Friday, December 27, 2024

యుద్ధపర్వంలో ఎత్తులు పైఎత్తులు

ఉక్రెయిన్ -రష్యా మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో, వివిధ దేశాల మంత్రాంగం మారబోతోంది. కొత్త తంత్రాలను ఎంచుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అని ప్రపంచ దేశాలన్నీ ఎదురుచూస్తున్నాయి.
ఇప్పటికే రెండు దేశాలు చాలా నష్టపోయాయి. చాలా ప్రాణ నష్టం జరిగింది. ఆస్తులు, అద్భుతమైన భవనాలు, సాంస్కృతిక వారసత్వ సంపదలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఉక్రెయిన్ లో నివసిస్తున్న విదేశీయులు నానా ఇబ్బందులుపడుతున్నారు. ఇరువైపులా సైన్యం అలసిసొలసి పోయింది. ఐనప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఆయుధాలు ధరించిన పౌరులు

ఉక్రెయిన్ లో పిల్లల నుంచి వృద్ధుల వరకూ సామాన్య ప్రజలు కూడా ఆయుధాలు ధరించి యుద్ధానికి దిగుతున్నారు. రష్యా, ఉక్రెయిన్త అంబులపొదిలో ఉన్న అస్త్ర, శస్త్రాలన్నింటినీ వాడుతున్నాయి. తాజాగా, రష్యా ‘హైపర్ సోనిక్’ క్షిపణులను ప్రయోగించింది.
వీటిని ప్రయోగించడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్ ఆయుధాగారాన్ని ధ్వంసం చేయడం లక్ష్యంగా రష్యా ఈ చర్యకు పూనుకుంది.
‘నో ఫ్లై జోన్ ‘ ను విధించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ పదే పదే అభ్యర్థిస్తున్నారు. ఇందుకు అమెరికా అంగీకరించడం లేదు. అదే జరిగితే, గగనతలాన్ని నియంత్రణలోకి తీసుకున్నామనే భావన కలుగుతుందని చెబుతోంది.
ఆ చర్య చేపడితే, రష్యాతో నేరుగా యుధ్ధానికి దిగినట్లేనని అమెరికా అంటోంది. ఈ పరిణామాలు ప్రపంచానికి మంచివి కాదని వ్యాఖ్యానిస్తోంది. ఇప్పటికే రష్యా అనేక ఆర్ధిక ఆంక్షలను ఎదుర్కొంటోంది. వాటి వలన ఆర్ధికంగా కుదేలైపోయింది.
ఉక్రెయిన్ లో కోట్లాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపు 30లక్షల మంది పొరుగు దేశాలకు వలస వెళ్లారు. యుద్ధం ఆపే దిశగా చేపడుతున్న శాంతి చర్చలు విఫలమవుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉండగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ‘నోబెల్ శాంతి బహుమతి’ ప్రదానం చేయాలంటూ యురేపియన్ దేశాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయుధ సంపత్తిలో ప్రపంచంలోనే శక్తిమంతమైన రష్యాను దీటుగా ఎదుర్కోవడమే కాక, ఉక్రెయిన్ ప్రజల పక్షాన అత్యంత బలంగా నిల్చున్న జెలెన్ స్కీని మించిన ధీరుడెవరని యురోపియన్ దేశాలు అంటున్నాయి. పురస్కారాల దరఖాస్తు గడువు ఇప్పటికే ముగిసిపోయింది. జెలెన్ స్కీ కోసం మార్చి 31 వరకూ పొడిగించండని యురోపియన్ నేతలు ‘నార్వేజియన్ నోబెల్ కమిటీ’కి ప్రత్యేక విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ అంశంపై కమిటీ ఏ విధంగా స్పందిస్తుందో, నిజంగా నోబెల్ శాంతి బహుమతి ఇస్తుందా అనే ఆసక్తి ప్రపంచ దేశాల్లో మొదలైంది..

విలన్ గా పుతిన్

మొత్తంగా ఈ యుద్ధపర్వంలో, రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ప్రతినాయకుడుగా ( విలన్), ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీని మహానాయకుడుగా ( సూపర్ హీరో ) యూరోపియన్ దేశాలు చూస్తున్నాయని అర్ధమవుతోంది. అమెరికా మొదలు యురోపియన్ దేశాలతో పర్యవసానాలు ఎలా ఉండబోతున్నా, భారతదేశం మాత్రం తటస్థ వైఖరినే అవలంబిస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో, రష్యా. పశ్చిమ దేశాలకు వీడ్కోలు పలుకుతూ, తూర్పు వైపు చూస్తోందని అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఎదుర్కొన్న ఆర్ధిక సంక్షోభాన్ని రష్యాకు మళ్ళీ రుచి చూపించాలని రష్యా శత్రుదేశాలన్నీ భావిస్తున్నాయని అంతర్జాతీయ ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంపై అమెరికా పెత్తనాన్ని సహించబోమని, పాశ్చాత్య దేశాలపై ఆధారపడే ఆలోచన లేనే లేదని రష్యా తాజాగా స్పష్టం చేసింది. రష్యా ఇక నుంచి తూర్పు వైపు చూస్తుందని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెగ్రీ లావ్రోవ్ రష్యా అధికారిక మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చారు.
“ఇప్పటి నుంచి చైనా, భారత్ వైపు రష్యా చూస్తుంది.తమ మిత్రపక్షాల పైన ఆధారపడుతుంది” అని ఆయన స్పష్టం చేశారు.
రష్యా విదేశాంగ మంత్రి మాటలను బట్టి చూస్తే, భారత్ -రష్యా మధ్య బంధాలు మరింత గట్టిపడనున్నాయి.
అది మంచి పరిణామామే.
ఈ నేపథ్యంలో, భారత్ విషయంలో చైనా, అమెరికా వైఖరులు ఎలా మారబోతయో వేచి చూద్దాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles