Thursday, January 2, 2025

కథారచయిత శ్రీరమణకు విశ్వనాథ అకాడెమీ పురస్కారం

హైదరాబాద్ : వరిష్ఠ పాత్రికేయుడూ, ప్రసిద్ధ కథారచయితా, ప్రముఖ కాలమిస్ట్, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీరమణకి గుంటూరు విశ్వనాథ సాహిత్య అకాడమీ బాధ్యులు ఆదివారంనాడు ఆయన స్వగృహంలో జీవన సాఫల్య ఫురస్కారం అందజేశారు. శ్రీరమణ రచించిన నాలుగో ఎకరం కథని విశ్వనాథ అకాడమీ ప్రచురించింది. వెండి జ్ఞాపికతో, రూ. 50,000 నగదుతో ఈ సన్మానం జరిగింది. హైదరాబాద్ నగరంలో మణికొండలోని శ్రీరమణ నివాసంలో జరిగిన సన్మానంలో ‘సకలం’ చానల్ సంపాదకులు కె. రామచంద్రమూర్తి, వివిఐటీ (గుంటూరు) చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, ఎన్ సీఎల్ ఎగ్జిక్యుటీవ్ డైరెక్టర్ వాసిరెడ్డి విక్రాంత్, అన్నమయ్య గ్రంధాలయం స్థాపకులు లంకా సూర్యనారాయణ, వారి కుమారులూ, శ్రీరమణ మేనల్లుడు కొప్పర్తి రాంబాబూ, ప్రముఖ నృత్యకళాకారిణి యశోదా ఠాకూర్, కౌటిల్య పాల్గొన్నారు. ఈ కార్యక్రామానికి సంధానకర్తగా, వ్యాఖ్యాతగా అధ్యాపకులు, రచయిత  రవికృష్ణ వ్యవహరించారు.

వెంకటేశ్వరరావు అనే మిత్రులు గుంటూరులో ఉండేవారనీ, ఆయన అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరి తిరిగి ఇంటికి రాలేదనీ, ఆయన అభీష్టం మేరకు విశ్వనాథ సాహిత్య అకాడమీని స్థాపించి గత అయిదేళ్ళుగా సాహిత్యం, సంగీత, కళారంగాలలో పురస్కారాలు ఇస్తూ వచ్చామనీ చెప్పారు. అయిదేళ్ళకు ఒక సారి జీవన సాఫల్య పురస్కారం అందజేయాలని అనుకున్నామనీ, ఈ తొలి జీవన సాఫల్య పురస్కారాన్ని శ్రీరమణగారికి ఇవ్వాలని నిర్ణయించుకునన్నామనీ, పురస్కారం స్వీకరించేందుకు ఆయన అంగీకరించారనీ వివరించారు.

శ్రీరమణ కథలలో ఏది మొదటి స్థానం ఆక్రమిస్తుందో చెప్పడం కష్టమనీ, మిధునమా, బంగారు మురుగు కథా అంటే ఎంచుకోవడం సాధ్యం కాదనీ రవికృష్ణ వ్యాఖ్యానించారు. తెలుగునాట కంటే కన్నడసీమలో శ్రీరమణ ప్రభ ధగద్దగాయమానంగా వెలుగుతోందనీ, ఆయన ‘మిధునం’  కథను నాటకంగా పలు సంస్థలవారు ప్రదర్శిస్తున్నారనీ, 50వ ప్రదర్శన సందర్భంగా శ్రీరమణను ఆహ్వానిస్తే కారణాంతరాల వల్ల ఆయన బెంగళూరు వెళ్ళలేకపోయారనీ చెప్పారు. కవులనూ, రచయితలనూ ఆవహించుకొని వారి భాషలోనే వ్యంగ్య రచన చేయడంలో శ్రీరమణ సిద్ధహస్తులని ప్రశంసించారు. పలువురు రచయితలనూ, కవులనూ అనుకరిస్తూ శ్రీరమణ రాసిన రచనలను ఆయన ప్రస్తావించారు.

Also Read : నండూరి పార్థసారథి కి నాగరత్నమ్మ పురస్కారం

శ్రీరమణతో తనకు గల సుదీర్ఘ అనుబంధం గురించి రామచంద్రమూర్తి ప్రసంగించారు. కన్నడిగులు చేస్తున్న ప్రయోగాన్ని చేయనందుకు తెలుగువారు సిగ్గుతో తలవంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రసిద్ధ కవులు ఒక రైలు పెట్టెలో కూర్చొని ప్రయాణం చేస్తే వారి సంభాషణ ఎలా ఉంటుందో ఊహించి శ్రీరమణ రాసిన పేరడీ అద్భుతమని ఆయన అన్నారు. తాను ఇష్టపడి అభిమానించే కొద్ది మంది రచయితలలో శ్రీరమణ ప్రథములని చెప్పారు.

వాసిరెడ్డి విక్రాంత్, కొప్పర్తి రాంబాబు, హర్షవర్థన్, లంకా సూర్యనారాయణ, తదితరులు ప్రసంగించారు.

సత్కారానికి స్పదిస్తూ  శ్రీరమణ అందరికీ ధన్యవాదాలు చెప్పారు. తన జీవితకథ రాయాలనే మిత్రుల అభ్యర్థనను ప్రస్తావిస్తూ, ఇప్పుడిప్పుడే తనకు ఒక ఆత్మకథా రచనకు ఒకానొక క్రమం తట్టిందనీ, దాని ద్వారా తన జీవిత కథను అల్లడానికి ప్రయత్నిస్తాననీ ఆయన అన్నారు. విశ్వనాథవారి వేయిపడగలలాగే నూటాయాభై ఏళ్ళ చరిత్ర చెబుతూ, అప్పుడు గ్రామీణ వాతావరణాన్ని వర్ణిస్తూ తన కథ చెప్పే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. విశ్వనాథ సత్యనారాయణతో తనకు ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించారు. తాను విశ్వనాథవారిపైన రాసిన వ్యగ్య రచనలు చదివి ‘నేను విజయవాడ వీధులలో తిరుగుతుండగానే నా గురించి అతగాడు రాస్తున్నాడోయ్. అతగాడు నా మీద పట్టు సాధించాడు,’ అని కుమారుడు విశ్వనాథ పావనిశాస్త్రితో అన్నటు పావని తనకు మిత్రుడు కనుక తనతో చెప్పాడంటూ శ్రీరమణ గుర్తు చేసుకున్నారు.

శ్రీరమణకు సత్కారం చేసేందుకు గుంటూరు నుంచి విశ్వనాథ అకాడమీ ప్రతినిధుల, శ్రీరమణ అభిమానుల ప్రత్యేకంగా హైదరాబాద్ కు తరలిరావడం విశేషం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles