హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుక్కూ ఉండాలని కాంగ్రెస్ అధిష్ఠానవర్గం నిర్ణయించినట్టు తెలుస్తోంది. సుక్కూ కాంగ్రెస్ ప్రచార కమిటీకి అధ్యక్షుడిగా ఇటీవలి ఎన్నికలలో పని చేశారు. నాలుగు సార్లు అసెంబ్లీకి గెలుపొందిన 58 ఏళ్ళ సుక్కూ ముఖ్యమంత్రిగా ఉండాలనీ, జర్నలిస్టుగా జీవితం ప్రారంభించి రాజకీయాలలో దిగి అయిదు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ముఖేశ్ అగ్నిహోత్రి ఉపముఖ్యమంత్రిగా ఉండాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు.
‘‘నేను నా పదిహేడవ ఏట రాజకీయాలలో అడుగుపెట్టాను. కాంగ్రెస్ నాకు చేసిన మేలు ను ఎన్నటికీ మరవను. నేనూ, అగ్నిహోత్రి ఒక జంటగా పని చేస్తాం’’ అని సుక్కూ విలేఖరులతో అన్నారు. సుక్కూ రాహుల్ గాంధీకి సన్నిహితుడు. ఆయనకు మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ తో పడేది కాదు. ఆరు విడతల ముఖ్యమంత్రిగా పని చేసిన వీరభద్రసింగ్ నిరుడు జులైలోమరణించారు. ఆయన భార్య, మండీ లోక్ సభ సభ్యురాలు ప్రతిభాసింగ్ మొన్నటి ఎన్నికలలో పీసీసీ అధ్యక్షురాలుగా పని చేశారు. వారి కుమారుడు విక్రమాదిత్య సింగ్ సిమ్లా గ్రామీణ నియోజకవర్గం నుంచి మొన్న జరిగిన ఎన్నికలలో ఎన్నికైనారు.
ఇంతవరకూ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన వారిలో ముందుగా ఉన్న ప్రతిభాసింగ్ అధిష్ఠానవర్గం నిర్ణయాన్ని శిరసావహిస్తానని చెప్పారు. శుక్రవారంనాడు పరిశీలకులు జరిపిన సంప్రతింపులలో ఎంఎల్ఏ లలో ఎక్కువ మంది ప్రతిభాసింగ్ కు అనుకూలంగా లేరని తేలింది. అసంతృప్త నేతల బృందంలో ఒకరైన ఆనందశర్మ సుక్కూ ఎంపికను సమర్థించారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన సుక్కూను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినందుకు సోనియాగాంధీనీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖడ్గేనీ, రాహుల్ గాందీనీ, ప్రియాంకాగాంధీని ఆనందశర్మ అభినందించారు. హిమాచల్ ఎన్నికలలో ప్రియాంకది ప్రదాన పాత్ర. ఆమె విస్తృతంగా పర్యటించి, ఎన్నికల సభలలో ప్రసంగించి పార్టీ విజయానికి దోహదం చేశారు. పాదయాత్రలో ఉన్న రాహుల్ గాంధీ గుజరాత్ లో రెండు సభలలోనైనా మాట్లాడారు కానీ హిమాచల్ లో అడుగుపెట్టలేదు.
శుక్రవారంనాడు సిమ్లా హోటల్ లో సమావేశమైన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఏకవాక్య తీర్మానం ఆమోదించింది. ఆ తీర్మానం ద్వారా నిర్ణయం తీసుకునే బాధ్యతను పార్టీ అధిష్ఠానవర్గానికి అప్పజెప్పింది. ఈ రోజు మధ్యాహ్నం ప్రతిభాసింగ్ ను ఎంపిక చేసేటట్టు కనిపించకపోవడంతో ఆమె మద్దతుదారులు గొడవ చేశారు. అధిష్ఠానం పరిశీలకులు బస చేసిన హోటల్ దగ్గర సందడి చేశారు. నిన్న ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి బఘేల్ సమావేశానికి వచ్చిన సందర్భంగా ఆయన కారును ముట్టడించి ప్రతిభాసింగ్ ని మాత్రమే ముఖ్యమంత్రి పదవికి నియమించాలని అడిగారు.
సుఖ్వీందర్ సింగ్ సుక్కూ హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడుగా, ఎన్ ఎస్ యూఐ నేతగా రాజకీయ జీవితం ప్రారంభించారు. అనంతరం యూత్ కాంగ్రెస్ హెచ్ పీ విభాగం అధ్యక్షుడుగా పని చేశారు. తర్వాత పీసీసీ అధ్యక్ష పదవి నిర్వహించారు. ఆయన న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు. కానీ పూర్తికాలం రాజకీయ నాయకుడు.