- 83 మంది విద్యార్థులకు సోకిన కరోనా
- రేపు రాత్రి నుంచి మూసివేయనున్నహాస్టళ్లు
- ఆందోళనకు గురవుతున్న విద్యార్థులు
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కలకలం రేపుతోంది. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు పదుల సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. సుమారు 83 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారిక గణాంకాలను బట్టి తెలుస్తోంది. దీంతో జిల్లా వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో హాస్టల్లోని విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించారు. హాస్టల్లో ఉండటం వల్ల వేగంగా ఒకరి నుంచి మరొకరికి వైరస్ వేగంగా వ్యాప్తిచెంది ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు:
ఇంజినీరింగ్ హాస్టళ్లలో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూనివర్శిటీ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించి, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జీవీఎంసీ అధికారులు యూనివర్శిటీలో శానిటైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టారని కలెక్టర్ తెలిపారు. ఏయూలో కరోనా కేసులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, వైరస్ కట్టడికి శానిటైజేషన్ చేపట్టాలని అధికారులను ఆళ్ల నాని ఆదేశించారు.
ఇదీ చదవండి:తెలంగాణలో వాయిదాపడ్డ డిగ్రీ, పీజీ పరీక్షలు
మూసివేయనున్న హాస్టళ్లు:
యూనివర్శిటీలో విద్యార్థులకు కరోనా సోకడంతో వర్సిటీ పరిధిలోని అన్ని హాస్టళ్లను మూసివేయాలని యూనివర్శిటీ అధికారులు అత్యవసర నిర్ణయం తీసుకున్నారు. రేపు (మార్చి 28) రాత్రి నుంచి హాస్టళ్లు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు హాస్టళ్లు ఖాళీ చేయాలని చీఫ్ వార్డెన్లు విద్యార్థులకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు వర్సిటీ పరిధిలో జరగాల్సిన బి.ఇ, బి.టెక్, బి.ఫార్మసీ పరీక్షలను అధికారులు వాయిదా వేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు:
మరోవైపు రాష్ట్ర మంతటా కరోనా కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. గత 24 గంటల్లో సుమారు 43 వేల కరోనా పరీక్షలు చేయగా వాటిలో 947 కేసులు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి.
ఇదీ చదవండి: కోవిడ్ కేర్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం