అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా కలసి కూటమి
సమాచార మార్పిడికీ, ఆయుధాల సరఫరాకీ ఒప్పందాలు
ప్రపంచ ఆధిపత్యం కోసం చైనా చతుర్విధోపాయాలు
మాశర్మ
(జర్నలిస్ట్, కాలమిస్ట్)
సరిహద్దు దేశాలతో పాటు ప్రపంచంపైన అధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలు ఆన్నీ ఇన్నీకావు. సామ, దాన, భేద, దండోపాయాలన్నీ ప్రయోగిస్తోంది. ఆస్ట్రేలియాను అష్టకష్టాలకు గురిచేస్తోంది. భారత్ చుట్టూ అష్ట దిగ్బంధనకు సిద్ధమవుతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని లొంగదీసుకోడానికి, భారత్ సరిహద్దులను కబళించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా ఇప్పటికే చాలా నష్టాలు ఎదుర్కుంది. భారత్ తో బంధాలు నేడో రేపో అన్నట్లుగా ఉన్నాయి. చైనా తీరును గమనిస్తున్న దేశాలు ఏకమై, బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నాయి. చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి క్వాడ్ దేశాలు (క్వాడిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ) తాజాగా సమావేశమయ్యాయి. చైనాకు చెక్ పెట్టడానికి కార్యాచరణ రూపొందించే దిశగా కదులుతున్నాయి. క్వాడ్ దేశాలైన అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగమంత్రులు మొన్న మంగళవారం టోక్యోలో సమావేశమయ్యారు.
భారత సరిహద్దుల్లో 60 వేల చైనా సైనికులు
తాజా సమాచారం మేరకు భారత సరిహద్దుల్లో చైనా 60 వేల మంది సైనికులను మోహరించిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వలన ప్రపంచానికి ముప్పు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. అమెరికా మేధో సంపత్తిని చైనా దొంగిలించిందని అమెరికా విదేశాంగ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ -చైనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటున్న ఈ సందర్భంలో భారత్ కు తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని ప్రకటించారు. చైనాతో ఇబ్బంది పడుతున్న దేశాలన్నింటికీ అమెరికాతో ఎంతో అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యల్లో పరోక్షంగా బెదిరింపు, హెచ్చరిక, స్వార్థం , లౌక్యం దాగి ఉన్నప్పటికీ అమెరికాతో మనకు అవసరం ఉందన్న మాట వాస్తవం. ఈ తరుణంలో వీరి సహకారం ఇంకా కీలకం. ఈ క్వాడ్ సమావేశంలో పాల్గొన్న నాలుగు దేశాలు చైనా లక్ష్యంగానే మాట్లాడాయి. అగ్రరాజ్యమైన అమెరికా లీడ్ తీసుకొని మాట్లాడినట్లు అనిపించింది. ఈ నాలుగు దేశాలకు నేడు ఉమ్మడి శత్రువు చైనా. ఇది మనకు కలిసి వచ్చే అంశం.
ఒకే బాటలో నాలుగు దేశాలు
స్వేచ్ఛాయుతమైన ఇండో-పసిఫిక్ ప్రాంతమే లక్ష్యంగా నాలుగు దేశాలు ఒక అభిప్రాయానికి వచ్చాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని అన్ని దేశాలకు ఆర్ధిక, భద్రతాపరమైన అంశాల్లో చట్టబద్ధమైన, కీలక ప్రయోజనాలు కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యమని భారత్ పేర్కొంది. ఈ అంశాలన్నింటి నేపథ్యంలో భారత్ -అమెరికా మధ్య కొన్ని కీలక ఒప్పందాలు త్వరలో జరగనున్నాయని సమాచారం. ఈ నెల 26, 27తేదీల్లో జరుగబోయే ఈ సమావేశంలో 2+2 చర్చలు జరుగనున్నాయి. బేసిక్ ఎక్స్చేంజి అండ్ కో ఆపరేషన్ అగ్రిమెంట్ (బీ ఈసీ ఏ ) పై భారత్ సంతకం చేయనుంది. శతృదేశాల స్థావరాలను గుర్తించి, దాడి చేసేందుకు లక్ష్యంగా ఎంక్యూ -9బి వంటి ఆర్మ్ డ్ డ్రోన్స్ దిగుమతి తదితర అంశాల విషయంలో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరనుందని సమాచారం. పరస్పరం సమాచారం, సహకారం బదిలీ చేసుకోడంతో పాటు చైనాను వాణిజ్యపరంగానూ దెబ్బకొట్టడానికి ఈ నాలుగు దేశాలు ఏకమవుతున్నాయి.
పాక్ ఆట కట్టించేందుకు అమెరికా తోడ్పడుతుందా?
ముఖ్యంగా అమెరికా-భారత్ మధ్య జరిగే చర్చల్లో పాకిస్తాన్ అంశం కూడా ప్రాధాన్యత సంతరించుకోనుంది. చైనా ప్రోత్సాహంతో పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం, టర్కీ సహాయంతో జిహాదీలు యథేఛ్ఛగా సాగిస్తున్న చొరబాట్లు మొదలైన చర్యలను కట్టడి చేసే దిశగా భారత్ కు అమెరికా సహకారం అందించాలి. చైనాతో తీవ్ర శత్రుత్వం ఉన్నప్పటికీ పాకిస్తాన్ విషయంలో అమెరికా ఎటువంటి ప్రతిస్పందనలు ఇస్తుందో, ప్రతిచర్యలు చేపడుతుందో వేచిచూడాల్సిందే. బలమైన చైనా అనే సర్పం త్వరలోనే బలహీనమవుతుందని ఆశిద్దాం.