రామాయణమ్ – 100
‘‘రామా, సకలసద్గుణాభిరాముడవు, మహాదైశ్వర్యవంతుడవు. నీతో స్నేహము నా అదృష్టము. రఘుకులతిలకుడవు నీతో స్నేహము నా బంధువులందరిలో నన్ను గొప్పగా నిలబెట్టును. అది నాకు గర్వకారణము. రామా, నేను కూడా నీకు తగిన స్నేహితుడనే. నా గుణగణముల గురించి నేనుగా నీకు చెప్పజాలను. నీవే ముందుముందు తెలుసుకొనగలవు.
‘‘రామా, మనస్సును సదా అదుపులో ఉంచుకొన్న నీ వంటి మహాత్ముల ప్రేమ, ధైర్యము కూడా స్థిరముగానే యుండును. రామా, ధనికుడైనా, దరిద్రుడైనా, సుఖాలలో ఉన్నా, దుఃఖాలలోఉన్నా, ఎన్నిదోషములున్నప్పటికీ స్నేహితుడే ఉత్తమమైన గతి.
Also read: సీత జారవిడిచిన ఆభరణాలను గుర్తించిన రాముడు
‘‘రామా, స్నేహమనగా ఇట్టిది అని తెలిసిన వారు తన ధన, ప్రాణములు స్నేహితుని కొరకు త్యజించుటకు కూడా వెనుకాడరు. ఇదినాది, ఇది నీది అను భేద భావము వారిరువురి మధ్య పొడసూపదు’’ అని అంటున్న సుగ్రీవుని మాటలకు అవును నిజమన్నట్లుగా రాఘవుడు తల ఊపాడు.
రామా, నా అన్నతో నాకు కలిగిన వైరకారణము చేత, నా ఈ నలుగురు సహచరులతో నేను ఇచ్చట నివసించుంటిని. నా ప్రాణములు తీయించ వలెనని నా అన్న ఎన్నో సార్లు ప్రయత్నించినాడు. మా అన్న పంపిన వారినందరినీ యమసదనమునకు పంపినాను. మా అన్నయ్య నా భయమునకు హేతువు! అందు వలననే మీరు కనపడినప్పుడు వాలి పంపిన వారేమోనని భయపడినాను. భయమునకు కారణ మున్నప్పుడు భయపడుట సహజముకదా.
Also read: సుగ్రీవుని హృదయానికి హత్తుకున్న రాముడు
రామా, నేను శోకాక్రాంతుడనై ఉన్నాను. స్నేహితుడవు కనుక నా కష్టములు నీ ముందు వెల్లడించు చున్నాను’’ అని అత్యంత దీనముగా, బాధ తో పలికిన సుగ్రీవుని మాటలు విని రాముడు,
‘‘అసలు నీకు మీ అన్నకు వైరము ఏర్పడుటకు గల కారణమేమి?’’ అని ప్రశ్నించాడు.
‘‘వాలి శ త్రుసంహారకుడు. మహాబలవంతుడు. నాకు, నా తండ్రికి ఒకప్పుడు బహు ప్రీతిపాత్రుడు. నా తండ్రి మరణానంతరము జ్యేష్టుడని ఈయనకు రాజ్యాభిషేకము చేసిరి. తాతముత్తాతలనుండి సంక్రమించిన రాజ్యాన్ని అతను శాసించుండగా సేవకునివలె ఆయనకు వంగి ఉంటిని. మాయావి అనే ఒక రాక్షసునికి ఒక స్త్రీ మూలమున వాలితో వైరము ఏర్పడినది. దుందుభి ,మాయావి అన్నదమ్ములు. ఆ మాయావి ఒకరోజు రాత్రి వేళ జనులనందరూ గాఢ నిద్రలో మునిగిఉన్న వేళ నగరద్వారము వద్దకు వచ్చి భయంకరమైన కేకలు వేయుచూ వాలిని యుద్ధానికి ఆహ్వానించినాడు. అప్పుడు నిదురలో ఉన్న మా అన్న వాలి కోపించి వేగముగా బయటకు వచ్చినాడు. మేము వారించిననూ వాలి మా మాట వినక వానితో యుద్ధానికి బయలుదేరినాడు. నేను కూడా అన్నపై గల స్నేహముతో ఆయన వెంట బయలు దేరినాను. మా ఇరువురినీ చూసి ఆ అసురుడు భయపడి చాలా దూరము పారి పోయినాడు.
Also read: హనుమ వాక్పటిమ గురించి లక్ష్మణుడికి రాముడి వివరణ
‘‘నిశిరాతిరిలో నిండు చందురుని వెన్నెలలు మాకు దారి చూపాయి. అంత ఆ అసురుడు అత్యంత వేగముగా ఒక బిలములోనికి దూరినాడు. ఆ బిలము చుట్టూరా గడ్డి కప్పబడి ఉన్నది. అప్పుడు మా అన్న ఎలాగైనా వాని సంగతి చూడాలని పట్టుదలతో కోపావేశములు కలవాడై నన్ను ఆ బిల ద్వారము వద్దనే కావలి ఉండమని ఆజ్ఞాపించి తానూ మహా వేగముగా లోపలికి దూరినాడు.
‘‘అంతటా నిశ్శబ్దము! ఏ విధమైన ధ్వనులూ లోపలినుండి వినిపించుటలేదు …..
ఒక సంవత్సరము గడిచి పోయినది …
Also read: తనను రామలక్ష్మణులకు పరిచయం చేసుకున్న హనుమ
వూటుకూరు జానకిరామారావు