Sunday, December 22, 2024

ఏడు సాల వృక్షములనూ ఒకే బాణముతో పడగొట్టిన రాముడు

రామాయణమ్ 102

‘‘తనకు మహా కాయమున్నది కదా అని బలగర్వితుడై ఆ దుందుభి యుద్ధకాంక్షతో సముద్రుని వద్దకు వెళ్లి తనతో యుద్ధమునకు పిలిచెను. ఆ సముద్రుడు అతనితో ‘నేను నీతో యుద్ధము చేయ సమర్దుడను కాను నీవు హిమవంతునివద్దకు వెళ్ళుము. ఆయన పర్వతరాజు ఆయన బలము నీకు సరిపోవును’ అని పంపెను .

దుందుభి హిమవంతుని వద్దకు వెళుతూ వెళుతూనే పర్వతములను పిండి చేయుచూ బండరాళ్ళతో బంతులాడుతూ సవాలు విసురుతూ ఆయన వద్ద నిలిచినాడు.

Also read: సుగ్రీవునికి రాజ్యబహిష్కారం, వాలికి రాజ్యాధికారం

ఆయన ఒక శిఖరముపై నుండి దుందుభి తో ఇట్లు పలికెను.

‘‘నా శిఖరములు మునులకు నివాసములు. నాకు యుద్ధము చేయుటలో నేర్పు లేదు. నన్ను ఇబ్బంది పెట్టకుము’’ అని ప్రాధేయపడగా, కోపముతో ఎర్రబారిన కనులు కలిగినవాడై దుందుభి, ‘నీవు చేయ లేక పోయిన మరి చేయగలవాడెవ్వడో తెలుపుము’ అని పలికెను.

‘‘అతని మాటలకు కోపించిన హిమవంతుడు అతనికి మా అన్న వాలి గురించి తెలిపి అతనితో యుద్ధము చేయుము, అతను నీకు అన్ని విధములుగా సమఉజ్జీ కాగలడు’’ అని కిష్కింధకు పంపెను.

Also read: వాలికీ, తనకూ మధ్య వైరం ఎట్లా వచ్చిందో వివరించిన సుగ్రీవుడు

‘‘ఆ దుందుభి అప్పుడు మహిషరూపము ధరించి నల్లని వర్షాకాల మేఘమువలె యుండి మా నగర ద్వారము చేరి భూమిని కంపింప చేయుచూ  భయంకరారావము చేసెను.

అంతః పురమందు స్త్రీలతో రమించుచున్న వాలి ఒక్క ఉదుటున ఆ శబ్దము విని వాని వద్దకు వచ్చి, ‘ఓరీ, ఎందుకు ఈ విధముగా శబ్దము చేయుచున్నావు?’ అని అడిగెను.

‘‘వాడు వీరాలాపములు పలుకుచూ మా అన్నను రెచ్చగొట్టి, తొడగొట్టి  యుద్ధానికి  పిలిచెను.

Also read: సీత జారవిడిచిన ఆభరణాలను గుర్తించిన రాముడు

అప్పుడు మా అన్న ఇంద్రుడిచ్చిన మాల మెడలో వేసికొని వానితో గొప్ప యుద్ధము చేసెను.

వాడి కొమ్ములు పట్టి గిరగిర త్రిప్పుచూ నేలకేసి విసిరి కొట్టెను. వానిముక్కులనుండి చెవుల నుండీ రక్తము స్రవించగా ప్రాణములు కోల్పోయెను.

‘‘అప్పుడు వాడి మృత కళేబరమును మా అన్న తన చేతులతో ఎత్తి విసిరికొట్టినాడు. అది ఒక యోజన దూరము ప్రయాణించి  రక్తము చిమ్ముకుంటూ మతంగ మహా ముని ఆశ్రమప్రాంతమందు రక్త వర్షము కురిసినట్లుగా కురిసి అక్కడ నేలపై బడెను. ఆశ్రమ ప్రాంతమంతటా  రక్తము వెదజల్లబడటము చూసిన మహర్షి కోపించి ఈ పని చేసినదెవరో తన దివ్య దృష్టితో గ్రహించి శాపమిచ్చెను. ఆ శాప కారణమున వాలి అతని మంత్రులు ఈ పరిసర ప్రాంతములో అడుగుపెట్టడానికి కూడా  సాహసించరు.

Also read: సుగ్రీవుని హృదయానికి హత్తుకున్న రాముడు

‘‘రామా, అందుచేత నేను నిర్భయముగా ఈ ప్రాంతములోనే నివసించు చుంటిని. రామా, ఇదుగో ఇచ్చటనే ఆ దుందుభి మృతకళేబరము కలదు. రామా, అవిగో ఆ కనపడే ఏడు సాల వృక్షములు. వాలి తన చేతులతో వాటి ఆకులన్నీ రాలిపోయే విధముగా ఊపగలిగే వాడు! అంత బలశాలి అతడు! మరి అటువంటి వాలిని నీవు చంపగలవా?’’

ఈ విధముగా సుగ్రీవుడు వేసిన ప్రశ్నకు రామానుజుడు నవ్వుతూ ‘‘రాముడు ఏమి చేసినచో నీకు నమ్మకము కలుగును’’ అని అడిగినాడు .

అప్పుడు లక్ష్మణుడితో సుగ్రీవుడు, ” రాముడు ఆ సాల వృక్షాలలో ఒక్క వృక్షాన్ని గనుక తన ఒకే బాణంతో చీల్చగలిగినట్లయితే రాముని శక్తి మీద నాకు నమ్మకము ఏర్పడును. ఈ దుందుభి అస్థిపంజరమును తనకాలితో ఎత్తి బలముగా నాలుగు వందల గజముల దూరము విసిరి వేయగలిగినట్లయిన నాకు రాముని శక్తి మీద నమ్మకము ఏర్పడగలదు” అని పలికాడు.

‘‘రామా, నా సోదరుని బలము, అతని దుష్టబుద్ధి ఎటువంటిదో నాకు సంపూర్ణముగా తెలియును. నిన్ను అవమానించవలెనని గానీ లేదా పరీక్షించవలెనని గానీ నా అభిప్రాయముగాదు. అతని వలన నాకు కలిగిన భయము వలన నేను ఈ విధముగా అంటున్నాను సుమా. మరొక విధముగా మాత్రము కాదు.

‘‘రామా,  నీ మాట నీ  అంగసౌష్ఠవము, నీ ఆకారము, నీధైర్యము, నీ అసాధారణమైన తేజస్సును సూచించుచున్నాయి కానీ …నా సందేహము, భయము మా అన్నగురించి’’ అని అనిన సుగ్రీవుని మాటలకు చిరునవ్వు నవ్వి రామచంద్రుడు ఇలా అన్నాడు.

Also read: హనుమ వాక్పటిమ గురించి లక్ష్మణుడికి రాముడి వివరణ

ఇదుగో ఇప్పుడే యుద్ధము చేయుటలోగల నా సామర్ధ్యము నీకు చూపగలను అని అంటూఅంటూనే రాముడు కేవలము తన బొటనవేలితో దుందుభి కళేబరాన్ని అనాయాసముగా పదియోజనముల దూరము విసిరి వేశాడు. ( సుగ్రీవుడు అడిగింది నాలుగు వందల గజాలు).

‘‘రామా ఇది మాంసమంతా ఎండిపోయి మిగిలిన తేలికైన కళేబరము. అప్పుడు పచ్చిగా ఉన్నది రక్తమాంసములతో కూడి ఉన్నది. పైగా దీనిని విసిరిన సమయములో వాలి బాగా అలసి పోయి ఉన్నాడు. అస్థిపంజరమునకు మాంసముతో కూడిన శరీరమునకు చాలా వ్యత్యాసమున్నది ..నీవు ఒక్క సాలవృక్షమును భేదించిన చాలును నాకు నమ్మకము కలుగును’’ అని పలికిన సుగ్రీవుని పలుకులు విని వెంటనే తన ధనుస్సును చేతిలోనికి తీసుకొన్నాడు రాముడు.

 ఆకర్ణాంతము నారిసారించి ఒక బాణమును సాలవృక్షముపై ప్రయోగించగానే, అది ఏడు సాలవృక్షములను భేదించి భూమిలో ప్రవేశించి మరల భూమిని చీల్చుకుంటూ వచ్చి రాముని అమ్ములపోదిలో చేరినది. ఆ బాణప్రయోగ లాఘవమునకు, వేగమునకు బిత్తరపోయిన సుగ్రీవుడు తన శిరస్సు నేలకు ఆనించి రామునకు ప్రణమిల్లినాడు.

Also read: తనను రామలక్ష్మణులకు పరిచయం చేసుకున్న హనుమ

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles