Tuesday, January 21, 2025

లాక్ డౌన్ విధింపు, సడలింపుపై వ్యూహాత్మక నిర్ణయం

గత సంవత్సరం కోవిడ్ విజృంభణ నుంచి దేశానికి ఆరోగ్య పరంగా పెద్దగా గాయం కాకుండా కాపాడిన అంశాల్లో ‘లాక్ డౌన్ ‘ పాత్ర ఎన్నదగ్గది. ఈ సంవత్సరం సెకండ్ వేవ్ ప్రస్థానంలోనూ అదే మార్గాన్ని అవలంబిస్తున్నారు. దీని వల్ల అనుకూలమైన ప్రయోజనాలు నెరవేరుతున్నట్లుగానే  కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. మంచి ఫలితాలు వస్తున్నాయి అన్నమాటలో వాస్తవం ఉంది. కానీ, కరోనా ఉధృతిలో  పోయిన సంవత్సరానికి – ఈ సంవత్సరానికి పోలిక లేదు. ఈ సంవత్సరం  దారుణంగా ఉంది. ఏదో ఒక నాడు, మూడో వేవ్ కూడా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also read: కరోనా చైనా చేతబడేనా?

దేనికైనా వ్యూహం అవసరం

ఈ నేపథ్యంలో లాక్ డౌన్ – అన్ లాక్ ప్రక్రియ (సడలింపు) విధానంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే మనం అనుభవించబోయే కష్టనష్టాలు ఊహాతీతంగా ఉంటాయి. ఇందులో అటు ప్రభుత్వాలు – ఇటు ప్రజలు అత్యంత జాగరూకతతో కలిసి నడవాల్సిన అవసరం బలీయంగా ఉంది. ఇవే విషయాలపై  ఐసీఎంఆర్ కూడా తాజాగా అప్రమత్తం చేసింది. లాక్ డౌన్ విధించడంలో ఎంత వ్యూహం వుండాలో, లాక్ డౌన్ సడలింపులలో అంతకు మించిన వ్యూహం, సంసిద్ధత, క్రమశిక్షణ చాలా ముఖ్యం. వివిధ రాష్ట్రాలు వివిధ దశల్లో లాక్ డౌన్ / కర్ఫ్యూను విధించాయి. జూన్ లో కూడా అవి కొనసాగుతున్నాయి. బహుశా జూన్ నెలాఖరు వరకూ ఆంక్షలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో వచ్చిన ఫలితాలను బట్టి, జులైలో వ్యూహంలో మార్పులు ఉంటాయి. ఈ నెలలో లాక్ డౌన్ / కర్ఫ్యూ కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక అంశాలు, పరిణామాలను బేరీజు వేసుకుంటూ  చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. తెలంగాణలో సడలింపు సమయాన్ని కొన్ని గంటలపాటు పెంచారు. మే నెలలో ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకూ మాత్రమే సడలింపు ఉండేది. ఈ నెలలో, మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పెంచారు. దానికి అదనంగా మరో గంటసేపు ( మధ్యాహ్నం 2) వరకూ వెసులుబాటు కల్పించారు. ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ మాదిరిగానే కర్ఫ్యూ అమలులో ఉంది. ప్రస్తుతం 10రోజులు పొడిగించారు. వేళల్లో ఎటువంటి మార్పులు లేవు.

Also read: కరోనా కష్టాల మధ్య కర్ణపేయమైన వార్తలు

రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఒకే రీతి

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్వల్ప మార్పులతో జూన్ నెల మొత్తం పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ వల్ల ఆర్ధిక, మానసిక సమస్యలు, వత్తిళ్లు ఉన్నప్పటికీ, ప్రజల ప్రాణాలను కాపాడుకోడానికి ప్రభుత్వాలు సాహసమైన నిర్ణయాన్నే తీసుకున్నాయి. ఈ భావనను ప్రజలు చాలా వరకూ అర్ధం చేసుకున్నారు. అదే సమయంలో లాక్ డౌన్ అంటే ఎంత భయపడుతున్నారో  అన్ లాక్ పైన అవే భయాలు కలుగుతున్నాయి. గత సంవత్సరం లాక్ డౌన్ వివిధ దశల్లో సడలించారు. ఈ క్రమంలో  కొందరు విచక్షణా రహితంగా ప్రవర్తించారు. స్వేచ్ఛకు బదులు విశృంఖలంగా వ్యవహరించారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారు. ఉల్లంఘించినవారిలో అక్షరాస్యులు,నిరక్షరాస్యులు, అత్యంత విద్యావంతులు కూడా ఉన్నారు. కొందరు చేసిన తప్పులకు ఈ రోజు అందరూ మూల్యం చెల్లిస్తున్నారు. పోయిన సంవత్సరంకు -ఈ సంవత్సరంకు ఉన్న తేడా ఏంటంటే  నేడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండడం. ఇది కాస్త ఊరట ఇచ్చే అంశం. ప్రస్తుతం ఉన్న ఉధృతి రాబోయే మూడో వేవ్ ను దృష్టిలో పెట్టుకొని లాక్ డౌన్ కొంతకాలం పొడిగించడమే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Also read: కన్నీళ్ళు కాదు, కార్యాచరణ కావాలి!

సడలింపునకు కొన్ని సూత్రాలు

అన్ లాక్ (సడలింపు) కు కొన్ని సూత్రాలు చెబుతున్నారు. (1) పాజిటివిటీ రేటును పరిగణనలోకి తీసుకోవడం (2) వ్యాక్సినేషన్ ప్రగతి  (3) కోవిడ్ నిబంధనలతో కూడిన ప్రవర్తన. ఈ మూడింటినీ ప్రధానంగా సమీక్షించుకుంటూ లాక్ డౌన్ కొనసాగింపు, సడలింపులపై ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పాజిటివిటీ రేటు 5 శాతంలోపు ఉండడం, కోవిడ్ వల్ల ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న వర్గాలకు 70 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేయడాన్ని ప్రామాణికంగా తీసుకొని, అక్కడ లాక్ డౌన్ తొలగించవచ్చు అనే సిద్ధాంతాన్ని ఐసీఎంఆర్ చెబుతోంది. కోవిడ్ నిబంధనలను పాటించడం అనేది వ్యక్తిగత క్రమశిక్షణగానే భావించాలి. అటువంటి సామాజిక ప్రాంతాల్లో కూడా లాక్ డౌన్ ఎత్తివేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. లాక్ డౌన్ సడలింపు ప్రక్రియ కూడా నెమ్మదిగా సాగాలని చెబుతున్నారు. ఈ సలహాలను ” నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ” అధికారిక మార్గదర్శకాల్లో ఇంకా చేర్చలేదని సమాచారం. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైతే, చాలా వరకూ పరిస్థితులు అదుపులోకి వస్తాయి. హెర్డ్ ఇమ్మ్యూనిటీ ( సామూహిక రోగ నిరోధక శక్తి) పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.140కోట్ల జనాభా కలిగిన భారతదేశానికి, ఇటువంటి అంటువ్యాధిని కలిగించే వైరస్ అత్యంత ప్రమాదకరం. ఇప్పటికే బోలెడు చేదు అనుభవాలను మూటగట్టుకున్నాం. అత్యంత ఆత్మీయులను కోల్పోయాం. ఎంతో విలువైన వ్యక్తులను పోగొట్టుకున్నాం. ఎన్నో కుటుంబాలు విషాదంలో అలమటిస్తున్నాయి.దేశ ప్రజలంతా ఇటు ప్రాణభయం – అటు బతుకుతెరువు భయంతో విలవిలలాడిపోతున్నారు. కరోనా కష్టాల జాబితా చాలా పెద్దది. ఈ కష్టాల నుంచి ప్రజలను బయటపడేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. రాజకీయాలకు, ఆర్ధిక స్వార్ధాలకు, ఇగోకు పోకుండా, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సాగాల్సిన మిక్కిలి కష్టకాలం ఇది. జులై, ఆగస్టు మధ్యకాలంలో రోజుకు కోటి వ్యాక్సిన్లు అందించే పరిస్థితులు వస్తాయని, ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా దేశంలో ఎక్కువమందికి వ్యాక్సినేషన్ జరుగుతుందనే భరోసాను ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఇది ఆనందదాయకం, మిక్కిలి అభినందనీయం. కానీ ఇవ్వన్నీ మన పాలకుల కల్లబొల్లి కబుర్లని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.

Also read: ఏడేళ్ళ మోదీ పాలన మోదమా, ఖేదమా?

దేశభక్తిని చాటుకునే సందర్భం

అటు ప్రధానమంత్రి నుంచి ఇటు ముఖ్యమంత్రుల వరకూ తమ సమర్ధతను, దేశభక్తిని చాటుకోవాల్సిన  గొప్ప సందర్భం ఇది. అన్నమాటలు నిలబెట్టుకోవాల్సిన అవసరం నాయకులకు ఎంతైనా ఉంది. లేకపోతే, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు రూపంలో గుణపాఠం తప్పక చెబుతారు. కరోనా కల్పిత కష్టాల నడుమ ప్రజలు విసిగివేసారి ఉన్నారు. కరోనా విషయంలో ప్రజలది ధర్మాగ్రహం అని పాలకులు గుర్తించి తీరాలి. సామాజిక అశాంతి పెరగకుండా చూడడం ప్రభుత్వాల బాధ్యత. ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రగతి పథంలో నడుస్తోందని, వేగం బాగా పుంజుకుందని ప్రభుత్వం అంటోంది. ఇప్పటి వరకూ కోటిమందికి వ్యాక్సిన్లు వేసినట్లుగా చెబుతోంది. అందులో 75 లక్షలమందికి మొదటి డోస్ అందినట్లుగానూ, రెండు డోసులు తీసుకున్నవారు 25లక్షలు దాటినట్లుగానూ నివేదికలను విడుదల చేసింది. టీకాలు అందుబాటులో ఉంటే  రోజుకు 6 లక్షల మందికి వేసే సామర్ధ్యం ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా టీకా ప్రక్రియ జనవరి 16వ తేదీన ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లోనూ అదే రోజున మొదలైంది. ఈ టీకా ప్రక్రియ ఆరంభమై నాలుగున్నర నెలలు పూర్తయింది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వాల ప్రణాళికా లోపాల వల్ల, జరగాల్సినంతగా ప్రక్రియ విజయవంతం అవ్వలేదు. ఇప్పటికీ సరిపడా టీకాలు అందుబాటులో లేవు. తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్రాలకు టీకాలను అందించడంలో కేంద్రం మరింత చురుకుగా ముందుకు సాగాలి. 2011 గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ జనాభా సుమారు 5 కోట్లు. ఈ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియ శక్తివంతంగా జరగాలి. గత లాక్ డౌన్ ప్రభావం వల్ల ఎదురైన నష్టాలను, కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి వ్యవహరించాలి.కరోనా వైరస్ వ్యాప్తి పరంగా చూస్తే గత సంవత్సరం లాక్ డౌన్ వల్ల పొందిన ఫలితాల కంటే  అన్ లాక్ సమయంలో ప్రవర్తించిన తీరువల్ల వచ్చిన దుష్ప్రభావాలు చాలా ఎక్కువ. ఆ మూల్యం ఇంకా చెల్లిస్తూనే వున్నాం. గత అనుభవాలను, నేటి పరిస్థితులను, రేపటి థర్డ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకొని, లాక్ డౌన్ -అన్ లాక్ వ్యూహాన్ని రచించుకోవాలి.

Also read: కరోణా కట్టడికి విశ్వప్రయత్నం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles