Saturday, December 21, 2024

దశహరాకు వక్రభాష్యాలు ఆపండి!

దశ-హరా= దశరా (దసరా) అంటే పదిమంది ఓడిపోయారని అర్థం. హరించుకుపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఎవరు ఆ పదిమందీ? అసలు విషయం చెప్పకుండా దశకంఠుడనే రావణుడు చనిపోయాడు గనుక, ఇది దశహరా అని చెప్తారు. రావణుడు రామాయణంలో ఒక కల్పిత పాత్ర. రాముడు ఎలాగైతే ఓ కల్పిత పాత్రో రావణుడు కూడా అలాగే ఓ కల్పిత పాత్ర. ఒక కావ్యంలో ఒక పాత్ర చనిపోతే పండగలేమిటి? అర్థం లేకుండా? దాని ఆధారంగా రావణుడి ప్రతిమను పెద్ద ఎత్తున తగలబెట్టడం కొందరు చేస్తే, దానికి విరుద్ధంగా రాముడి ప్రతిమను మరి కొందరు తగులబెడుతున్నారు. వీటికి పైగా రావణలీలా/రామ్ లీలా అని పేర్లు పెట్టుకోవడం అవసరమా? భ్రమల్లో బతికే వారికి బాగా ఉంటుందేమో గానీ, వాస్తవాలు తెలుసుకోదలుచుకుంటే అవి వేరే విధంగా ఉంటాయి.

Also read: చిన్నారుల మెదళ్ళలో మతబీజాలు

ఈ దేశంలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది చంద్రగుప్తమౌర్యుడు. ఆయనే ఆ వంశంలో మొదటి రాజు. అలాగే చివరి రాజు బృహదత్తుమౌర్య. వీరి మధ్య మొత్తం పదిమంది మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఇక్కడ చివరి రాజు బృహదత్తుడి దగ్గర మోసపూరితంగా ఒక బ్రాహ్మణుడు సైన్యాధ్యడయ్యాడు. అతని పేరు పుష్యమిత్ర శృంగుడు. అదను చూసి, పుష్యమిత్రుడు రాజు బృహదత్తు మౌర్యను హత్య చేశాడు. దానితో పది తరాలుగా వస్తున్న మౌర్యవంశం-వారి సామ్రాజ్యం పతనమయ్యాయి. అసలు దశహరా అంటే ఇది. దీన్ని కప్పిపుచ్చడానికి పదితలలున్నరాక్షస రాజును సృష్టించి కథలు అల్లారు. పది తరాలుగా వస్తున్న మౌర్యవంశం పతనమైందనీ, తమ శృంగుల రాజ్యం స్థాపించబడిందనీ పుష్యమిత్ర శృంగుడు తన బ్రాహ్మణవర్గీయులతో చేసుకున్న విజయోత్సవమే దశహరా. మౌర్య చక్రవర్తులంతా బౌద్ధాన్ని అనుసరించినవారు. మౌర్యుల కాలంలో బ్రాహ్మణుల్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. శ్రాద్ధకర్మలు ఉండేవి కావు. హింసాత్మకంగా బలులు ఇచ్చేవారు కాదు. విగ్రహారాధన, పూజలు, అర్చనలు ఉండేవి కావు. ఒళ్ళు వంచి కష్టపడి పని చేయడం చేతకాని బ్రాహ్మణులకు గడ్డుకాలం దాపురించింది. ఎలాగైనా బౌద్ధాన్ని నాశనం చేయాలి. మౌర్య సామ్రాజ్యాన్ని పడగొట్టాలి. తమ వైదిక ధర్మాన్ని పునరుద్ధరించుకోవాలి. కూర్చుని తింటూ ఉండాలి! అని కుట్రలకు, కుతంత్రాలకు పూనుకున్నారు. హింసకు కూడా వెనుకాడలేదు. రాజు పుష్కమిత్ర శృంగుడు – బౌద్ధ బిక్షువుల తలలు నరికి తెమ్మన్నాడు. ఒక్కొక్క తలకు వంద వరహాలిస్తానని కూడా ప్రకటించాడు. ఇకనేం? బౌద్ధభిక్షువులు దొరికినవారు దొరికారు. లెక్కలేనంతమంది నరికి చంపబడ్డారు. కొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు పారిపొయ్యారు.

Also read: రైతు ఉద్యమాన్ని బలపర్చిన బుద్ధుడు

దశరా రోజు జమ్మి చెట్టును దర్శించి, దాని ఆకు తీసుకుని బంధుమిత్రుల్ని కలవడం ఆచారంగా వస్తోంది. దానికి చెప్పిన కథ ఏమిటీ? మహాభారంతంలో పాండవులు తమ ఆయుధాలు జమ్మిచెట్టు మీద పెట్టారని, అవి ఇతరులకు శవంలాగా కనిపిస్తాయని చెపుతారు. అవి తీసుకొని, మహాభారత సంగ్రామానికి పాండవులు బయలుదేని వెళ్ళారని చెపుతారు. అసలు చెట్టు మీద శవం కనబడితే ఎవడూ పైకెక్కి ఏమిటీ అని చూడడా? ఆ నాటి ప్రజలు అంత పిరికివారా? సరే, ఆ విషయం వదిలేద్దాం.  దశహర అని ఒకటి రామాయణం కథ చెప్పారు. మరొకటి భారతం లోది చెప్పారు. అంటే ముక్కలు ముక్కలుగా అతుకుల బొంతలాంటి కథలు చెప్పడమేనా మనువాదుల పనీ? సరే- దీని గూర్చిన వాస్తవాలేమిటీ? చరిత్ర ఏం చెపుతుందో చూద్దాం. మొదట క్రూరుడుగా ఉన్న అశోకుడు కళింగను ఆక్రమించుకోవడానికి అతి భీభత్సంగా యుద్ధం చేశాడు. ఆ యుద్ధం అతనిలో గొప్ప మార్పు తెచ్చింది. అంతర్మథనానికి లోనయ్యాడు. యుద్ధంతో మానవాళికి జరిగిన నష్టాన్ని బేరీజువేసుకున్నాడు. బుద్ధుడి బోధనలకు ఆకర్షితుడయ్యాడు. ఫలితంగా యుద్దం ముగిసిన పది రోజుల తర్వాత సరిగ్గా దశమి రోజున బౌద్ధధమ్మ దీక్ష స్వీకరించాడు. విజయం సాధించినందుకు ఆ దశమి విజయదశమి అయ్యింది. ఆ రోజుతన రాజ్యమంతా విజోత్సవాలు, వేడుకలు చేసుకోవాలి. కానీ, అందుకు భిన్నంగా అదే దశమి రోజున బుద్దవిగ్రహం పాదాల దగ్గర తన ఆయుధాలు పెట్టి అశోకుడు అహింసా సిద్ధాంతాన్ని స్వీకరించాడు. బౌద్ధగురువు మొగలిపుత్త తిస్స ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా బౌద్ధం వ్యాపించడానికి అశోకుడు చేసిన విశేషమైన కృషి ఏమిటో మనకు తెలుసు. దేశ వ్యాప్తంగానూ, విదేశాల్లోనూ ఉన్న బౌద్ధ విగ్రహాలు, స్థూపాలు, ఆరామాలే ఆ నాటి వాస్తవాల్ని ఈ నాటికీ వివరిస్తూనే ఉన్నాయి. అసలు విజయదశమి రోజున జరిగింది ఇదయితే- వైదిక సంప్రదాయవాదులేం చేస్తున్నారూ? రక్తం తాగుతున్న దేవతా(స్త్రీ)మూర్తిని పెట్టుకొని, దానికి ఎదురుగా జంతువల్ని బలి ఇస్తున్నారు. ఆ దేవతామూర్తి చేతిలో కూడా ఖడ్గం ఉంటుంది. అది రక్తసిక్తమైందన్నట్టుగా ఆ బొమ్మ ఖడ్గానికి కూడా ఎరుపురంగు పూస్తారు. అంటే హింసను ప్రేరేపించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారన్న మాట! గొర్రె పిల్ల మెడను ఒకడు పంటితో కొరికి చంపడం, ఆ రక్తంతో దేవతామూర్తులకు అభిషేకాలు చేయడం ఇప్పటికీ కొనసాగుతున్న ఆచారాలు. ఇలాంటివి ఇంకా అవసరమా? అని జనం ఆలోచించాలి కదా? మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే – ‘‘శాంతిని బోధిస్తున్న బౌద్ధానికి వ్యతిరేకంగా బ్రాహ్మనిజం చేస్తున్నదే ఈ విజయదశమి’’-అని!

Also read: మనిషి పక్షాన గొంతెత్తిన – పేరలింగం

బౌద్ధాన్ని నాశనం చేయడానికి చేసిన ఎన్నో కుతంత్రాలలో భాగమే మనుస్మృతి రచన! దాని ప్రకారమే రాజును, రాజ్యాన్ని తమ చెప్పుచేతలలో ఉంచుకుని తమ స్థానాన్ని రాజగురు స్థానంలో లేదా పండిత/పూజారి స్థానాల్లో మహోన్నతంగా స్థిరపచుకున్నారు – వైదికమతాచార్యులు! మిగతావారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, వారి రెక్కల కష్టాన్ని దోచుకుతింటూ శతాబ్దాలుగా కాలం గడుపుతూ వస్తున్నారు. ఈ విషయాలు పూర్తిగా అర్థం చేసుకున్న డా. బి.ఆర్. అంబేడ్కర్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఈ దేశాన్ని మౌర్యులు, నాగవంశ పాలకులు పాలించారు.ఈ నాగజాతికి కాపాడింది బుద్ధుడే. వారే ప్రపంచవ్యాప్తంగా బౌద్ధాన్ని ప్రచారం చేశారు. నాగజాతి వారు ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రాంతం నాగాపూర్. అక్కడ ప్రవహించే నది నాగానది. ఇలాంటి చారిత్రక అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించిన తర్వాత డాక్టర్ అంబేడ్కర్ 1956లో అక్టోబర్ 14న దీక్షభూమి (నాగపూర్) లో విజయదశమి రోజు బౌద్ధం స్వీకరించారు. అంటరానితనం అంతరించాలనీ, మనుషులందరికీ సమానస్థాయి, హక్కులు ఉండాలన్నది ప్రధానంగా ఆయన కోరుకున్నారు. ఆయన స్వీకరించడమే కాకుండా, ఆయన అనుయాయుల్ని ఆరు లక్షల మందిని బౌద్ధంలోకి తీసుకుపోయారు. ఈ కార్యక్రమమంతా భదంత్ చంద్రమణి మహాథేరో, భంతే ప్రజ్ఞా తిస్స, యం. సంఘ్ రతన్ మహాథేరో ఇంకా ఇతర బౌద్ధభిక్కుల ఆధ్వర్యంలో జరిగింది. అంబేడ్కర్ మరణం తర్వాత కూడా అధిక సంఖ్యలో ఆయన అనుచరులు బౌద్ధం స్వీకరిస్తూ వచ్చారు. బౌద్ధానికి ఈ దేశంలో ఒకప్పుడు ఉన్న ఆదరణ ప్రస్తుతం లేకపోవచ్చు. కానీ, ఆధునిక కాలంలో కూడా అంతరించిపోకుండా స్థిరంగా కొనసాగుతూ ఉంది. మతాల పేరుతో రాజకీయ నాయకులు చేస్తున్న దుశ్చర్యలకు విసిగిపోయి మానవ వాదులంతా బౌద్ధం వైపు ఆకర్షితులవుతున్నారు. అధికారికంగా బౌద్దం స్వీకరించకపోయినా, తమ ఆలోచనా ధోరణిలో బుద్ధుడి బోధనల్ని బలంగా నిలుపుకుంటున్నారు.

Also read: ఇవి కేవలం భారత దేశంలోనే జరుగుతాయి!

వైజ్ఞానికి స్పృహకోసం తహతహలాడుతున్న హేతువాదులంతా బుద్ధుడి బోధనలకు ప్రభావితులు అవుతున్నారు. ఒక చారిత్రక పురుషుడి ప్రభావంలో ప్రపంచం ఇంతగా పడిందంటే – ఇంకా పడుతూనే ఉందంటే అది మామూలు విషయం కాదు. కొన్ని దేశాల్లో మత కేంద్రాల్ని, ప్రార్థనా స్థలాల్ని మూసేసి హోటళ్ళకు, క్లబ్బులకు అద్దెకు ఇస్తున్నారు. మతరహితులుగా మానవ వాదులుగా బతకాలనుకుంటున్నారు. బ్రాహ్మనిజం సమాజంలో అసమానత్వాన్ని ప్రబోధిస్తే, బౌద్ధం సమానత్వం కోసం పాటుపడింది. అందువల్ల మానవీయ విలువలకు ప్రాధాన్యమిచ్చే వారంతా ఈ వైపునకు రావడం తథ్యం!

మొఘలుల కాలం నుండి, బ్రిటిషు కాలం నుండి హిందూమతస్థులంతా ముస్లిం, క్రైస్తవ మతాల్లోకి ఎందుకు మారారూ? హిందూ మతంలోని అమానవీయ అంశాలకు విసిగి, వేసారి మారారు – అనేది నిజం! ప్రపచంలో ఎక్కడా లేని సతీసహగమనాన్ని ఎలా సమర్థించుకుంటారూ? స్త్రీలను నిమ్నవర్గాల్లో కలిపి, వారికి చదువూ, స్వేచ్ఛా లేకుండా ఎందుకు చేశారు? వారి శ్రమను ఎందుకు దోపిడి చేశారు? జంతువులకన్నా హీనంగా- అంటరానితనాన్ని ఎందుకు పాటించారు? ఇలాంటి అతి నీచమైన పద్ధతులు  ఉండడం వల్లనే, వాటిని తప్పించుకోవడానికి కొందరు ఇతర మతాల్లోకి పారిపొయ్యారు. ‘ధర్మం’ పేరుతో ఆలయాలు కట్టేవాళ్ళు-పునరుద్ధరించేవాళ్ళు పునరాలోచించుకోవాలి. వాళ్ళు పెంచేది బిచ్చగాళ్ళ సంఖ్యే తప్ప మరేమీ కాదు. జీవితకాలమంతా అట్టుడుగు వర్గాల ప్రయోజనాలకోసం నిలబడ్డవాళ్ళుసైతం, ఈ రోజు ప్లేటు ఫిరాయించి మనువాద స్వాములకాళ్ళ మీద పడి, భజనలు చేస్తూ దిగజారిపోతున్నారు.

Also read: భిన్నత్వంలో ఏకత్వం: మా‘నవ’వాదం

బుద్ధుడి ప్రబావాన్ని కాదనలేకే కదా అతణ్ణి తమ కాల్పనిక – దశావతారాల్లో చేర్చుకున్నారు? ఒక చారిత్రక పురుషుడైన బుద్ధుడి ఆహార్యం, జీవితాంశాలు తీసుకునే కదా పురాణపురుషుడైన రాముడి పాత్రకు రూపకల్పన చేసుకున్నారు?

సాధారణ శకానికి పూర్వం (BCE) ఆరవ శతాబ్దం నుండి సాధారణ శకం (CE) లోని పదిహేనవ శతాబ్దం వరకు సుమారు రెండు వేల ఏళ్ళు ఈ దేశంలో బౌద్ధం విలసిల్లింది. తర్వాత కాలంలో దాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ఒకప్పటి శృంగులు, తర్వాత కాలాలలో త్రిమతాచార్యలు- అంటే, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు- వారి వారి అనుయాయులు కొన్ని శతాబ్దాలుగా అహేతకమైన, అసంబద్ధమైన దేవీదేవతల మహిమలు ప్రచారం చేసి సమాజాన్ని మూఢత్వంలోకి లాగారు. ఇప్పుడు అందులోంచి బయటపడడం జనానికి చాలా కష్టంగా ఉంది. నిజాలు తెలుసుకుని జనంఎక్కడ వివేకవంతులవుతారోనని ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, ప్రజల సొమ్మును ఆలయాలకూ, విగ్రహాలకూ ఖర్చు పెడుతున్నాయి. ఇది మనంచూస్తున్నదే! దీని వల్ల దేశం వేనకడుగులు వేయడమే తప్ప, ముందడుగు వేసినట్టు ఎంత మాత్రమూ కాదు!

Also read: మనువాదుల ఇటీవలి పరిశోధనలు

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ విజేత, జీవశాస్త్రవేత్త)  

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles