ఎప్పుడు పోతుందో ఈ కోవిడ్!
ఎవరి చూపులూ స్థిరంగా లేవు
ఎవరి బతుకులూ స్థిమితంగా లేవు
కవిత్వం రాయక మూడు నెలలైంది
భావుకలోకంలో దివాళా
ప్రతి చిన్న కదలికా ఒక జల్‌జలా.
ఎందరో మిత్రులు నిష్క్రమిస్తున్నారు
ఏ నిజమూ హజం కావటం లేదు
ఆర్థిక చక్రాలు కట్‌కటాయిస్తున్నాయి
ఫోన్ చేద్దామంటే సంకోచం
అవతలి పక్క హాలత్‌లెట్లున్నాయో!
శరీరాలు పంపే సంకేతాలు
కొత్తగా పరమచెత్తగా ఉన్నాయి
నీడను కూడా శానిటైజ్ చేసుకుంటున్నారు
మా అమ్మాయి వార్తాపత్రికను
ఇస్త్రీ చేసి చదువుకుంటున్నది.
వివాహాలు జరుగుతూనే ఉన్నాయి
వివాదాలు ముదురుతూనే ఉన్నాయి
అంతా సజావుగానే
కుదురుకున్నట్టు భ్రమ.
నెలలకమానం
ఇంట్లో ఉండటమంత దరిద్రం
మరొకటి వుండదు.
కొలువుకు పోయిన కుర్రోడు
ఎట్లా తిరిగొస్తాడో తెలియదు.
ఎంతందంగా ఉండేది జీవితం!
ఇప్పుడు అర్థవిహీనంగానూ సతమతం
ఇవాళ సూర్యుడు రాలేదు
క్వారంటైన్‌లో ఉన్నాడేమో!
నాకైతే కవిత్వం పుట్టడం లేదు
ఎవరికోసం అనే
సినిసిజం ఆవహిస్తున్నది.
తప్పదింక
జూలు దులుపుకోవాలి
ఈ స్తబ్ధాన్ని శబ్దంగా మార్చుకోవాలి
చెదిరిన కిరణాల్ని ఒక్కచోట చేర్చాలి.