నరసరావుపేట: ప్రఖ్యాత జంటకవులు, సుప్రసిధ్ధ అవధాన కవులైన కొప్పరపు సోదర కవుల విగ్రహ ప్రతిష్ఠ గుంటూరు జిల్లా నరసరావుపేట టౌన్ హాల్ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని, విగ్రహాలను ఆవిష్కరించారు. లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, తెలుగువాడికే చెందిన అవధానవిద్యకు ఘనమైన పునాదులు వేసిన కొప్పరపు మహాకవుల విగ్రహ స్థాపన జరగడం తెలుగు జాతికి గర్వకారణంగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లాలోని మహాకవుల గుర్తుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగనుందని తెలిపారు. తెలుగు భాషాసాహిత్య సంస్కృతులు శాశ్వతంగా ఎప్పటికీ నిలిచిపోయే కార్యక్రమాల రూపకల్పనపై ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధిగా ఉందని గుర్తుచేశారు. ప్రభుత్వం తెలుగుభాషా పక్షపాతిగా వ్యవహరిస్తోందనీ, ప్రతి తరగతి పాఠ్యాంశాల్లో తెలుగు తప్పనిసరిగా ఉంటుందనీ తెలిపారు.
ఈ తరానికి, రేపటి తరాలకు తెలుగు భాషా సంస్కృతులను చేరవేయడం చాలా అవసరమని, ఆ దిశగా ప్రతిఒక్కరూ కలిసి సాగాలని, వారి వెంట ప్రభుత్వం, మేము నడుస్తామని లోక్ సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మహనీయులైన కొప్పరపు కవులు పుట్టి, నడయాడిన పలనాటి పుణ్యభూమిలో వారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం మహాద్భాగ్యంగా భావిస్తున్నామని శాసనసభాసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. నరసరావుపేటలోని ఏదైనా ప్రధానమైన వీధికి కొప్పరపు కవుల పేరు పెట్టాలని సీనియర్ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి సూచించారు. ఆ మహాకవుల జన్మభూమిలో ప్రతి ఏటా జయంతి, వర్ధంతులు జరపాలని కోరారు. కొప్పరపు కవుల విగ్రహాలకు పలువురు పూల దండలు వేసి, పుష్పాభిషేకం చేసి ఘనంగా నీరాజనాలు పలికారు.
ఈ కార్యక్రమంలో శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం వ్యవస్థాపకుడు, కొప్పరపు కవుల మనుమడు మాశర్మ, సబ్ కలెక్టర్ నుపూర్ కుమార్ శ్రీనివాస్, జిల్లా అడిషనల్ ప్రాసిక్యూటర్ బాల హనుమంతరెడ్డి, టౌన్ హల్ అధ్యక్షుడు పొన్నపాటి ఈశ్వరరెడ్డి, గుంటూరుజిల్లా గ్రంథాలయ కమిటీ మాజీ అధ్యక్షుడు నరిసిరెడ్డి, కొప్పరపు కవుల పౌత్రుడు వెంకటసుబ్బరాయశర్మ, వంశీకులు శ్రీగిరిరాజు అయ్యపరాజు తదితరులు పాల్గొన్నారు. కొప్పరపు కవులకు నరసరావుపేటతో ఉన్న అనుబంధాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు. కొప్పరపు కవుల విగ్రహ ప్రతిష్ఠామహోత్సవం ఆద్యంతం అపురూపంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. మాశర్మ సభా కార్యక్రమం నిర్వహించారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పెద్ద సంఖ్యలో సాహిత్య, సాంస్కృతిక ప్రియులు హాజరయ్యారు.
Also Read : కొప్పరపు కవుల విగ్రహ ప్రతిష్ఠ