Sunday, December 22, 2024

సుగ్రీవునికి రాజ్యబహిష్కారం, వాలికి రాజ్యాధికారం

రామాయణమ్ 101

‘‘ఒక సంవత్సరము గడచినది. వాలి జాడ లేదు. ఇంతలో గుహ ముఖ ద్వారము వద్దనుండి పెల్లుబికిన రక్తపు ప్రవాహము నురగలు కక్కుతూ వస్తూ నా కంట పడ్డది. మనసులో ఏవో ఊహలు, మాయావి బలము ముందు వాలి తేలిపోయినాడా?

లేక తాను నేల వాలిపోయినాడా? లేకశాశ్వతముగాకూలిపోయినాడా? మనసు పరి పరి విధాలుగా పోతున్నది! ఇంతలో గుహలో నుండి ఏవో భీషణ గర్జనలు!

Also read: వాలికీ, తనకూ మధ్య వైరం ఎట్లా వచ్చిందో వివరించిన సుగ్రీవుడు

‘‘వాలి గొంతు కాదది. వాలి నేల కూలినాడని నిశ్చయించుకొని, గుహద్వారమునకు అడ్డుగా ఒక పెద్ద బండరాయినుంచి, అతనికి తిలోదకములు వదలి నేను నగరుకు వెళ్లి ఈ విషయము చెప్పగా అందరూ చింతించి రాజు లేకుండగా రాజ్యముండుట క్షేమకరము కాదని నిశ్చయించి నన్ను రాజుగా పట్టాభిషిక్తుని గావించిరి.

‘‘ఇంతలో ఆ దానవుని దునుమాడి వాలి నగరుకు ఏతేంచినాడు. సింహాసనముపైనున్న నన్ను చూసి ఎర్రబడిన కన్నులతో దూషించి నా మంత్రులను బంధించినాడు. ఆ సమయములో అతనిని నిగ్రహించ సమర్ధుడనైనప్పటికీ  అన్న యను గౌరవముతో ఆ పనికి పూనుకొన లేదు.

పైగా నా కిరీటముతో ఆయన పాదాలను స్పృశించినప్పటికీ ఆయన నన్ను అనుగ్రహించలేదు.

Also read: సీత జారవిడిచిన ఆభరణాలను గుర్తించిన రాముడు

‘‘అన్నా నీవే నా రక్షకుడవు. మా అదృష్టము కొలదీ ఆ మాయావిని హతమార్చి సజీవుడవై తిరిగి వచ్చినావు. ఒక సంవత్సరము ఆ బిలద్వారము వద్ద కాపు యుంటిని. కానీ అచట బిలమునుండి బైటకు వచ్చు రక్తమును చూసి హృదయము వ్యాకులత చెంది ఆ బిలమును కప్పివేసి కిష్కింధ చేరుకొంటిని. నీవు లేక పోవుటవలన నన్ను రాజుగా అభిషిక్తునిచేసినారు. మంత్రుల బలవంతము మీద ఒప్పుకోవలసి వచ్చినది. నేను మునుపటి వలెనె నీకు సేవ చేయుచూ కాలము గడిపెదను. నా మనస్సులో ఇసుమంతైననూ రాజ్యకాంక్ష లేదు. నీవే ఎప్పటికీ మా రాజువు’’ అని పరిపరి విధాలుగా వేడుకొంటిని. అయినా ఆయన మనస్సు కరుగలేదు.

‘‘అన్నా, రాజ్యాభిషిక్తుడను అగుటలో నా ప్రమేయమేమియు లేదు. మంత్రుల బలవంతము మీద అలా జరిగినది. నీవే మా రాజువు’’ అన్ని ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా ఆయన గుండె కరుగలేదు. పైగా మంత్రులు, పురజనులను సమావేశపరచి నాదే తప్పన్నట్లుగా నిరూపించి నిర్దయగా నా భార్యను అపహరించి కట్టుబట్టలతో నన్ను రాజ్యమునుండి వెడలగొట్టినాడు. అతనికి భయపడి పిచ్చివాడిలా నేను భూమండలమంతా తిరిగితిరిగి ఈ ఋష్యమూక పర్వతమందు తల దాచుకొంటిని.

Also read: సుగ్రీవుని హృదయానికి హత్తుకున్న రాముడు

‘‘రామా, ఇదీ మా వైర కారణము. ఇందు ఇసుమంతైనా నా  అపరాధము లేకపోయినప్పటికీ నాకు ఇట్టి ఆపద సంభవించినది.’’ అని వేదనతో సుగ్రీవుడు పలికిన పలుకులాలకించి రఘుకులతిలకుడు మరి యొక్క మారు అతనికి అభయ మొసంగినాడు.

రాముని మాటలకు సుగ్రీవునిలో ఆనందముప్పొంగి ఆయనను బహుధా ప్రశంసించెను.

‘‘రామా మరొక్కమాట, నీవు కోపించినచో భూమండలమును భేదించి పాతాళమునందున్న శత్రువునైనా మట్టుపెట్టగలవు. నాదొక మాట ఆలకించుమయ్యా.

Also read: హనుమ వాక్పటిమ గురించి లక్ష్మణుడికి రాముడి వివరణ

‘‘వాలి పరాక్రమము ఎట్టిదో నీకు వివరముగా తెలిపెదను. ఆ తరువాత ఏమి చేసిన బాగుండునో నీవు నిర్ణయించుము. వాలి ప్రతిదినము  బ్రహ్మముహూర్తమందే నిద్దురలేచి నాలుగు సముద్రములకు వెళ్లి సంధ్యోపాసన గావించి వచ్చును. అతను పర్వతముల పైకెక్కి వాటి శిఖరములను కూల్చి వాటితో బంతులాట ఆడుకోనును. తన బల ప్రదర్శన నిమిత్తమై అడవిలోని పెద్దపెద్ద వృక్షములను అరచేత విరగ గోట్టుచుండును.

‘‘ఒక రాక్షసుడు  కైలాస శిఖరమంత ఎత్తుగలవాడు దుందుభి అను పేరుగలవాడు ఉండేవాడు ……

Also read: తనను రామలక్ష్మణులకు పరిచయం చేసుకున్న హనుమ

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles