- సిడ్నీ టెస్టులో నెగ్గితే ధోనీ సరసన చోటు
భారత టెస్ట్ స్టాండిన్ కెప్టెన్ అజింక్యా రహానేను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. కెప్టెన్ విరాట్ కొహ్లీ అందుబాటులో లేని సమయంలో మాత్రమే తాత్కాలిక కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టే రహానే తనదైన శైలిలో నాయకత్వం వహిస్తూ అందరి ప్రశంసలు అందుకొంటున్నాడు. కెప్టెన్ గా తనకు లభించిన పరిమిత అవకాశాలనే అందిపుచ్చుకొంటూ కళ్లు చెదిరే విజయాలతో వారేవ్వా అనిపించుకొంటున్నాడు.
ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ సిరీస్ లో భాగంగా ప్రస్తుతం కంగారూగడ్డపై ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ మొదటి రెండుమ్యాచ్ లూ ముగిసే సమయానికి తన బ్యాటింగ్, కెప్టెన్సీ ప్రతిభతో జట్టును 1-1తో సమఉజ్జీగా నిలిపిన రహానే…సిరీస్ విజయం అందించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుత సిరీస్ లో భాగంగా విరాట్ కొహ్లీ నాయకత్వంలో.. అడిలైడ్ ఓవల్ లో ముగిసిన తొలి డే-నైట్ టెస్టులో భారత్ 36 పరుగులకే కుప్పకూలి 8 వికెట్ల పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే వ్యక్తిగత కారణాలతో విరాట్ కొహ్లీ స్వదేశానికి తిరిగిరావడంతో…కెప్టెన్సీ బాధ్యతలను రహానే చేపట్టాడు. మెల్బోర్న్ లో ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో అద్భుత విజయాన్ని అందించడం ద్వారా జట్టు ఆత్మస్థైర్యాన్ని అనూహ్యంగా పెంచాడు.
కెప్టెన్ గా నూటికి నూరుశాతం రికార్డు..
భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉంటూ వస్తున్న అజింకా రహానే 2017 సిరీస్ లో భాగంగా ధర్మశాలలో జరిగిన టెస్టు మ్యాచ్ లో తొలిసారిగా నాయకత్వం వహించాడు. అనీల్ కుంబ్లే కోచ్ గా ధర్మశాల టెస్టులో రహానే ఆస్ట్ర్రేలియా పైనే 8 వికెట్ల విజయంతో బోణీ కొట్టాడు. టెస్ట్ పసికూన ఆప్ఖనిస్థాన్ తో ముగిసిన టెస్టులో సైతం భారతజట్టుకు రహానేనే కెప్టెన్ గా వ్యవహరించడంతో పాటు భారీవిజయం అందించాడు. 2020-21 సిరీస్ లో భాగంగా మెల్బోర్న్ లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో సైతం రహానే 8 వికెట్ల తేడాతో కంగారూలను కంగు తినిపించడం ద్వారా మూడో విజయం సాధించాడు. కెప్టెన్ గా మూడుకు మూడు మ్యాచ్ లూ నెగ్గి వందశాతం విజయాల రికార్డుతో నిలిచాడు.
Also Read : అపురూపం ఆ ఇద్దరి త్యాగం….!
సిడ్నీ టెస్ట్ విజయం వైపు చూపు…
సిడ్నీ వేదికగా జనవరి 7 న ప్రారంభమయ్యే మూడోటెస్టులో సైతం రహానే నాయకత్వంలో భారత్ విజయం సాధించగలిగితే…టెస్టు కెప్టెన్ గా నాలుగు విజయాల ధోనీ రికార్డును రహానే సమం చేయగలుగుతాడు. అంతేకాదు…కంగారూగడ్డపై వెయ్యి పరుగులు పూర్తి చేసిన భారత క్రికెటర్ రికార్డు సైతం రహానే కోసం వేచిచూస్తోంది. ప్రస్తుత సిరీస్ లోని మెల్బోర్న్ టెస్ట్ వరకూ 797 పరుగులు సాధించిన రహానే మరో 203 పరుగులు సాధించగలిగితే 1000 పరుగుల మైలురాయిని చేరగలుగుతాడు.
విదేశీ గడ్డపై తిరుగులేని రహానే…
నేలవిడిచి సాము చేయటంలో రహానేను మించిన ఆటగాడు ప్రస్తుత భారత బ్యాటింగ్ ఆర్డర్ లో మరొకరు కనిపించరు. విదేశీ గడ్డపై నిలకడగా రాణించడమే కాదు..జట్టుకు కొండంత అండగా నిలవడంలో రహానేకు రహానే మాత్రమే సాటి. తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 67 టెస్టుల్లో రహానే విదేశీగడ్డపైన ఆడినవే 40 మ్యాచ్ లు ఉన్నాయి. మొత్తం 40 విదేశీ టెస్టుల్లో 2 వేల 891 పరుగులతో 45.88 సగటు నమోదు చేసిన అరుదైన ఘనత రహానేకు మాత్రమే దక్కుతుంది. ఇక స్వదేశీటెస్టు మ్యాచ్ ల్లో రహానే సగటు 39.28గా మాత్రమే ఉంది.
Also Read : టీమిండియాను వెంటాడుతున్న గాయాలు
సాంప్రదాయ టెస్టు క్రికెట్ లో సాంకేతికంగా రాహుల్ ద్రావిడ్ ఎంతటి మొనగాడో రహానే సైతం అంతే అత్యుత్తమ ఆటగాడని క్రికెట్ పండితులు తరచూ చెబుతూ ఉంటారు. కష్టకాలంలో జట్టుకు అండగా నిలబడటమే కాదు. తొణకని బెణకని నాయకత్వంతో రహానే అందరి మన్ననలూ అందుకొంటున్నాడు. సిడ్నీటెస్టులోనూ తన నాయకత్వ ప్రతిభతో భారత్ ను విజేతగా నిలుపగలిగితే ధోనీ రికార్డును రహానే సమం చేయటం ఏమంత కష్టంకాబోదు.