ఎవనిదీ వనసీమ ఎరుగుదు నిజమ్ము
పల్లెపట్టున లెమ్ము వాని గేహమ్ము
ఆద్యంత మీ విపిన మావరించిన మంచు
ఆగి తిలకింపగా అతడెట్లు గుర్తించు;
ఏడ వనవాసముల జాడయే లేక
అశ్వమునకీ విడిది అచ్చెరువు గాక
కాసారమున నీరు గడ్డగట్టిన చోట
శీత సంధ్యాటవిని చిమ్మచీకటి పూట;
బుజ్జాయి గుఱ్ఱమ్ము గజ్జలను కదుపు
కలదె పొరపాటంచు గలగలలు సలుపు
వినపడని వీటిలో వేరొండు శబ్దమ్ము
పరతెంచు మారుతము, కురియు నీహారమ్ము;
ఇవి రమ్య తిమిరాంధ నీరంధ్ర గహనాలు
కాని నే నెరవేర్ప కలవు వాగ్దానాలు
పయనించవలె మైళ్ళు పవళించు మునుపు
పయనించవలె మైళ్ళు పవళించు మునుపు:
నివర్తి మోహన్ కుమార్
(అమెరికన్ కవి రాబర్ట్ ఫ్రాస్ట్ Stopping by the woods on a snowy evening కవితకు అనువాదం)
Stopping by the woods on a snowy evening
Whose woods these are I think I know
His house is in the village though
He will not see me Stopping here
To watch his woods fill up with snow;
My little horse must think it queer
To stop without a farm house near
Between the woods and the frozen lake
The darkest evening of the year;
He gives his harness bells a shake
To ask if there is some mistake
The only other sound is the sweep
Of easy wind and downy flake
The woods are lovely, dark and deep
But I have promises to keep
And miles to go before I sleep
And miles to go before I sleep:
Robert Frost