- పలు రాష్ట్రాలలో ఆంక్షలు
- మహారాష్ట్ర, గుజరాత్ లలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్
- మాస్క్, శానిటైజర్లు తప్పనిసరి
- నిర్లక్ష్యానికి మూల్యం చెల్లిస్తున్న ప్రజలు
గత కొంత కాలంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజానీకానికి కరోనా తన ప్రతాపాన్ని మళ్లీ చూపిస్తోంది. వ్యాక్సిన్ వచ్చింది మనకేంటి అనే ధీమాతో మాస్క్ లు ధరించడం, శానిటైజర్ల వాడకం తగ్గించడంతో మళ్లీ వైరస్ కోరలు చాస్తోంది. చాపకిందనీరులా రోజు రోజుకీ విస్తరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై ఆంక్షలు విధిస్తున్నాయి.
మహారాష్ట్రలో ఉధృతంగా వైరస్ వ్యాప్తి:
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే పలు ప్రాంతాలలో లాక్ డౌన్ విధించారు. నిన్న (మార్చి 17) న ఒక్కరోజే 23 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 60 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదవుతుండటంతో అక్కడ వైరస్ ఎంతగా వ్యాప్తి చెందుతుందో అర్ధం చేసుకోవచ్చు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం అదీ అంతగా ఖరీదయినది కాకపోవడంతో ప్రజలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు అంచనావేస్తున్నారు. మాస్క్ లు ధరించకపోవడం, శానిటైజర్ల వినియోగం తగ్గించడం, అవసరం ఉన్నా లేకపోయినా బయట తిరిగేందుకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడంతో కేసులు సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదికను బట్టి తెలుస్తోంది.
Also Read: చేజేతులా తెచ్చుకున్న ముప్పు
గుజరాత్ లో పెరుగుతున్న రోజువారీ కేసులు :
గుజరాత్ లో గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో అనూహ్యమైన పెరుగుదల కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నారు. దాదాపు మూడు నెలల తరువాత గుజరాత్ లో రోజు వారీ కేసుల వెయ్యి దాటింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న అహ్మదాబాద్ లో పార్కులు మూసివేశారు. అహ్మదాబాద్ మున్సిపల్ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్, బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ సేవలు నిలిపివేయడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం నుండి తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు సేవలు నిలిపివేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది.
కర్ణాటక మణిపాల్ ఇన్ స్టిట్యూట్ లో కరోనా :
కర్ణాటకలో కరోనా విస్తృతంగా వ్యాప్తిస్తోంది. ఉడుపిలోని మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గత రెండు రోజుల్లో 52 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో క్యాంపస్ ను అధికారులు కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. క్యాంపస్ లోని మిగతా విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
Also Read: వాక్సిన్ విజేత భారత్