్ఞానికి తనకున్న అణువంత భూమి అధికారమే మొత్తం భూమండలం అనిపిస్తుంది. అజ్ఞానం అంధకూపం వంటిది.

‘‘కానలేకున్న సింధువు బిందువయ్యే, కాన గల్గిన నా బిందువె సింధువయ్యె’’.

అజ్ఞానులైన అహంకార రాజులు అధికారం కోసం మారణ హోమం చేస్తున్నారు. ప్రజనుచీల్చి హింస విధ్వంసం సృష్టిస్తున్నారు. వారూ కనుమరుగౌతారు, వారి అభిమానాలు భంగమవుతాయి అని గోదమ్మ సుకవి భర్తృహరి మాటను తమిళ పాశురంలో వివరిస్తున్నారు.

ఆండాళ్ అమృత భాండాన్ని తిరుప్పావై రూపంలో అందించావు. ప్రతి పాశురం అమృత చషకం, మనముందే ఉంది, కాని మన జ్ఞానం పరిమితం దోసిలి చిన్నది, ఎంత తీసుకోగలం అని దాశరథి ప్రశ్నించారు. అహంకార మమకారాలు తొలగిపోవాలి. తొలగించడానికి స్వామి అనుగ్రహం కావాలి. రాజ్యం స్వచ్ఛందంగా వదులుకున్న వారు రాముడు బుద్ధుడు భరతుడు. రాజ్యాన్ని ఆశ్రయించబోనని పోతన, అన్నమయ్య అహంకారాలను వదిలించుకుని నారాయణుడిని ఆశ్రయించి ఆత్మజ్ఞానం సాధించి చరిత్రలోమిగిలిపోయిన అక్షర సంపన్నులు, మహానుభావులు.

శత్రురాశులు తమ బలాన్ని అభిమానాన్ని కోల్పోయి నీ శరణుజొచ్చినారు, మేము కూడా దేహాత్మాభిమానాలను వదులుకుని భగవంతుని శరణాగతి చేస్తున్నారని ఈ 22వ పాశురంలో ఆండాళ్ వివరిస్తున్నారు.

భగవతం ఇవ్వలేదని పోతన్న మీద రాజద్రోహనేరం మోపిన రాజెవరు?

ఈ పాశురం మనకు మన భక్తకవి బమ్మెర పోతనను గుర్తు చేస్తుంది. తన భాగవత కావ్యాన్ని రాజుగారికి అంకితం ఇవ్వాలని వత్తిడి తెస్తే, నిరాకరిస్తూ

‘‘కారే రాజులు, రాజ్యముల్ కలుగవే వారేరీ సిరిన్ మూటం గట్టుకపోవజాలిరే …’’

అని బలి పాత్ర ద్వారా  నిరసిస్తాడు పోతన. ఆయన చేసిన నేరం భాగవతం రాజుగారికి అంకితం ఇవ్వకపోవడమే. ఆకాలంలో ఒక చిన్నరాజ్యానికి ఉన్న రాజొకాయన పోతన కావ్యాన్ని బలవంతంగా లాక్కొని వెళదానుకుంటూ ఉంటాడు. అంతే కాదు పోతన్న మీద రాజద్రోహం నేరం మోపి స్థిరచరాస్తులన్నీ స్వాధీనం చేసుకుంటాడు. ఆ రాజుగారిది అహంకారం.ఆ రాజు పేరు కూడా ఎవరికీ తెలియదు. ఆ దురహంకారి అయిన రాజుకు పేరు గూడా లేదు,కాని పోతన్న భాగవతం ఈనాటికీ వెలుగుతూనే ఉంది.

విభీషణుడు, ద్రౌపది శరణు

రావణుడిది అహంకారం. అధికారం, అభిమానం. ఆ అభిమానం దెబ్బతీసే సలహా ఇచ్చాడు విభీషణుడు. విభీషణుడిది నిరహంకారం. శరణాగతి. సీతను రాముడికి అప్పగించమని హితవు చెప్పినందుకు తమ్ముడిని కాలితో తన్ని వెళ్లగొడతాడు రావణుడు. అక్కడినుంచే నేరుగా సముద్రతీరాన విడిసిన రాముని సన్నిధానానికి వెళ్లి నేలమీద దిగడానికి అనుమతి కోరుతున్నాడు. భార్యా పుత్రులను రాజ్యసంపదలను వదిలి ముగ్గురు మిత్రులతో కలిసి ఆకాశాన నిలిచి ఉన్నాడు. తనకు శరణిస్తూ కిందికి దిగుతానని సుగ్రీవుడితో చెబుతాడు. ఆ విధంగా శ్రీరాముని శరణు వేడుతాడు. రామా ఒకవేళ నీవు రక్షించకపోయినా నాకు వేరే దిక్కులేదు. నేను లంకకు మళ్లీ వెళ్లలేను అని వివరిస్తాడు విభీషణుడు. అదేవిధంగా మేము కూడా నీవేగతి అని వచ్చాము ప్రభూ అని  గోపికలు నివేదిస్తున్నారీ పాశురంలో. విభీషణ శరణాగతి అనన్యగతిత్వానికి ఉదాహరణగా చెప్పుకుంటారు.

ఇది మాజీరాజు బాధ నమ్మాళ్వార్ చెప్పిన కథ

 ఆ రాజు కొంతకాలం రాజ్యమేలి అనేక అధికారాలు అనుభవించాడు. తరువాత కొన్నాళ్ల రాజ్యహీనుడైనాడు. తిండికి, శరీరపోషణం కూడా కష్టమయ్యేదశకు చేరుకున్నాడు. కాని ఇదివరకు రాజునన్న అహంకారం మాత్రం పోలేదు. అందువల్ల పగటికూడా బిచ్చమెత్తడానికి కష్టమనిపించి, రాత్రి ఎవరూ చూడకుండా చీకటిలో బిచ్చమెత్తుకుందామని కుండపట్టుకుని వెళుతున్నాడట. నల్లని కుక్క ఒకటి పిల్లలను అంతకు ముందే ఈనింది. తన పిల్లలకు ఏ హాని కలుగకుండా ఎవరూ తొక్కకుండా ఉండాలని గుడ్లురిమి చూస్తూ చాలా కోపంగా కనిపిస్తున్నది.  కాని చిమ్మ చీకటి. దాని నలుపు రంగు చీకటిలో కలిసిపోయి అది ఏమీ కనిపించడం లేదు. దానిపైన మాజీరాజు కాలు పడింది. కుక్క వెంటనే గట్టిగా కరిచింది. అమ్మా అని అరుస్తూ రాజు కుండ చేజార్చుకున్నాడు. కుండ బద్దలైంది. ఆ చప్పుడుకు చుట్టుపక్కల వాళ్లు దీపం వెలిగించి ఏమైందో చూసారు. తీరా చూస్తే రాజుగారు. రాజు సంగతి తెలిసి పోయింది. ఆయన అభిమానం మరింతగా దెబ్బతిన్నదట. ఈ కథ చెప్పి ఇన్ని కష్టాలిచ్చే రాజ్యాన్ని పట్టుకుని వేళ్లాడకుండా నమ్మకూడని భౌతిక ప్రపంచాన్ని పట్టుకుని చెడిపోకుండా ఆ శాశ్వతానంద మూర్తి శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించండి అని నమ్మాళ్వారులు హితోపదేశం చేశారు.

Also read: నేను నాది అనే ఆలోచనలను వదులుకుంటే జ్ఞానం

ఏ చిన్ని అధికారమైనా సరే అహంకారం తెచ్చి పెడుతుంవది. రాజరికంతో పాటు అభిమానం కూడా వచ్చిచేరుతుంది. రాజ్యం పోతుంది, ఎన్నికలలో ఓడిపోతాడు. కాని అభిమానం అహంకారం మాత్రం పోవు.  నిరాశ నిస్పృహలలో మునిగిపోయి, ఆత్మహత్య చేసుకోవడమో, ఉన్న ఊళ్లోంచి పారిపోవడమోచ ఏ అడవుల్లోనో దాక్కోవడమో ఎందుకు? ఆత్మను ఉజ్జీవింపచేయడానికి సాధనమైన పరమాత్మసన్నిధానానికి చేరుకోవాలని నమ్మాళ్వార్ ప్రబోధించారు.

‘‘రాజ్యం నామ మహావ్యాధి: అచికత్సో వినాశనః’’ 

అంటే రాజ్యం అనేది స్వరూపాన్ని నాశనం చేస్తుంది. ఆ మహావ్యాథికి ఏ చికిత్సా లేదు. రాజ్యం ఉంటే అహంకారం, పోతే కలిగే దైన్యము విచిత్రంగా ఉంటాయి. కనుక దానిని నమ్ముకుని బాధపడకుండా శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించాలని నమ్మాళ్వార్ ఉపదేశం ఈ 22వ పాశురంలో తళుక్కున మెరుస్తుంది.

భరతుడి మంచితనం

భరతుడు ఎన్నడూ రాజునన్న అహంకారాన్ని దగ్గరకు రానీయలేదు. రాజ్యంపైన ఆయనకు ఆశలేదు. అభిమానమూ లేదు. ఒక సారి ఏకాంతముగా ఉన్నప్పుడు తల్లి కైక తనను రాజన్ అని సంబోధిస్తే భరతుడుభరించలేక మూర్ఛపోయినాడట. రామునికి దూరంగా ఉండడంవల్ల గుహుడు భరద్వాజుడు కూడా భరతుడు నిజంగానే రాముని రప్పించడానికే అడవులకు వెళ్తున్నాడా అని శంకించారట. తనదోషం లేదని, రాముని రఫ్పించడానికే వెళ్తున్నానని ఆయన పదేపదే అందరికీ చెప్పుకోవలసి వచ్చేది. దానికి కారణం ఆయన రాముని సన్నిధానంలో లేకపోవడమే. లక్ష్మణుడికి ఆ బాధ లేదు. రాముని సన్నిధానాన్ని వదలలేదు కనుక ఎవ్వరి అనుమానాలకు జవాబు చెప్పుకోవలసిన అవసరం లేకుండా పోయింది.

జీవ పరమాత్మ సమాగమం

చక్రవర్తి కుమారుడు చిన్నవయసులోతప్పి పోయి వేటగాని చేతిలో చిక్కి, అతని పెంపకంలో అతని బుద్దులే అలవరుచుకుంటాడు. వేటగాడవుతాడు. తరువాత ఎప్పుడో అదృష్ఠంకొద్దీ తన తండ్రి ఆ నగరపు రాజుగారేనని తెలుస్తుంది.  ఆ తనయుడు మరల తండ్రిని చేరుకోవడం వంటిదే జీవులు పరమాత్మను చేరడం. దాన్నే రాజులు భగ్నాభిమానులై చక్రవర్తిని చేరడం, గోపికలు శ్రీకృష్ణపరమాత్మను చేరడం.

వానరులతో నరుడి సఖ్య మేమిటి?

శ్రీమద్రామాయణంలో సీత వానరులకు రామునితో సమాగమం ఏ విధంగా సంభవించినారు. ఆశ్చర్యంతో హనుమను అడిగినారట. ఇదీ ప్రశ్న. అదొక పెద్ద వింత. హనుమ వివరిస్తాడు. హనుమ అడిగిన ప్రశ్నలో చాలా సమస్యలు ఇమిడి ఉంటాయి. అందులో ఆమె అనుమానాలు ఆ ప్రశ్న వెనుక ఉన్నాయి. రుజువుకు కావాలంటురాలి సీత. అసలు ఈ హనుమ దూత అవునో కాదో. రాముడు ఏ విధంగా ఉన్నాడో హనుమకు తెలుసా? సీత గగనం నుంచి వదిలిన ఆభరణాలు హనుమ, సుగ్రీవుడు చెప్పిన తరువాత, రాముడు లక్ష్మణుడు అవును అని సీతను గుర్తించి విలపించినవి అంశాలు రుజువులవుతాయని ఆయన జవాబులు అని అర్థం చేసుకున్నతరువాతే సీత నమ్మివచ్చినారు.మరో రహస్యం మరొకటేమంటే, సీత పురుషాకారం కట్టుకుంటేనే హనుమకు వచ్చే అవకాశం ఉండదు. అదేవిధంగా జీవాత్మ పరమాత్మల సమాగమం కూడా ఒక వింతేనట. అదేరీతిలో గోపికలకు శ్రీకృష్ణునికి సమాగమం కలగడం కూడా ఎంతో వింత, అదృష్టం కూడా.

మెల్లని చూపులు చల్లగా చూడవయ్యా స్వామీ

సూర్యకిరణాల వల్ల పూర్తిగా ఇంకా వికసించక వికసిస్తూ ఉన్న తామరపూవు వలె స్వామి దృష్టి ఉండాలట. తామరపూవు కింకిణి వలె నుండాలట. కింకిణి అంటే చిరుగజ్జె. లోపలచిన్న రాయి ఉంటుంది. అది కనబడకుండా, బయట పడిపోకుండా కొంచెం తెరిచినట్టు ఉంటుంది. తామర పూవులో తుమ్మెద కనపడుతూ, పూర్తిగా విడిపోకుండా కాస్త తెరిచి ఉన్నట్టు కింకిణి వలె ఉందట. అటువంటి తామర పూవు వంటి నేత్రాలతో తనను చూడాలని కోరుకుంటున్నారు. కనులలో నల్లని గ్రుడ్డు కనబడుతూ ఎఱ్ఱని కాంతులు వెదజిమ్ముతూ సగం వికసించిన నేత్ర సౌందర్యాన్ని చూడాలని గోపికలు తహతహ లాడుతున్నారు.

         అపరాధాలుచేసిన చేతనులను చూడగానే పరమాత్మవీరిని చూడరాదని కోపించి కళ్లు పూర్తిగా తెరవడట. నీళాదేవి పరమాత్మపై చేయి వేసి కరుణచూపాలని ఉద్భోదిస్తే నేత్రాలు కాస్త వికసిస్తాయట. జీవుల తప్పుడు కర్మల వల్ల స్వామి నేత్రాలు ముకుళిస్తాయి. కర్మానుగుణంగా చేతనులకు ఫలం ఇవ్వాలని పరమాత్మ భావన. ఈ కర్మ పారతంత్ర్యమువలన పరమాత్మ కన్నులు ముకుళింపజేస్తే, నమ్మిన వారిని ఆదుకోవలసి ఉంటుంది కదా అనే అమ్మవారి కరుణ వల్ల ఆశ్రిత పారతంత్ర్యము వికసింప చేస్తుంది. తామరపూవులు వికసించడానికి సూర్యరశ్మి ఎంత అవసరమో పరమాత్మనేత్రాలు వికసించడానికి జీవుల ఆర్తి ప్రధానం. తెరచీ తెరవి కన్నులతో చూడమని ప్రార్థిస్తున్నారు.


         నీవొకేసారి కన్నులు తెరిస్తే అంత కాంతి భరించగలమా ప్రభూ కనుక మెల్లమెల్లగా కన్నులు తెరచి చూడు. నీరులేక వాడిన చేనికి క్రమక్రమముగా నీరు పెట్టినట్టు, నీ కటాక్షాన్ని నెమ్మదిగా ప్రవహింపజేయి. క్రమక్రమముగా భగవదనుగ్రహాన్ని ప్రసరింపజేయాలని కోరుకున్నారు.


         సిరిమువ్వల వలె, అరవిరిసిన తామెర వలె నీ అర్థ నిమీలిత నేత్రాలను విప్పార్చి మమ్ము మీ నేత్రసౌందర్యం చూడనీయవా అని గోపికల ప్రార్థన. ‘‘చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు మెల్లమెల్లనే విచ్చి మేలుకొనవేలయ్యా’’  అంటూ

విన్నపాలు వినవలె వింత వింతలు

పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా

తెల్లవారె జామెక్కె దేవతలు మునులు

అల్లనల్ల నంతనింత నదిగోవారే

చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు

మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా

గరుడ కిన్నరయక్ష కామినులు గములై

విరహపు గీతముల వింతాలాపాల

పరిపరివిధముల బాడేరునిన్నదివో

సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా

పొంకపు శేషాదులు తుంబురునారదాదులు

పంకజభవాదులు నీ పాదాలు చేరి

అంకెలనున్నారు లేచి అలమేలుమంగను

వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా

అని అన్నమయ్య పాడినట్టు గోపికలు శ్రీకృష్ణుని కన్నులు తెరవమంటున్నారు. కవులు అందమైన కన్నులను తామెరలతో పోల్చుతూ ఉంటారు. కాని గోదాదేవి మాత్రం కొద్దిగా మాత్రమే తెరుచుకుంటున్నట్టున్న సిరిమువ్వ తో శ్రీ కృష్ణుని అరమోడ్పు కన్నులతో పోల్చడం ప్రత్యేకమైన అంశం.

గోవుల మెడకు కట్టిన మువ్వలు ఆమెకు స్వామి కన్నుల వలె కనిపించాయి. స్వామి ఒకేసారి కన్నులు పూర్తిగా తెరుచుకుంటే అంత కాంతిని, అంత కరుణారసాన్ని భరించగలమో లేదో అనే భయంతో మెల్లమెల్లనే విచ్చి మేలుకొనవయ్యా అంటున్నారు. అయ్యో కఠినమైన లోహపు మువ్వతో స్వామి కన్నులు పోల్చడమా అని బాధపడతూ, సూర్యచంద్రులే నీ నయనాలు అని మరో పోలిక తెస్తారు. చంద్రుని చూడగానే ముకుళించి, సూర్యుడు రాగానే వికసించే తామర ఇరువురూ ఒకేసారి ఉదయిస్తే సగం వికసించి సగం ముకుళించవలసి ఉంటుంది. కనుక స్వామి తామెర కన్నులు సగం తెరిచి సగం మూసి ఉన్నాయట.

తీక్షణత్వం ఆహ్లాదము

         తీక్షణత్వం ఆహ్లాదము అనే రెండు లక్షణాలు స్వామి నేత్రాలకు ఉన్నాయి. పరులకు వేడిగానూ స్వజనులకు చల్లగానూ ఉంటాయి. మమ్మల్ని నీతో చేరనీయని వారికి సూర్యుడి వలె, మాకు ప్రసన్నమైన చంద్రుని వలె నీవు కనిపించాలి. కాని ఒకే సారి ఇది సాధ్యమా? అయినా శ్రీ కృష్ణుడికి అసాధ్యం ఉంటుందా? అయినా ఏటేటా గ్రహణాలతో క్షీణించే సూర్య చంద్ర గ్రహాలతో స్వామి సుందర నయనాలను పోల్చడం సమంజసమా? అని గోదాదేవి మళ్లీ ఆలోచనలో పడుతుంది. చివరకు శ్రీకృష్ణుని నేత్రాలు పోల్చదగినదేదీ లేదని ఆయన కన్నులే ఆయనకు సాటి అంటారు.


         నా కటాక్షవీక్షణాలు మీమీద ప్రసరింపచేస్తే మాకేమి లాభం అని శ్రీ కృష్ణుడు అడిగితే గోపికలు ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు. నీవు కన్నులు తెరిచి మమ్మల్ని చూస్తే నీ వియోగం వలన కలిగే దుఃఖం తీరిపోతుంది. అనుభవించకతప్పని వియోగమే శాపం అని గోపికలు అంటున్నారు.

అనన్యార్హశేషత్వం      

అభిమానాలు వదులుకొని అహంకారాలు వదిలించుకుని నీ పాదపద్మములు తప్పఇతరములెఱుగమని శ్రీమన్నారాయణుని శరణు వేడితే ఉజ్జీవులమవుతామని వివరిస్తున్నారు గోదాదేవి. ముందు దేహాత్మాభిమానము పోగొట్టి తరువాత అనన్యశేషత్వమునుపయోగించి, ఆ పిమ్మట స్వస్వాతంత్ర్యమును తొలగించి, కరుణించి కైంకర్యము కలుగజేసి పరజ్ఞానము ఇచ్చి కర్మను నశింపజేసి పాపములు పోగొట్టమని గోపికలు ఈ పాశురంలో అనన్యార్హ శేషత్వమును ధృవీకరిస్తున్నారు. వీటితో పాటు 1. దేహమే ఆత్మ, 2. నేనే స్వతంత్రుడిని, 3. నా రక్షణ నేను చేసుకోగలను, 4. నేనే ఇతరులకు శేష భూతుడను, 5. ఆభాస బంధువుల పట్ల బంధుబుధ్ది, 6. విషయములందు భోగబుధ్ది అనే ఆరు భ్రాంతులు తొలగిపోవాలి. ఇది పరమాత్మ కరుణ తో మాత్రమే సాధ్యం.

         నీవు ‘‘పతిం విశ్వస్య’’ (విశ్వానికంతటకూ నీవే నాథుడివి విశ్వనాథుడివి జగన్నాధుడివి), నేనే అన్నీ ‘‘ఈశ్వరోహమహంభోగీ’’ అనే దురహంకారం వదులుకుని ‘‘దాసోహం కోసలేంద్రస్య’’ అంటూ మీశరణుజొచ్చాం. కనులు తెరిచి కరుణించవా ప్రభూ అని గోపికలు పాడే ఈ 22వ పాశురం మరో భగవద్విభూతిని వివరించే గొప్ప గోదాగీతం.

రాజులురాజ్యాలు శాశ్వతమా

రవి అస్తమించదనుకున్న బ్రిటిషు సామ్రాజ్యం, ప్రపంచాన్ని జయించాలనే హిట్లర్ దురాశ, సోషలిస్టు సామ్రాజ్యం, మనదేశంలో ఓడిపోదనుకున్న నియంతరాజ్యాలు కనుమరుగైపోయాయి. పోతాయి.  రాముడు బుద్ధుడే రాజ్యాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నవారు. రామునికి రాజ్యంపైన అభిమానం లేదు. బలవంతంగా రాజులను దించాల్సిందే. రాజులు ఉండరు. అవుతారు, రాజ్యాలు ఉండవు. కొత్త రాజ్యాలు కలుగుతాయి.

(శ్రీ కే ఇ లక్ష్మీనరసింహన్ ప్రసంగించిని చూసి వినవొచ్చు.Tiruppavai 22 Pashuram 6.1.2024, TTD.https://www.youtube.com/watch?v=Knw2dMLf6Vw)

Also read: కాటుక కన్నుల నీళమ్మా కృష్ణులశృంగారగీతం

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles