విమర్శలపై కొహ్లీ కౌంటర్
సద్విమర్శలకే విలువ అంటున్న భారత కెప్టెన్
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య కేవలం రెండోరోజుల్లోనే ముగిసిన డే-నైట్ టెస్ట్ మ్యాచ్ పిచ్ పైన ఎవరికివారే ఇష్టం వచ్చిన విధంగా విమర్శలు, విశ్లేషణలు చేయటం పట్ల భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. పింక్ బాల్ తో డే-నైట్ గా నిర్వహించిన మూడోటెస్ట్ పిచ్ తొలిరోజుఆట తొలిగంట నుంచే స్పిన్ బౌలర్లకు అనుకూలించడం, ఏ జట్టూ 150 పరుగుల స్కోరు సాధించలేకపోడం, రెండోరోజుఆటలో 17 వికెట్లు పతనం కావడం, టాస్ ఓడినా భారతజట్టు 10 వికెట్ల విజయం సాధించడం, మ్యాచ్ కేవలం రెండోరోజుల్లోనే ముగిసిపోడంతో..పలువురు భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైకేల్ వాన్, నాసిర్ హుస్సేన్, డేవిడ్ లాయిడ్, కంగారూ మాజీ స్టార్లు మార్క్ వా, షేన్ వార్న్ తో సహా పలువురు విమర్శల వర్షం కురిపించారు. ఐదురోజులపాటు ఆడాల్సిన మ్యాచ్ కోసం చెత్త పిచ్ ను తయారు చేయటం టెస్టు క్రికెట్ కు అన్యాయం చేయటమేనంటూ ఘాటైనవిమర్శలు చేశారు. పిచ్ క్యూరేటర్ పైన ఐసీసీ చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు.
మీకో న్యాయం…మాకో న్యాయమా!
మరోవైపు భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ మాత్రం మోతేరా పిచ్ పై విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టాడు. రెండుజట్ల బ్యాట్స్ మన్ వైఫల్యమేకానీ పిచ్ లోపం కాదని మ్యాచ్ ముగిసిన రోజే చెప్పాడు. వికెట్ ను బట్టి ఆటతీరు మార్చుకోవాలని…అలా చేయటంలో రెండుజట్లు విఫలమయ్యాయని విశ్లేషించాడు. అయినా పిచ్ పైన విమర్శలు, ప్రతికూల విశ్లేషణలు చేయటం పట్ల విరాట్ అసహనం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా దేశాలు వేదికలుగా సీమింగ్ వికెట్ల పైన తాము ఆడిన కొన్నిటెస్టులు రెండు లేదా మూడురోజుల్లోనే ముగిసిన సందర్భాలలో ఎవ్వరూ పట్టించుకోలేదని, అడిలైడ్ వేదికగా జరిగినటెస్టులో తాము రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులకే కుప్పకూలిన సమయంలో అక్కడి పిచ్ ను ఎవ్వరూ తప్పుపట్టలేదన్న వాస్తవాన్ని కొహ్లీ గుర్తు చేశాడు. స్వింగ్ బౌలింగ్ కు అనువుగా తయారు చేసిన సీమింగ్ వికెట్లు, పిచ్ ల పైన లేని విమర్శలు భారత్ వేదికగా జరిగిన స్పిన్ పిచ్ లపైన మాత్రమే ఎందుకు వస్తున్నాయో తనకు అర్థంకావడం లేదని మండిపడ్డాడు. విదేశీ పిచ్ లకు ఓ న్యాయం , భారత్ పిచ్ లకు ఓ న్యాయం అంటూ వేర్వేరుగా ఉండవని కొహ్లీ చెప్పాడు. సద్విమర్శలను తాను ఆహ్వానిస్తానని, దానినుంచి నేర్చుకోడానికి తాము సిద్ధమని ప్రకటించాడు. దురుద్దేశంతో పనిగట్టుకొని చేసే ప్రతికూల విమర్శలను తాను ఖాతరు చేయనని తేల్చి చెప్పాడు.
ఇదీ చదవండి: కెప్టెన్ గా 60వ టెస్టుకు విరాట్ కొహ్లీ రెడీ
గెలుపు కోసమే ఆడతాం
టెస్ట్ మ్యాచ్ లు తాము విజయం కోసం ఆడాలా? లేక…ఐదురోజులపాటు మ్యాచ్ సాగేలా ఆడాలో ? విమర్శకులు, విశ్లేషకులు నిర్ణయిస్తారా అంటూ కొహ్లీ ప్రశ్నించాడు. శీతలవాతావరణం ఉండే న్యూజిలాండ్ లాంటి దేశాలలో సీమింగ్ పిచ్ లు ఎంత సహజమో వేడివాతావరణంతో కూడిన భారత ఉపఖండ దేశాలలో స్పిన్ పిచ్ లు అంతే సహజమన్న వాస్తవాన్ని అందరూ గుర్తుంచుకోవాలని కొహ్లీ సూచించాడు. పిచ్ పైన రచ్చను ఇకనైన ఆపండని భారత కెప్టెన్ కోరాడు.
ఇదీ చదవండి:పూజారాకు గత 19 టెస్టులుగా సెంచరీ కరవు