- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త బంద్
- బంద్ కు పిలుపునిచ్చిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి
- బంద్ కు రాష్ట్ర ప్రభుత్వ మద్దతు
- బీజేపీ మినహా మిగతా పార్టీల సంఘీభావం
- డిపోలకే పరిమితమైన బస్సులు
ఇప్పటివరకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా విశాఖలో మాత్రమే ఆందోళనలు జరిగాయి. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి బంద్ కు పిలుపినిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బంద్‌కు టీడీపీ, జనసేన, వామపక్షాలతో పాటు అధికార వైసీపీ కూడా మద్దతు ప్రకటించింది. బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. బంద్ ప్రభావంతో జనజీవనం స్థంభించింది. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమతం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంద్ నేపథ్యంలో నిర్వహించిన నిరసనల్లో వైసీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, టీఎన్‌టీయూసీ, ఎస్‌ఎఫ్‌ఐ , వైఎస్సార్ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. పాఠశాలలు, బ్యాంక్‌లు, వ్యాపార సంస్థలు, దుకాణాలు, సినిమా ధియేటర్లు మూత పడ్డాయి.
Also Read: ఉక్కు సంకల్పమే శరణ్యం
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు స్వచ్చందంగా మూసివేసి బంద్ కు మద్దతు తెలుపుతున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మూసివేస్తున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు ప్రకటించారు. లారీ యజమానుల సంఘాలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు బంద్ కు మద్దతు పలికాయి.
విశాఖకు టీడీపీ అధినేత:
బంద్ కు మద్దతు తెలిపేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విశాఖ చేరుకోనున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలోనూ బంద్ పాటిస్తున్నారు. ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ విపక్షాలు, కార్మిక సంఘాలు వివిధ రీతుల్లో ఉద్యమిస్తున్నా ఫలితం లేకపోవడంతో రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నారు.
Also Read: జగన్ తో ఉక్కు పరిరక్షణ సంఘం నేతల భేటీ