- ఏ పార్టీ పాట ఆ పార్టీ పాడుతోంది
- ఏపీలో ఏ పార్టీ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు
- తెలంగాణ పెద్దలు హడావుడి చేస్తున్నారు
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అంశం రాజకీయాలకు ముడిసరుకుగా మారింది. జాతీయ పార్టీలకైనా, ప్రాంతీయ పార్టీలకైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అది రాష్ట్రమైనా, కేంద్రమైనా చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు నేటి దుస్థితి వచ్చేది కాదు. ఉక్కు పరిశ్రమ కోసం జరిగిన నాటి ఉద్యమాల నుంచి ఈరోజు వరకూ రాజకీయాల తీరులో పెద్దగా మార్పు ఏమీ లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం తప్ప వేరు లేదు. ప్రజాబలానికి, ధర్మాగ్రహానికి తలవంచక తప్పక పరిశ్రమ స్థాపించాల్సి వచ్చింది కానీ, సాధారణ పరిస్థితుల్లో స్థాపన జరగలేదన్నది చరిత్ర. పీవీ నరసింహారావు, తేన్నేటి విశ్వనాథం వంటి నాయకులు, అమృతరావు వంటి త్యాగధనుల కోవ వేరు. అటువంటివారు ఎప్పుడూ మినహాయింపే. ఉక్కు పరిశ్రమ సాక్షిగా చరిత్ర ఎరిగినవారికి అన్నీ ఎరుకే. కాలం మారిన కొద్దీ, మారే కొద్దీ చిత్తశుద్ధి గణనీయంగా పడిపోతూనే ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడం అవసరం. పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చెయ్యడం ఏ మాత్రం ఆహ్వానించదగిన పరిణామం కానే కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో అస్సలు పనికిరాదు. ఏ ఏ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటే, పూర్తి ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తూనే లాభాల బాటలో నడిపించవచ్చునో ఇప్పటికే అనేక నివేదికలు చెప్పాయి. వాటికి ఏ మాత్రం విలువ ఇవ్వకుండా తమకు తోచినట్లుగా కేంద్రం ముందుకు వెళ్తూనే ఉంది.
Also read: అమ్మకు వందేళ్లు
కేంద్ర వైఖరి ప్రైవేటుకే అనుకూలం
ఉభయ సభల సాక్షిగా కేంద్రం తన వైఖరిని స్పష్టంగా, నిర్మొహమాటంగా అన్ని రాజకీయపార్టీలకు ఇప్పటికే అనేకసార్లు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తీరును గమనిస్తే ఈరోజో రేపో అన్నంత పనీ జరుగుతుందనే చెప్పాలి. అన్నీ తెలిసినా ప్రజల ముందు దోషులుగా మిగలకుండా ఉండడానికి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క నాటకం ఆడుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గతంలోనే తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ తన సంఘీభావాన్ని తెలిపారు. ప్రాంతీయ పార్టీ టీ ఆర్ ఎస్ ఇప్పుడు ‘భా రా స’ పేరుతో జాతీయ పార్టీగా అవతరించింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో, కేంద్ర ప్రభుత్వంతో, బిజెపితో ఆయన యుద్ధం కూడా ప్రకటించారు. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో తన వైఖరిని మరింత బలంగా చెప్పే పనిలో పడ్డారు. స్టీల్ ప్లాంట్ బిడ్ పై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు, ఈఓఐ (ఎక్స్ప్రెషన్ అఫ్ ఇంట్రెస్ట్) లో పాల్గొనేందుకు సింగరేణి డైరెక్టర్ల బృందం విశాఖ వచ్చింది. మూలధన సేకరణలో భాగంగా స్టీల్ ప్లాంట్ ఈ క్రతువు చేపట్టింది. దీనిలో ప్రగతి సంగతి ఎట్లా ఉన్నప్పటికీ రాజకీయం రంజుగా సాగుతోంది. ప్రైవేటీకరణకు భారాస అనుకూలమా? ప్రతికూలమా? తేల్చి చెప్పాలంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి అమర్నాథ్ ప్రశ్నాస్త్రాన్ని సంధిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశమే లేదని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఏడాదిన్నర క్రితమే మెమోరాండం జారీ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేస్తున్నారు. ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకమని మరోసారి ఆయన స్పష్టం చేశారు.
Also read: హరికథకు తొలి పద్మశ్రీ
ఎవరి ప్రయోజనాలు వారివి
31మంది ఎంపీల బలమున్న వైసీపీకి ‘ఉక్కు’ సంకల్పం ఏదీ? అంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధికార పార్టీపై కారాలు మిరియాలు నూరుతోంది. అన్నేళ్లు ముఖ్యమంత్రిగా పాలనలో ఉన్న చంద్రబాబునాయుడు స్టీల్ ప్లాంట్ విషయంలో సాధించిన ఘనత ఏంటని? ఈ పరిస్థితికి కారణం కూడా ఆయనే అని వైసీపీ శ్రేణులు తిప్పి కొడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నపాటి శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదంటూ టీడీపీ ఎక్కిరిస్తోంది. స్టీల్ ప్లాంట్ కదలనివ్వనని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఒకప్పటి మంత్రి, విశాఖ లోక్ సభ మాజీ సభ్యురాలు పురందేశ్వరి అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడడం కోసం దిల్లీ పెద్దలను ఎలాగైనా ఒప్పిస్తానని ఆ మధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా ఆవేశంగా మాట్లాడారు. గంటా శ్రీనివాస్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించారు. హైదరాబాద్ వెళ్లి ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను కూడా సంఘీభావం కోసం కలిశారు.తర్వాత ఎందుకో గంటా సైలెంట్ అయిపోయారు. ఇలా..ఒట్టి మాటలు, వేదికలపై హడావిడి తప్ప స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో అంగుళం కూడా ప్రయోజనకరమైన అడుగు ఏ ఒక్కరి నుంచీ పడలేదు.అధికార వైసిపీపై మాటిమాటికీ కాలుదువ్వే చంద్రబాబు ప్రభృతులు కేంద్రాన్ని ప్రశ్నించే సాహసం ఎందుకు చెయ్యడం లేదనే మాటలు కూడా వినపడుతూనే ఉన్నాయి. ఏతావాతా తేలేదేంటంటే? రాజకీయం తప్ప ఏమీ కనిపించడం లేదు.నిజంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ జరిగి, అభివృద్ధి జరిగి, లాభాల బాటలో పడితే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది?
Also read: దర్యాప్తు సంస్థల దుర్వినియోగం