Sunday, December 22, 2024

దృఢమైన భారత్-అమెరికా సంబంధాల దిశగా అడుగులు

  • మరి 3 వారాలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు
  • భారత సంతతివారి బలం తక్కువైనా  ప్రాబల్యం ఎక్కువ
  • ఓటుతో పాటు నోటు కూడా మనవాళ్ళు ఇస్తారు
  • సహజంగా డెమాక్రాట్లపట్ల సుముఖత
  • 2016లో హిల్లరీకే అత్యధికంగా ఓటు

మాశర్మ

(జర్నలిస్ట్, కాలమిస్ట్)

నవంబర్ 3వ తేదీన అమెరికాలో ఎన్నికలు జరుగనున్నాయి. పట్టుమని 3 వారాల సమయం మాత్రమే ఉంది. అమెరికాలో జరిగే ఎన్నికలు భారతీయులందరికీ ఆసక్తికరంగానే ఉంటాయి. మనవాళ్ళు చాలామంది అక్కడ నివసిస్తున్నారు. మనం చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఎక్కువగా ఎంచుకునే దేశాలలో అమెరికాదే అగ్రస్థానం. అమెరికాలో జీవించడానికి, చుట్టం చూపుగా వెళ్ళడానికి కూడా భారతీయులు తహతహలాడుతుంటారు. అమెరికా ఒక పెద్ద ఆకర్షణ. అది అగ్రరాజ్యం. అత్యాధునిక దేశం. ఆదాయం, ఆస్తులు పెంచుకోడానికి అక్కడ ఉన్న మార్గాలు చాలా ఎక్కువ. అందుకే  అంత ఆకర్షణను  అమెరికా పట్ల  మనవాళ్ళు పెంచుకున్నారు. ఇంకా పెంచుకుంటూనే వున్నారు.

ఎవరు గెలిచినా ఉపాధ్యక్ష పదవి మనవారికే

ఈసారి జరిగే ఎన్నికల్లో డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలు రెండూ భారతీయ సంతతికి చెందినవారినే ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నారు.ఆన్నీ కలిసి వస్తే, భవిష్యత్తులో భారతీయ సంతతికి చెందినవ్యక్తి అమెరికాకు అధ్యక్షులైనా ఆశ్చర్య పోనవసరంలేదు.గత చరిత్రను పరిశీలిస్తే, 1900సంవత్సరం నుండి భారతీయులు అమెరికాకు వలస వెళ్తున్నారు.ఉపాధి, విద్య దీనికి ప్రధాన కారణాలు.మొదట్లో కార్మికులుగా,ఆ  తర్వాత వైద్యం మొదలైన వృత్తిపనివారిగా అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.1990లో సాఫ్ట్ వేర్ రంగం ఉధృతమైంది.అప్పటి నుండి అమెరికాకు వెళ్లి, స్థిరపడేవారి సంఖ్య బాగా పెరిగింది.ప్రస్తుత గణాంకాల ప్రకారం అమెరికాలో భారతీయులు 40లక్షలమందికి పైగా ఉన్నారు.వారిలో ఓటర్లు 18లక్షల మంది ఉంటారు.అమెరికాలో నివసిస్తున్నవారిలో మెక్సికన్ల తర్వాత భారతీయులే రెండవ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో 24కోట్లమంది ఓటర్లు ఉన్నారు.ఈ సంఖ్యతో పోల్చుకుంటే భారతీయ ఓటర్ల సంఖ్య తక్కువే అయినప్పటికీ, అమెరికా రాజకీయాల్లో భారతీయులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు.ఐక్యరాజ్య సమితికి వెళ్లి చూస్తే, అక్కడ భారతీయులు అడుగడుగునా కనిపిస్తారు.నేటి ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపిక ప్రక్రియే  దీనికి బలమైన ఉదాహరణ.అమెరికాలో ఓటింగ్ సరళి భారతదేశానికి పూర్తి భిన్నం.

విద్యాధికులే ఓట్లు వేస్తారు

ఇండియాలో  నిరక్షరాస్యులు, తక్కువ చదుకున్నవారు, తక్కువ సంపాదన కలిగినవారు  ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకుంటారు. అమెరికాలో విద్యాధికులు, సంపన్నులు ఎక్కువ శాతం ఓటింగ్ లో పాల్గొంటారు. భారతీయులు కూడా అదే మార్గంలో నడుస్తారు.అమెరికాలో ఉన్న భారతీయులు సంపన్నులు కూడా. అక్కడ సగటు భారతీయ అమెరికన్ ఆదాయం వైట్ అమెరికన్ ఆదాయం కంటే రెట్టింపు ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు.ఓట్లు వేయడమే కాకుండా విరాళాలు ఇవ్వడంలోనూ భారతీయులు ముందుంటారు.గత ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు 350లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చారని సమాచారం.ఇది భారతీయ అమెరికన్ సంపన్నులలో మొదటి 300మంది ఇచ్చిన విరాళాలు మాత్రమే.ఇండియన్ అమెరికన్ ఓటర్లలో 48శాతం మంది డెమోక్రాటిక్ పార్టీ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.42శాతం రిపబ్లికన్ పార్టీ తరపున నమోదయ్యారు.మిగిలినవారు స్వతంత్రులుగా నమోదు చేసుకున్నారు.దీన్ని బట్టి చూస్తే, మనవాళ్ళు ఎక్కువమంది డెమోక్రాటిక్ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొదటి నుండీ ఇదే తీరు నడుస్తున్నట్లు మేధావుల అభిప్రాయం.

గతంలో హిల్లరీకే భారత సంతతి ఓటు

గత ఎన్నికల్లో ఎక్కువ మంది డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు ఓటు వేశారు.ట్రంప్ కు ఓటు వేసిన మనవాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈసారి కూడా  ఇదే తీరు ఉండవచ్చని పరిశీలకుల అభిప్రాయం.  ఐతే, అమెరికాలో జీవిస్తున్న మనవారి తీరులో తరాల అంతరం ఉంది. భారత్ లో పుట్టి అమెరికాలో నివసిస్తున్నవారు భారత్ గురించే ఎక్కువ ఆలోచిస్తారు.అక్కడే పుట్టి పెరిగిన వారు భారతదేశం పట్ల పెద్దగా ఆలోచించరనే వ్యాఖ్యలు వినపడుతుంటాయి.ఒబామా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 40మంది భారతీయ అమెరికన్లు ఆయన బృందంలో ఉన్నారు. డోనాల్డ్ ట్రంప్ బృందంలో ఉన్న సంఖ్య తక్కువేనని చెప్పాలి. రేపు బైడెన్ అధ్యక్షుడుగా ఎంపికైతే, ఆయన బృందంలో భారతీయుల సంఖ్య  గతంలో కంటే ఎక్కువగా  ఉండవచ్చనే మాటలు వినవస్తున్నాయి.పివి నరసింహారావు సమయం నుండీ భారత్ -అమెరికా సంబంధాలు మరింత బలపడ్డాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా బాగున్నాయి. ట్రంప్ వచ్చినా, బైడెన్ వచ్చినా  ఈ   సంబంధాలు మరింత పెరుగుతాయి కానీ, తగ్గవు. చైనా -భారత్ వివాదాల్లో డోనాల్డ్ ట్రంప్ మనవైపు బలంగా నిలుచున్నారు.

భారత పక్షపాతి బైడెన్

జో బైడెన్ మొదటి నుండీ భారత్ పట్ల సద్భావంతో ఉన్నారు. 1975లో పోఖ్రాన్ లో భారత్ అణుపాటవ పరీక్షలు నిర్వహించినప్పుడు అప్పటి అమెరికన్ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు ఎక్కువమంది  భారత్ పై ఆంక్షలు విధించాలని ఒత్తిడి తెచ్చారు. అప్పుడు విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడుగా ఉన్న బైడెన్ ఈ ఆంక్షలను గట్టిగా వ్యతిరేకించారు.ఆ సందర్భంలో బైడెన్ వేసిన ఓటుతో వాతావరణం మనకు అనుకూలంగా మారింది. దీని తర్వాత, ఆమధ్య సివిల్ నూక్లియర్ ఒప్పందాన్ని సెనేట్ చేత ఆమోదింపజేయడంలోనూ బైడెన్ ప్రధాన పాత్ర పోషించారు. హెచ్ 1బి వీసా మొదలైన అంశాల్లో ట్రంప్ అవలంబించిన వైఖరి భారత్ కు ఇబ్బంది పెట్టేలా ఉంది. ఈ విషయంలో బైడెన్ ప్రకటించిన విధానం భారత్ కు అనుకూలంగా ఉంది. భారత్ -అమెరికా బంధాల్లో, అమెరికా-చైనా మధ్య ఉండే బంధాలు కీలక పాత్ర పోషిస్తాయి. ట్రంప్ చైనా పట్ల పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు.బైడెన్ కూడా అదే వైఖరితో ఉంటారా? అన్నది ఇంకా పూర్తిగా తేలాల్సి వుంది. బైడెన్ అధ్యక్షుడుగా ఎంపికైతే, ఈ రెండు దేశాల బంధాలు ఎట్లా ఉన్నా, భారత్ పట్ల సత్ సంబంధాలు కలిగి ఉంటారని ఆశించవచ్చు.తాజాగా విడుదలైన సర్వేలు బైడెన్ -కమలా హ్యారిస్ గెలుపు తథ్యమని చెబుతున్నాయి. ఫలితాలు విడుదలైన తర్వాత కూడా డోనాల్డ్ ట్రంప్ తన అధికార పీఠం వీడరనే వదంతులు వినిపిస్తున్నాయి.అమెరికన్ చట్టాల ప్రకారం ఇది ఎంతవరకూ సాధ్యమన్నది ఇంకా తెలియాల్సి వుంది.

ఏ పార్టీ గెలిచినా ఇండియాకు నష్టం లేదు

డెమోక్రాటిక్ లేదా రిపబ్లికన్ పార్టీ నుండి ఏ రాజకీయపక్షం అధికారంలోకి వచ్చినా,  భారత సంతతివారే ఉపాధ్యక్ష పదవిని అలంకరిస్తారు.వీరిద్దరూ భారతదేశం పట్ల ఎటువంటి భక్తిప్రపత్తులు చూపిస్తారో కాలంలోనే తేలుతుంది.భవిష్యత్తులో రెండు దేశాల మధ్య వాణిజ్యం 500బిలియన్ల స్థాయికి చేరితే, భారతదేశ ఆర్ధిక పటుత్వం మరింత పెరుగుతుంది. నేడు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ డోనాల్డ్ ట్రంప్ కు బహిరంగంగానే తన మద్దతు ప్రకటిస్తున్నారు. ట్రంప్ ను వ్యక్తిగత స్నేహితుడిగా భావిస్తున్నారు. ఒకవేళ, బైడెన్ అధికారంలోకి వస్తే, ఈ పరిణామాలు ఎలాంటి రూపును సంతరించుకుంటాయో వేచి చూడాల్సిందే. ఎవరు అధికారంలోకి వచ్చినా, భారత్ -అమెరికా మధ్య బంధాలు మరింత దృఢంగా, ఆరోగ్యకరంగా సాగాలని అభిలషిద్దాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles