సంపద సృష్టిద్దాం -02
(కిందటివారం తరువాయి)
ఇంజనీరింగ్ విద్యార్థులిద్దరు ఒకే కాలేజీలో చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగ వేటలో పడ్డారు. చాలా కష్టపడుతున్నప్పటికీ ఉద్యోగాలు దొరకడం లేదు. వారాలు గడుస్తున్న కొద్దీ ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయి. నెలలు గడుస్తున్న కొద్దీ మానసిక ధైర్యాన్ని కోల్పోతున్నారు. బంధువుల సూటిపోటి మాటలు, కంపెనీల తిరస్కారం భరించలేకపోతున్నారు. ఎవరో ఇచ్చిన సలహా మేరకు ఒక వ్యక్తిత్వవికాస నిపుణుడిని కలిసారు.
సమస్యను సాంతం విన్న నిపుణుడు వారితో మాట్లాడుతూనే మూడు విడి పాత్రలలో మంచినీరు తీసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించడం మొదలుపెట్టాడు. ఒక పాత్రలో క్యారట్, రెండవ పాత్రలో ఒక గుడ్డు. మూడవ పాత్రలో కాఫీ గింజలు వేశాడు. పావుగంట తర్వాత స్టవ్ ఆపుజేసి వారి ముందు ఆ మూడు పాత్రలను ఉంచాడు. మొదటి పాత్రలో క్యారెట్ ను నొక్కి చూడమన్నాడు. గట్టిగా ఉన్న క్యారెట్ కాస్త మెత్తగా మారడం వారు గమనించారు. రెండవ పాత్రలో గుడ్డు పెంకును తీయమని ఆదేశించాడు. ఉడకబెట్టక ముందు మెత్తటి ద్రవపదార్థంగా ఉన్న గుడ్డు సొన, ఉడికిన తరువాత గట్టిగా మారడం వారు గమనించి అదే విషయం చెప్పారు. మూడవ పాత్రలో కాఫీ గింజలను వడపోసి ఘుమఘుమలాడే కాఫీని వారికి పంచాడాయన. ఆయన ఏం చెప్పాడన్నది తెలుసుకునే ముందు ఈ కథలో మీరేమైనా నేర్చుకున్నారా అని ఒక్క క్షణం ఆలోచించి, ఆ తరువాత చదవడం కొనసాగించండి.
స్వభావం మేరకు ఆచరణ
మనమందరమూ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు, అపజయాల వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు పై మూడు వస్తువులలో ఒకదానిలాగా ప్రతిస్పందిస్తాం. కొందరు క్యారెట్ లాగా, మరికొందరు గుడ్డులాగా, ఇంకొందరు కాఫీ గింజల మాదిరిగా. ఇక్కడ మూడు వస్తువులకూ ఒకే రకమైన ప్రతికూల పరిస్థితి ఎదురైంది. వాటిని నీటిలో వేయడమే కాక, ఆ నీటిని మరిగించడం. కానీ మూడు వస్తువులూ మూడు భిన్న విధాలుగా స్పందించాయి. సాధారణ పరిస్థితిలో దృఢంగా, దురుసుగా ఉండే కొందరు విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు డీలా పడిపోతారు. పరిస్థితిని ఎదుర్కోలేక మెత్తబడి ఓటమి ఒప్పుకుంటారు. వారు క్యారెట్ స్వభావులు.
కష్టం ఎదురైనప్పుడు సుతిమెత్తని హృదయాన్ని గట్టిగా రాయిలాగా చేసుకుని భరించేది మరికొందరు. ముందు మెతకగా ఉన్నా, ఇబ్బందులు వచ్చినపుడు తమలో తాము పెనుగులాడి, సంఘర్షణ పడి మనసును రాయి చేసుకుంటారు. విజయం సాధించడం కోసం మొండిగా వ్యవహరిస్తారు వీరు. తాడోపేడో తేల్చుకుందామనుకుంటారు. విజయమో వీరస్వర్గమో అంతు చూద్దామనుకుంటారు. వీరు గుడ్డు స్వభావులు. చివరి వర్గం ప్రత్యేకమైనది. ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యేవరకూ తామెవరో తమకే తెలియదు. నివురుగప్పిన నిప్పులాగా ఉంటారు. తమలో రగులుతున్న అగ్నిజ్వాలను వారే కాదు, సన్నిహితులు కూడా గుర్తించలేనంతగా నిప్పు చుట్టూ బూడి ద ఉన్నట్టు తమ వ్యక్తిత్వం చుట్టూ ఏవేవో పొరలు చుట్టుకుని ఉంటారు. కాని, విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని పళ్లబిగువున భరించడమే కాకుండా, ఆ పరిస్థితులనే మార్చగలుగుతారు. కాఫీ గింజలు మరిగి నీటి స్వభావాన్నే మార్చేసాయి. ఆ నీటికి సువాసన, రుచిని చేర్చుతాయి. కాఫీగింజల స్వభావులు అననుకూల పరిస్థితులలో మరింత పట్టుదలతో కృషిచేసి, పరిస్థితులను మరింత సరళతరం చేసి, తాము విజయం సాధించడమే కాకుండా పది మందికీ ఆహ్లాదాన్ని పంచుతారు.
ఆ విద్యార్థులకు తమ గురించి పూర్తిగా అర్థమైంది. అక్కడ నుంచి కదిలారు. అనతికాలంలోనే విజయం సాధించగలిగారని వేరే చెప్పనవసరం లేదు కదా!
అడుగు – నమ్ము – పొందు
సంపద సృష్టించాలనుకునే సాహసవీరులంతా ముందుగా చేయవలసింది డబ్బు గురించిన అవగాహన పెంచుకోవడం. ఎవరికైనా ఒక వంద రూపాయల నోటు ఇచ్చి ముక్కలుగా చించేయమనండి. ఎవ్వరూ చించరు కదా. డబ్బును అందరూ ఇష్టపడతారు. గౌరవిస్తారు. సాహసవీరులు అంతకుమించి డబ్బును ప్రేమించాలి. ఆరాధించాలి. డబ్బు వాసన చూడడమే కాదు, దాని స్వరూప స్వభావాలు అణువణువూ తెలుసుకోవడమే కాదు. మరింత ఎక్కువగా డబ్బు గురించి తెలుసుకోవాలి. కనీసం మొదటి రెండు నెలల పాటు డబ్బు చరిత్రను గురించి గూగుల్ చేయండి. మానవ పరిణామ వికాసక్రమంలో డబ్బు పరిణామాన్ని అంచనావేయండి. ఈ రోజు మనం వాడుతున్న నోటు చలామణీలోకి రాకముందు డబ్బు ఏయే రూపాల్లో ఉండేదో తెలుసుకోండి. డబ్బు లెక్కలూ తెలుసుకోండి. ఎన్ని ఒకట్లు వంద అవుతాయో, ఎన్ని వందలు వెయ్యిగా, ఎన్ని వేలు లక్షగా మారుతాయో తెలుసుకోండి. మనం కోటీశ్వరులం కావడానికి ఎన్ని లక్షలు అవసరమో కూడా తెలియాలి. వివిధ దేశాల కరెన్సీ గురించి తెలియాలి. ఎన్ని మిలియన్లు మన కోటి రూపాలయకు సమానమో తెలియాలి. వివిధ దేశాల డబ్బు విలువ రోజురోజుకు ఎలా పెరుగుతూ తగ్గుతూ వస్తుందో ఒక కన్నేసి ఉంచండి. డబ్బు మన ఆరాధ్యదేవత. డబ్బు గురించి నిరంతరం ఆలోచిస్తుండండి.
తప్పక చేయండి: అవసరంలో మనకు డబ్బునిచ్చి ఆదుకున్న రుణదాతకు ప్రణామం చేసి ప్రతి మంగళవారం కొద్ది మొత్తంలో అయినా అప్పు తీరుస్తుండండి. నెమ్మదిగా మీ రుణం మాయమవడం గమనించండి.
Also read: అంతా మన మనసులోనే…
(మిగతా వచ్చే వారం)
– దుప్పల రవికుమార్