Sunday, December 22, 2024

దశలవారీ పోలింగ్ దుర్దశ: కొన్ని ప్రశ్నలు

టీవీతెర మీద అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వివరాలు చూస్తున్నాను. పశ్చిమ బెంగాల్ మొదటిదశ పోలింగ్ ఫలానా రోజున అని కనిపించింది. ఆ తర్వాత రెండో దశ పోలింగ్ తేదీ కనిపించింది. బహుశా అక్కడితో ఆగుతుందేమోనని-చెప్పొద్దూ- అత్యాశపడ్డాను, ఆగలేదు, మూడో దశ పోలింగ్ తేదీ కనిపించింది. అక్కడైనా ఆగుతుందనుకున్నాను, ఆగలేదు. ఇలా ప్రతి ‘దశ’లోనూ ఆశాభంగం కలిగిస్తూ చివరికి ఎనిమిదో దశ దగ్గర ఆగింది. ఈ దశల పోలింగ్ ఇంకెక్కడా అని చూస్తే అసోం కనిపించింది. అక్కడ మూడు దశల పోలింగ్.  కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో మాత్రం ఒక దశ పోలింగే.

ఎక్కడ ఎక్కువ దశల పోలింగ్ ను ప్రకటించినా నేటి మన ప్రజాస్వామ్యం దశను, భవిష్యత్తును తలచుకుని నాకు ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రంలో ఎక్కువ దశల పోలింగ్ జరపాల్సివస్తుందనీ, తక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రాలలో తక్కువ దశల్లో, లేదా ఒకే దశలో పోలింగ్ జరపవచ్చుననే రీజనింగ్ కు ఇక్కడ అవకాశం ఉండనే ఉండదు. ఉదాహరణకు, 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ లో 8 దశల పోలింగ్ ను ప్రకటిస్తే, 243 స్థానాలున్న తమిళనాడులో, 140 స్థానాలున్న కేరళలో ఒక దశ పోలింగే ప్రకటించారు. ఇంకా చిత్రమేమిటంటే, 126 స్థానాలు మాత్రమే ఉన్న అసోంలో మాత్రం మూడు దశల పోలింగ్ జరగబోతోంది. సరే, కేవలం 30 స్థానాలు మాత్రమే ఉన్న పుదుచ్చేరిలో ఒక దశ పోలింగ్ మాత్రమే జరగడం వెనుక కచ్చితమైన హేతుబద్ధత ఉందని అనిపించవచ్చు కానీ, అసోంతో పోల్చిచూసినప్పుడు ఆ హేతుబద్ధత నిలవదు. రేపు ఆ 30 స్థానాల కేంద్ర పాలితప్రాంతంలో మూడు దశల పోలింగ్ జరగబోదనే హామీ ఎవరూ ఇవ్వలేరు. అలాగే, ఒక రాష్ట్రంలో ఎక్కువ దశల్లో పోలింగ్ జరపడానికి అక్కడి శాంతిభద్రతల పరిస్థితి కారణమన్న రీజనింగ్ బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే, శాంతిభద్రతల పరిస్థితి బాగోలేదన్న విమర్శను ఎదుర్కొంటున్న ఇంకో రాష్ట్రంలో ఒక దశ పోలింగ్ నే ప్రకటించడం చూసినప్పుడు ఆ రీజనింగ్ కూడా నిలబడదు. పశ్చిమ బెంగాల్, కేరళలు ఇక్కడ ఉదాహరణలు.

Also Read: 5 రాష్ట్రాలలో మోగిన ఎన్నికల నగారా

ఏతావతా, ఈ ‘దుర్దశలవారీ’ పోలింగ్ విచిత్రాన్ని మరింతగా అంకెల్లోకి కుదించి చెప్పుకుంటే, మూడు రాష్ట్రాలలోని మొత్తం 404 స్థానాలకు ఒక దశలోనే, అంటే ఒకరోజులోనే పోలింగ్ జరుగుతుంటే. 294 స్థానాలకు మాత్రం 8 దశల్లో పోలింగ్ జరుగుతోంది. అలాగే, 126(అసోం) స్థానాలకు మూడు దశల పోలింగ్ జరుగుతోంది.

ఈ దశలవారీ పోలింగ్ కొత్తదేమీ కాదు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎన్నికల కమిషన్ లో ఎవరు ఉన్నా  కొన్ని రాష్ట్రాలలో దశలవారీ పోలింగ్ ను ప్రకటించడం జరుగుతూనే ఉంది కనుక, ప్రత్యేకించి ఏ ఒకరినో వేలెత్తి చూపే అవకాశమే లేదు. పశ్చిమ బెంగాల్ కే వస్తే, 2006 ఎన్నికల్లో అక్కడ 5 దశల పోలింగ్ జరిగితే, 2011, 2016లలో 6 దశల పోలింగ్ జరిగింది. కిందటి లోక్ సభ ఎన్నికల్లో 7దశల్లో పోలింగ్ జరిగింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో రెండు దశలు పెరిగాయి. అలాగే, అసోంలో ఇంతకుముందు రెండు ఎన్నికల్లో రెండు దశల పోలింగ్ జరిగితే, ఇప్పుడు ఇంకో దశ పెరిగింది. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో (2007, 2012, 2017) 7 దశల పోలింగ్ స్థిరపడినట్టు కనిపిస్తోంది. అయితే, 2022 ఎన్నికల్లో ఆ ‘దశ’ అలాగే ఉంటుందో లేదో చెప్పలేం. 243 స్థానాలున్న బీహార్ లో దశలు పెరగడం, తగ్గడం కనిపిస్తుంది.  అక్కడ 2005లో 3 దశల్లో, 2010లో 6 దశల్లో, 2015లో 5 దశల్లో, 2020లో 3 దశల్లో పోలింగ్ జరిగింది. 288 స్థానాలున్న మహారాష్ట్రలో సాధారణంగా ఒక దశ పోలింగే జరుగుతూ వచ్చింది(2014 మినహాయింపు. ఆ ఎన్నికల్లో 3 దశల పోలింగ్ జరిగింది). మధ్యప్రదేశ్ లోనూ ఒక దశ పోలింగే.

దశలు పెరగడానికి ప్రత్యేకించి ఏ పార్టీని, ఏ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపలేని మాట నిజమే కానీ, ఎన్నికల కమిషన్ ను మాత్రం కొన్ని ప్రశ్నలు అడగాలనిపిస్తుంది. ఏదైనా ఒక రాష్ట్రంలో దశలవారీ పోలింగ్ ను జరపడానికి; మధ్య మధ్య ఆ దశలను పెంచడానికి, తగ్గించడానికి ఎన్నికల కమిషన్ దేనిని కొలమానంగా, లేదా దేనిని ఆధారంగా  తీసుకుంటుంది? శాంతిభద్రతల పరిస్థితి గురించి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చే నివేదికలను ఆధారం చేసుకోవాలి, లేదా సొంత పరిశీలకులను పంపించి వారు ఇచ్చిన నివేదికలను ఆధారం చేసుకోవాలి. అలాగే, ఎన్నికల్లో పెరా-మిలటరీ బలగాల మీద ఆధారపడాలి కనుక వాటి అందుబాటు గురించి, ఆయా చోట్లకు ఆ బలగాలను తరలించే ప్రణాళిక గురించి కేంద్రం నుంచి నివేదిక తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఈ అన్ని రకాల నివేదికలను ఎదురుగా పెట్టుకుని ఎన్నికల కమిషన్ అంతర్గతంగా వాటిపై చర్చించి అంతిమంగా ఎన్నికల షెడ్యూల్ ను రూపొందించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన మినిట్స్ ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కాగితాల ఆధారంగా జరిగి, కాగితాలకు ఎక్కించవలసిన వివరాలే. మరి ఆ కాగితాలను అన్నింటినీ ఎన్నికల కమిషన్ బయటపెడుతోందా? సమాచారహక్కు కింద అడిగితే బయటపెడుతుందా? నా పాత్రికేయ అనుభవంలో అలా బయటపెట్టిన ఉదంతం ఏదీ నా దృష్టికి రాలేదు. ఇప్పుడేమైనా బయటపెడుతోందా అన్నది నాకు తెలియదు. ఒక వేళ బయటపెడుతున్నట్టు సమాచారం ఉంటే మంచిదే.

Also Read: బెంగాల్ లో ‘తాటక’ దొరికింది, ఇక రావణుడు దొరకాలి!

అయితే, 2019 లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఒక ముచ్చటను గమనిస్తే, ఎన్నికల కమిషన్ చర్యల వెనుక, నిర్ణయాల వెనుక ఇప్పటికీ పారదర్శకత లేదన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర మాజీ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు 2019, జూన్, 28న ‘ది వైర్’ లో రాసిన ఒక వ్యాసంలో దీనిగురించి లోతుగా చర్చించారు. ప్రధాని నరేంద్ర మోడి, హోమ్ మంత్రి అమిత్ షా  తమ ఎన్నికల ప్రసంగాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్)ని ఉల్లంఘించినట్టు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు వెళ్ళాయి. ఎన్నికల కమిషన్ ఆ ఫిర్యాదులను పరిశీలించి, ప్రవర్తనా నియమావళిని వీరు ఉల్లంఘించలేదన్న నిర్ణయాన్ని ప్రకటించింది. ఎన్నికల కమిషనర్ లలో ఒకరైన అశోక్ లావాసా ఈ నిర్ణయంపై తన అసమ్మతిని ప్రకటించారు. ఆ అసమ్మతిని రికార్డు చేశారు. దానిని బయటపెట్టమని అశోక్ లావాసా ఎన్నోసార్లు కోరినా ఎన్నికల కమిషన్ బయటపెట్టలేదు. దాంతో ప్రవర్తనా నియమావళికి సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించే కమిషన్ సమావేశాలకు అశోక్ లావాసా వెళ్ళడం మానుకున్నారట.

అశోక్ లవాసా ప్రకటించిన అసమ్మతి తాలూకు పత్రాన్ని బయటపెట్టాలని పుణె కు చెందిన విహార్ దుర్వే అనే పౌరుడు సమాచారహక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసినప్పుడు కూడా ఎన్నికల కమిషన్ నుంచి తిరస్కృతే ఎదురైంది. చట్టంలోని సెక్షన్ 8(1)(జి)ప్రకారం ఆ అసమ్మతి పత్రాన్ని బయటపెట్టలేమని సమాధానం ఇచ్చింది. ఎవరికైనా ప్రాణహానికి అవకాశమున్నప్పుడు, లేదా భౌతికభద్రతకు ప్రమాదం సంభవించగలదని అనుకున్నప్పుడు, చట్టాన్ని అమలు చేయడానికి సహకరించిన ఏ వ్యక్తి గుర్తింపునైనా దాచవలసి వచ్చినప్పుడు, భద్రతా ప్రయోజనాలకు భంగం కలుగుతుందని అనుకున్నప్పుడు మాత్రమే పై సెక్షన్ కింద సమాచారాన్ని దాచవచ్చునని శ్రీధర్ ఆచార్యుల వివరణ.

ఏ దుర్దశల వెనకనైనా అసలు సమస్య పారదర్శకత లేకపోవడమే. పారదర్శకత లేనప్పుడు ఎన్నికల షెడ్యూల్ రూపకల్పన వెనుక ఏ ప్రభుత్వం, లేదా ఏ పార్టీ ప్రచ్చన్నహస్తమైనా ఉందో లేదో మనకు ఎప్పటికీ తెలియదు. ఎన్నికల కమిషన్ కు వెన్నెముక ఉందో, విరిగిందో తెలియదు. చెరువులో చేపలు నీళ్ళు తాగాయో లేదో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు.

Also Read: వ్యవసాయచట్టాలు, ఒక ఫార్ములా సినిమా కథ

ఇలా దేశంలో దశలవారీ పోలింగ్ జరపాల్సిన రాష్ట్రాలూ, దశలూ పెరుగుతున్నకొద్దీ ఉన్న పారా-మిలటరీ బలగాలు సరిపోతాయో లేదో, మిలటరీనే దింపాల్సివస్తుందో చెప్పలేము. ఎందులోనైనా పారదర్శకత ముఖ్యమంటున్నది అందుకే.

Kalluri Bhaskaram
Kalluri Bhaskaram
సీనియర్ జర్నలిస్టు, బహుగ్రంథ రచయిత, సుప్రసిద్ద అనువాదకుడు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles