Sunday, December 22, 2024

కొప్పరపు కవుల విగ్రహ ప్రతిష్ఠ

తెలుగు భాషకే చెందిన విశిష్ట సాహిత్య ప్రక్రియ “అవధానం”. ఈ విద్యకు, ఈ కళకు ఆద్యులై, అవధాన కవులకు ఆరాధ్యులైన తొలి తరం కవులలో ప్రథమ శ్రేణీయులు కొప్పరపు కవులు. ఆధునిక యుగంలో జంటగా కవిత్వం చెప్పాలనే మోజును రగిలించిన జంటకవులలో సుప్రసిద్ధులు, పద్యాన్ని మారుత వేగంతో పరిగెత్తించిన మహాకవులు కొప్పరపు సోదర కవులు.  

పలనాటిసీమ జంట

ఈ జంటది పలనాటి సీమ, కొండవీటి క్షేత్రం. గుంటూరు జిల్లా నరసరావుపేటకు దగ్గరలో ఉన్న కొప్పరం వీరి స్వగ్రామం. ఇంటి పేరూ-ఊరు పేరూ ” కొప్పరమే”. “కొప్పరమన్న గోపురము, గోపురమన్న వాజ్ఞ్మివాసము” అన్నారు తిరుపతి వేంకటకవులు. “గో”పురం అంటే సరస్వతీ నిలయమని అర్ధం. పద్య సరస్వతీ స్వరూపమైన కొప్పరపు కవుల కాంశ్యవిగ్రహాలు నరసరావుపేటలో ప్రతిష్ఠకు సిద్ధమయ్యాయి.

నరసరావుపేటతో అభేధ్యమైన బంధం

కొప్పరపు కవులకు నరసరావుపేటతో   అభేద్యమైన బంధం పెనవేసుకొనివుంది. అక్కడే రామడుగు రామకృష్ణశాస్త్రి దగ్గర సంస్కృత కావ్య, శాస్త్రాలు చదువుకున్నారు. అచటి పాతూరు ఆంజనేయస్వామి దేవాలయంలోనే ఎనిమిదేళ్ల వయస్సులో మొట్టమొదట అవధానం చేశారు, 15ఏళ్ళ ప్రాయంలో తొలి శతావధాన ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. పలనాటి ముఖద్వారమైన నరసరావుపేటలో కవితాయాత్ర మొదలు పెట్టి, అప్రతిహతంగా జయకేతనం ఎగురవేశారు. యావదాంధ్ర దేశంతో పాటు, తమిళనాడు, మహారాష్ట్రలోనూ, ఎక్కడ తెలుగువారుంటే అక్కడ పద్యాల వృష్టి కురిపించారు. పలనాటికి చెందిన మహాపండితుడు, అపర ఆదిశంకరాచార్యుడు బెల్లంకొండ రామారాయ కవీంద్రుని హృదయాన్ని గెలుచుకున్న ఉత్సాహం ఇచ్చిన ఊతంతో సారస్వత సీమను పద్య ప్రవాహాలతో ఊపేశారు.

మలరాజువారి ఆస్థానకవులు

 నరసరావుపేటకు కాస్త దగ్గరగా ఉండే ఏల్చూరులో పోతరాజు రామకవి వద్ద పొందిన అవధాన విద్యా సాధన, ఈ జంటకవులను అగ్రణులుగా నిలిపింది. నరసరావుపేట నగర నిర్మాతలైన మలరాజువారి సంస్థానానికి ఆస్థానకవులుగానూ విశిష్ట మర్యాదలు పొందారు. సుప్రసిధ్ధ శ్రీ సుబ్బరాయ, నారాయణ కళాశాల వ్యవస్థాపకులు నాగసరపు సుబ్బరాయశ్రేష్ఠికి వీరు బాల్యమిత్రులు. “సుగుణ సముదాయ పున్నయ సుబ్బరాయ” అంటూ వీరి స్నేహచిహ్నంగా శతకం అందించారు. కొప్పరపు కవుల జన్మస్థలంలో విగ్రహ ప్రతిష్ఠ జరగడం, అవధాన, ఆశుకవితా చరిత్రలో సువర్ణ అధ్యాయం. పద్య ప్రియులకు పండుగరోజు. తెలుగు సాహిత్య చరిత్రలో, కొప్పరపు కవులంతటి వేగంగా, అశువుగా పద్యాలు చెప్పినవారు ఇంత వరకూ లేరు. రోజుకొక శతావధానం చేసి , గంటకొక ప్రబంధం చెప్పి, మహాకవి పండితులందరినీ ఆశ్చర్య జలధిలో మునకలెత్తించారు.

నాటి సమకాలిక మహాకవి పండితులందరూ వీరి సభల్లో పాల్గొని, ప్రత్యక్షంగా వీరి ప్రతిభా సరస్వతిని దర్శించి, పరవశించి, ప్రశంసలు పద్యరూపంలో అందించారు.

లక్షల పద్యాలు వచించారు

కొప్పరపు కవులు లక్షల పద్యాలు వచించారు,వేల పద్యాలు రచించారు. అందులో ప్రబంధాలు, కావ్యాలు, శతకాలు, నాటకాలు ఉన్నాయి. అనేక లౌకిక, అలౌకిక కారణాల వల్ల చాలా సాహిత్య సంపద మృగ్యమైనా, నేటికీ కొన్ని వందల పద్యాలు అందుబాటులో ఉండి, కవితా ప్రియులకు విందులు అందిస్తున్నాయి, సందడి చేస్తున్నాయి. కొప్పరపు సోదర కవులుగా సుప్రసిద్ధులైన వీరి పూర్తి పేర్లు కొప్పరపు వేంకట సుబ్బరాయకవి (1885-1932), వేంకటరమణకవి(1887-1942). వీరిలో అన్నింటా అగ్రజులు వేంకటసుబ్బరాయకవి 1932లో నలభైఆరవఏటనే, ఈ లోకం వీడి వెళ్ళిపోయాడు. తమ్ముడు మరో పదేళ్లు (1942) జీవించినా, అన్నయ్య మరణంతో అస్త్రసన్యాసం చేశారు. తెలుగు భాషకు, తెలుగు పద్యానికి, అవధానానికి, ఆశుకవిత్వానికి అనితర సాధ్యమైన రీతిలో అంకితమైన పుణ్య గాత్రులు కొప్పరపు సోదర కవులు. ఈ జంట కవులు తెలుగు పద్యాల పంటసిరులు.

సుందరం శుభసూచకం

తెలుగు భాష ఉన్నంతకాలం వీరి పద్యనాదం వినిపిస్తూనే ఉంటుంది. ఎందరో మహాకవులు వసించి, భాసించిన కొండవీటి సీమలో కొప్పరపు కవుల ప్రతిమలు ప్రదర్శనకు సిద్ధమైన పుణ్యతిధి నేడు. వారు పుట్టిన కార్తీకమాసంలోనే, వారి సీమలోనే  వారి విగ్రహ ప్రతిష్ఠ జరగడం సుందరం, శుభసూచకం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

2 COMMENTS

  1. నిత్యమూ శతావధానం, ప్రతి గంటకూ ఓ ప్రబంధం! అంతటి కొప్పరపు కవులే తెలుగు పాలిట పంట సిరులంటూ

    మీరు వెలువరించిన సారస్వత వ్యాసం “సకలం” ఖ్యాతిని మరింత విస్తరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles