- పోలీసుల అదుపులో ఉద్యమ నాయకులు
- ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- ఆదివాసులకూ, ఇతరులకూ మధ్య సంఘర్షణ
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో మళ్ళీ మంటలు చెలరేగాయి. సామజిక వర్గాల మధ్య ఉద్రిక్తత, సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత వ్యాఖ్యల నేపథ్యంలో ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం రాత్రి బిష్ణోపూర్ లోని పౌగాక్చావో ఇంఖాంగ్ వద్ద దుండగులు ఒక వాహనానికి నిప్పంటించారు. ఈ ఘటన అక్కడ సామాజిక వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసింది. గత కొన్నాళ్ళుగా ఈ రాష్ట్రంలో ‘ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్’ పిలుపు మేరకు బంద్ లు, ఆందోళనలు,రహదారులపై రాకపోకలను అడ్డుకోవడం జరుగుతున్నాయి. ఈ విద్యార్థి సంఘం ఆ రాష్ట్రంలో అత్యంత శక్తిమంతమైన సంఘం.
Also read: ఇటు తైవాన్, అటు చైనా, నడుమ అమెరికా
స్వయంనిర్ణయాధికారాల కోసం ఉద్యమం
‘ది మణిపూర్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ బిల్’ ను ఆమోదించాలని ఈ విద్యార్థి సంఘం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఈ బిల్లును 2021లోనే ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కానీ ఇంతవరకూ దానికి ఆమోదం లభించలేదు. ఈ నేపథ్యంలో అక్కడ తరచూ ఆందోళనలు జరుగుతున్నాయి. ఒక్కొక్కసారి శృతి మించి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. మొన్న గురువారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అది అసెంబ్లీ అజెండాలో లేకపోవడం, విద్యార్థి సంఘం చేస్తున్న డిమాండ్లకు తగినట్లులేదనే కారణాలతో విద్యార్థుల ఆందోళనలు మరింతగా చెలరేగాయి. జరిగిన ఘర్షణల్లో సుమారు 30 మంది విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉద్యమనాయకులలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని విడిచి పెట్టాలని మిగిలిన నాయకులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. రహదారుల దిగ్బంధన, వాహనాలకు నిప్పు పెట్టడం మొదలైన చర్యలు చెలరేగాయి. ఈ బిల్లు ఆమోదంలోకి వస్తే ఆదివాసీ ప్రాంతాలకు పలు హక్కులు, అధికారాలు సంక్రమిస్తాయి. మణిపూర్ లో పర్వత ప్రాంతాలలో నివసించే ఆదివాసులకు, లోయల్లో ఉండే మిగిలిన వర్గాలకు మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆదివాసులు ఎక్కువగాపర్వత ప్రాంతాల్లోనే ఉన్నారు. లోయ ప్రాంతాలలో నివసించే వర్గాలవారికి ప్రభుత్వం అనుకూలంగా ఉందని, ఆదివాసులకు అన్యాయం జరుగుతోందన్నది ఆదివాసుల ప్రధాన ఆరోపణ. ఈ ప్రభావంతోనే విద్యార్థుల సమస్యలు కూడా తీరడం లేదని వారి ఆవేదన. మణిపూర్ ఎంతో సున్నితమైన సరిహద్దు రాష్ట్రం. మయన్మార్ దేశంతో అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఆదివాసులతో పాటు మెయితీ తెగకు చెందినవారు ఎక్కువ సంఖ్యాకులుగా ఉన్నారు. వీరు లోయ ప్రాంతాల్లో ఉంటారు. వీరి భాష మెయితీలాన్ అని, మణిపురీ అనీ అంటారు. 1972లో మణిపూర్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.
Also read: శ్రీలంక సంక్షోభం సమసిపోతుందా?
బీజేపీ ఏలుబడిలోనే…
మొన్నీ మధ్యనే ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ రాష్టం ప్రస్తుతం బిజెపి ఏలుబడిలోనే ఉంది. మాదక ద్రవ్యాల అలవాటు అక్కడి యువతను పాడుచేస్తోంది. ఈ దుష్ప్రభావంతో వేలాదిమంది యువకులు నిర్వీర్యులై పోతున్నారు. వివిధ జాతుల మధ్య వైషమ్యాలు మరో పెద్ద సమస్య. ఆర్ధిక అసమానతలు, రాజకీయ స్వార్ధాలు, హిందూ ముస్లిముల విభేదాలు, నిరుద్యోగ సమస్య, తరిగిపోతున్న సహజ వనరులు మొదలైనవి తలనొప్పిగా మారుతున్నాయి. కొండలలోని వివిధ తెగల మధ్య కూడా వైషమ్యాలు చెలరేగుతున్నాయి.ముఖ్యంగా నాగా – కుకీల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. సాయిధ వేర్పాటువాదం మరో తీవ్రమైన సమస్య.ఉగ్రవాదం కూడా వేళ్లూనుకొని ఉంది.మణిపూర్ -మయన్మార్ సరిహద్దు తగాదాలతో పాటు నాగాలాండ్ తోనూ గొడవలు ఉన్నాయి. సరిహద్దు సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాలి. రాజకీయాలలో, పాలనలో, సంక్షేమంలో, ప్రగతిలో అన్ని వర్గాలవారికి సమన్యాయం జరగాలి. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఉంది. ఈశాన్య రాష్ట్రాలపై బిజెపి ప్రత్యేక కార్యాచరణ కూడా చేపట్టింది. వీటన్నిటి సమన్వయం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన మిజోరాం గవర్నర్ గా మన తెలుగువాడు కంభంపాటి హరిబాబు ఉన్నారు. మరో తెలుగువ్యక్తి కిషన్ రెడ్డి ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖకు మంత్రిగా ఉన్నారు. వీరిరువురూ అనుభవజ్నులు. కంభంపాటి హరిబాబు గతంలో ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆచార్యులుగా పనిచేశారు. విద్యార్థుల సమస్యలు, విద్యార్థి సంఘాల తీరు తెన్నులు, ఉద్యమాల పట్ల బాగా అవగాహన ఉన్న వ్యక్తి. వీరి అనుభవాలను సద్వినియోగం చేసుకోవాలి. అనేక సమస్యల మధ్య రగిలిపోతున్న మణిపూర్ లో ఆదివాసీ విద్యార్థి సంఘాల ఆందోళనలు పెరగడం ఏమాత్రం ఆరోగ్యదాయకం కాదు. జాతి, వర్గ వైషమ్యాలకు ముగింపు పలకాలి. సమత, అభివృద్ధి మహామంత్రాలుగా పాలన సాగిస్తే మంటలు చల్లబడతాయి.
Also read: అల్ ఖైదా అధినేత అల్ – జవహరీ అంతం