పంజాబ్, హరియాణా మధ్య నదీజలాల వివాదం గురించి పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ సింగ్ మన్ ఇటీవల బహిరంగ చర్చ నిర్వహించిన తీరు నాకు కష్టంగా తోచింది. బహిరంగ చర్చలో ప్రజలకు సంబంధించిన అంశం ఏమీ లేదని కాదు. పంజాబ్-హరియాణా వివాదం (ఆ మాటకొస్తే కర్ణాటక-తమిళనాడు వివాదం) గురించి ద్వంద్వ ప్రమాణాలు పాటించడంలో, రెండు నాల్కల ధోరణి ప్రదర్శించడంలో మరో రాజకీయ పక్షం తోడయిందని మాత్రమే కాదు. జాతీయ సమైక్యతను సవాలు చేస్తున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రంలో అధికారంలోఉన్న జాతీయతా ప్రభుత్వం ప్రయత్నం సైతం చేయలేదని కూడా కాదు.
రెండేళ్ళ కిందట పంజాబ్, హరియాణా రైతుల మధ్య అద్భుతమైన సమైక్యతను సాధించిన జాతీయ వ్యవసాయదారుల ఉద్యమం ఇంతవరకూ ఈ వివాదంలో జోక్యం చేసుకోకపోవడం నాకు బాధ కలిగించింది. నదీ జలాల వివాదం ప్రధానంగా వ్యవసాయదారులకు సంబంధించింది. వ్యవసాయదారుల పేరు మీద రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు హాస్యాస్పదమైన రాజకీయ, న్యాయపరమైన పోరాటాలు చేస్తూ ఉంటారు. వ్యవసాయదారుల నాయకులే ఒక చోట కూర్చొని సమస్యను కూలంకషంగా చర్చింది ఎందుకు పరిష్కరించుకోరు?
Also read: హిందూమతవాదానికీ, బహుజనవాదానికీ మౌలికమైన తేడా ఉంది
భారత జాతీయవాదంలో ముదిరిన వ్యాధికి ఈ వైఫల్యం ఒక నిదర్శనం. మన జాతీయవాదం దుందుడుకు స్వభావం కలది, బహిర్ముఖమైనది, యుద్ధోన్మాదం కలిగినది. మన అతిథిగా వచ్చిన పాకిస్తానీ క్రికెటర్ ను అవమానించడం ఈ జాతీయతావాదానికి చిహ్నం. జాతీయ సమైక్యత అవసరం గురించి, దాన్ని సాధించవలసిన ఆవశ్యకత గురించి ఆలోచన లేదు. గాజాలో వాస్తవాలు తెలియకపోయినా ఇజ్రేలీ యుద్ధ పిపాసను ప్రశంసించడానికి సమయం వెచ్చిస్తాము కానీ మణిపూర్ లో పరిస్థితిని అర్థం చేసుకోవడానికి సమయం లేదు.
భారతీయ జాతీయవాదం పూర్వం ఈ విధంగా ఉండేది కాదు. మన జాతీయోద్యమం విస్తృతిలో, ధోరణిలో చాలా విశిష్టమైనది. అది వలసపాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కానీ తెల్లవారికి వ్యతిరేకంగా కాదు. బ్రిటిష్ వారికి సైతం వ్యతిరేకం కాదు. ఇండియాను దాని ఇరుగుపొరుగు దేశాలకు వ్యతిరేకంగా జాతీయోద్యమం నిలపలేదు. స్వతంత్ర భారత దేశం ఐక్యరాజ్యసమితిలో చైనా ప్రవేశించాలని పట్టుపట్టింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో ప్రపంచవ్యాప్తంగా వలసపాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలతో మన జాతీయతావాదం మమేకమైంది.
సమానంగా ఉంటేనే సమైక్యమనే యూరోపియన్ దేశాల వాదనతో మన జాతీయ నాయకులలో చాలా మంది విభేదించారు. జాతీయ సమైక్యత గురించి వారు పట్టించుకునేవారు. జాతీయ భావజాలం పట్ల అనుమానాలు ఉన్నప్పటికీ టాగోర్ భారత జాతికి ఒక జాతీయ గీతం మాత్రమే కాదు సమైక్యసిద్ధాంతాన్ని కూడా ప్రసాదించాడు. నెహ్రూ రచించిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ ఏదో మేధోసంబంధమైన ప్రాజెక్టు కాదు. సమైక్య భావజాలంకోసం అన్వేషించిన రాజకీయ రచన. దేశాన్ని సమైక్యంగా బలోపేతం చేయాలన్న సంకల్పంతోనే గాంధీజీ అస్పృశ్యతకు వ్యతిరేకంగా, హిందీ భాషాభివృద్ధికి అనుకూలంగా ఉద్యమించాడు. ఇటువంటి భారత జాతీయతావాదం నమూనాలో ఏ లోపం జరిగింది? వర్తమానంలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం మేధోపరంగానూ, రాజకీయంగానూ గొప్ప సవాలు.
Also read: బీహార్ కులజనగణన బృహత్తరమైన ముందడుగు
నాకు మాత్రం ఇది వ్యక్తిగతంగా మేధోపరమైన సవాలు. నేను 2011లో ‘క్రాఫ్టింగ్ స్టేట్ – నేషన్స్’ అనే పేరుతో జువాన్ లింజ్, అల్ ఫ్రెడ్ స్టీపాన్ అనే ఇద్దరు రాజకీయ శాస్త్రంలో పండితులతో కలసి రాసిన పుస్తకంలోని కేంద్రక వాదనకు భారత జాతీయతావాదం నమూనా పతనం ఒక సవాలు వంటిది. నేషన్ – స్టేట్ కంటే స్టేట్ – నేషన్ ప్రధాన దృక్పథం. ఆ పుస్తకంలోని ప్రధానమైన వాదనను ఇక్కడ క్లుప్తంగా చెప్పుకోవచ్చు. 21వ శతాబ్దంలొ చరిత్ర విద్యార్థులు ఎదుర్కొనే ప్రధానమైన ప్రశ్నలలో ఒకటేమిటంటే, ఒక రాజ్యంలో (స్టేట్ లో) సామాజిక-సాంస్కృతిక వైవిధ్యాలను ఇమడ్చడంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎట్లా విజయం సాధించగలదు?ఇప్పుడు అమలులో ఉన్న సనాతన సంప్రదాయం ప్రకారం ప్రతి రాజ్యాం ఒక జాతిగా ఉండాల్సిందే. ఒక రాజ్యంలో ఒకటికి మించిన జాతులు ఉండజాలవు. ప్రపంచ వ్యాప్తంగా యూరోపియన్ రాజకీయ, మేధోపరమైన శక్తులు వ్యాప్తి చేసిన బలమైన జాతీయరాజ్యం నమూనా. ఇది రాజకీయ వ్యవస్థాగత వైఖరి. రాజ్యం రాజకీయ సరిహద్దులనూ, జాతి సాంస్కృతిక సరిహద్దులనూ నిర్దేశించడానికి ప్రయత్నిస్తుంది. ఒక సామాజిక-సాంస్కృతిక వ్యవస్థకు వీలైతే ఒప్పించి, లేకపోతే బలవంతం చేసి, అవసరమైతే హింసను ప్రయోగించి ప్రత్యేక హక్కులు ఇవ్వడం జాతీయ రాజ్యాలు చేస్తాయి. యూరోప్ లో ఆధునిక జాతి-రాజ్య వ్యవస్థ చరిత్ర ఇది.
ప్రపంచంలో అనేక ప్రాంతాలకు ఈ పాత, కాలం చెల్లిన యూరోపియన్ నమూనా సరిపోదని మేము ఆ పుస్తకంలో వాదించాము. ఇండియా, కెనడా, స్పెయన్, బెల్జియం వంటి అనేక ప్రజాస్వామ్య దేశాలు ఈ నమూనాకు అనుగుణంగా లేవు. ఆ దేశాలు భిన్నమైన రాజకీయ వ్యవస్థీకరణ విధానాన్ని అవలంబించాయి. దాన్ని రాజ్యం-జాతి నమూనా అన్నాం. భిన్నమైన పలు సామాజిక, సాంస్కృతిక ధోరణులను ఈ ప్రత్యామ్నాయ నమూనా పరిరక్షిస్తుంది. ఈ విభేదాలను బహిరంగంగా, రాజకీయంగా వ్యక్తం చేయడాన్ని సవ్యమైన విధానంగా గుర్తిస్తుంది. రాజ్యం అంతటా ఉన్న రాజకీయ సమూహాలు అన్నీ ‘మనం’ అని అనుకునే విధంగా పోటీపడే, సంఘర్షించే అభిప్రాయాలను ఇముడ్చుకోడానికి న్యాయపరమైన, రాజకీయమైన వ్యవస్థను తయారు చేసుకొంటుంది. ఈ నమూనాకు ఇండియా ఒక ఉదాహరణ అని మా పుస్తకంలో రాశాము. ప్రపంచ వ్యాప్తంగా భిన్నత్వానికి సవాలు ఎదురైనప్పుడు ఈ రాజ్యం-జాతి నమూనా ప్రపంచం మొత్తానికి నీతిపాఠాలు చెప్పగలదు.
కడచిన పదేళ్ళలో సంభవించిన పరిణామాలు ఈ నమూనాను సవాలు చేస్తాయేమో అనిపిస్తున్నది. ఈ నమూనా నుంచి ప్రపంచం పాఠాలు నేర్చుకోవాలని మేమంటే, ఆ నమూనా ఇండియాలోనే కూలిపోయింది. గత పదేళ్ళలో ఇండియా జాతి-రాజ్యం నమూనా వైపు బాగా, బలంగా మొగ్గింది. కొత్త జాతీయతావాదం ప్రభుత్వంలో అంతా ఒకే మోస్తరుగా ఉండటమే సమైక్యత అనిపించుకుంటుంది. ఏదైనా భిన్నత్వం కానవస్తే దాని పట్ల ఆగ్రహం వెలిబుచ్చుతారు, దాన్ని అనుమానిస్తారు. రాజ్యం-జాతి నమూనా గతించకపోయినా తగ్గుముఖం పట్టడాన్ని మనం ఎట్లా వివరించగలం?
Also read: మహిళా రిజర్వేషన్లు మాటవరుసకేనా? పదిహేనేళ్ళ వరకూ అమలులోకి రావా?
రాజ్యం-జాతి నమూనా ఆచరణ సాధ్యం కానిదని, నిజమైన సజీవ దృష్టాంతరం ఏమీ లేదని వాదించడం ద్వారా నేను తేలికైన పరిష్కారాన్ని సూచించదలచలేదు. ఆ మార్గంలో ఇండియా ప్రయాణించకపోతే అది ఇండియా వైఫల్యం. నమూనా తప్పు కాదు. జాతి-రాజ్యం పద్దతి నుంచి దూరంగా ప్రయాణం చేయడం వల్ల ఇండియా మూల్యం చెల్లించింది. ఇది సరైన సమాధానం కాజాలదు. ఎందుకంటే రాజ్యం-జాతి అన్నది నైరూప్యమైన నమూనా కాదు. నిజ జీవితంలో దీనిని పరీక్షించాలి. ఈ నమూనాకు ఇండియా మరో ఉదాహరణ మాత్రమే కాదు. ఇండియా ఆదర్శంగా ఉండాలి. కనుక ఇండియాలోనే సవాలు ఎదురయిందంటే ఈ నమూనాకు గట్టి సవాలు ఎదురైనట్టు భావించాలి.
ఈ అంశం గురించి బాగా ఆలోచించిన మీదట నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రాజ్యం-జాతి నమూనా ఇప్పటికీ ఆదర్శవంతమైనదే, ప్రస్తుత ప్రపంచానికి తగినట్టిదే. రాజ్యం-జాతి నమూనాను సృష్టించి, పరిరక్షించడానికి అనువైన వ్యవస్థను ఎట్లా రూపొందించాలన్న విషయంలో పుస్తకంలో పూర్తి అవగాహన లేదు. నిర్మాణం, వ్యవస్థ ఆకృతి, రాజ్యం పాటించవలసిన విధివిధానాలపైన, రాజకీయాలపైన, పార్టీ రాజకీయ విధానంపైన పుస్తకం దృష్టి కేంద్రీకరించింది. గుర్తింపు, దృష్టికోణం, వైఖరి, అభిప్రాయం వంటి సులభమైన అంశాలపైన దృష్టి అంతగా పెట్టలేదు. మన జాతీయత గురించి మనం గత 75సంవత్సరాలుగా బేపర్వాగా ఉన్నాం. భిన్నత్వంలో ఏకత్వం పట్ల మన జాతీయ నాయకులకు ఉన్న పట్టింపును మనం రెండుగా విభజించాం. కొంతమంది సమైక్యానికి పెద్దపీట వేస్తున్నారు. ఆ క్రమంలో భిన్నత్వాన్ని హరిస్తున్నారు. తక్కినవారు భిన్నత్వంపైనే దృష్టి పెట్టి సమైక్యతను విస్మరిస్తున్నారు. ఈ సమతౌల్య రాహిత్యాన్ని సవరించిన మీదట రాజ్యం-జాతి ప్రాతిపదికకు ఉదాహరణగా నిలిచిన ఇండియాను పునరావిష్కరించాలి.
Also read: మతలబు 2019 ఎన్నికలలో ఖాయంగా జరిగింది, దాస్ పత్రం మాత్రం చేపను పట్టుకుంటుందని అనుకోవడం లేదు