Tuesday, January 21, 2025

స్టాలిన్ కు శుభాకాంక్షలు

తమిళనాడులో పదేళ్ల తర్వాత మళ్ళీ డిఎంకె ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కరుణానిధి వారసుడుగా స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తద్వారా డిఎంకె ప్రతిష్ఠకు కొత్త పునాదులు వేశారు. కోవిడ్ నేపథ్యంలో ప్రమాణస్వీకార మహోత్సవం నిరాడంబరంగా జరుపుకున్నారు. కరోనా పరిస్థితులు లేకుండా ఉండిఉంటే, ఇతర రాష్ట్రాల నుంచి దిల్లీ నుంచి కొంతమంది ముఖ్యమైన అతిధులు పాల్గొని ఉండేవారు. బహుశా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరై ఉండేవారు. జగన్ ప్రమాణస్వీకారానికి స్టాలిన్ విజయవాడ వచ్చారు. మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ తదితరులు కూడా వెళ్లి ఉండేవారు. మొట్టమొదటగా  స్టాలిన్ సహా 34మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

Also read: మనసుకవికి శతవత్సర వందనం

యువకులకు స్థానం

గతంలో డిఎంకె ప్రభుత్వం హయాంలో ఉన్నవారితో పాటు కొత్తవారికి, యువకులకు కాబినెట్ లో స్థానాన్ని కల్పించి, స్టాలిన్ తన ముద్ర వేసుకొనే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో విస్తరణ సమయంలో, సమీకరణలు బట్టి, మిగిలినవారికి కూడా చోటు దక్కుతుందని అంచనా వేయవచ్చు. మిత్రపక్షమైన కాంగ్రెస్ కు నిన్నటి ఎన్నికల్లో 17సీట్లు వచ్చాయి. మంత్రివర్గంలో కాంగ్రెస్ కు కూడా స్థానాన్ని కల్పించే అవకాశాలు ఉన్నాయి. తొలి రోజు కొన్ని కీలకమైన ఫైళ్ళపై సంతకాలు చేశారు. ఇవన్నీ ఆర్ధిక భారాన్ని కలిగించేవే.  68 ఏళ్ళ వయస్సులో స్టాలిన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. మనోబలంతోనే ఇటు ప్రభుత్వాన్ని – అటు పార్టీని నడుపుతారని భావిద్దాం.

Also read: భారత్-బ్రిటన్ మధ్య గాఢమైన మైత్రి

ఇద్దరు హేమాహేమీల దారి వేరు

కరుణానిధి, జయలలిత రాష్ట్రాన్ని పరిపాలించిన సమయంలో భిన్న సంస్కృతులు, ఆలోచనలతో సాగినా, ప్రజాకర్షణను, ఆమోదన్ని బాగానే కూడబెట్టుకున్నారు. అప్పటి సామాజిక పరిస్థితులు కూడా వేరు. దానికి తగ్గట్టుగా, తమ సిద్ధాంతాలకు బద్ధులై వ్యవహరించారు. ఇప్పుడు తమిళనాడు సామాజిక, రాజకీయ స్వరూపం పూర్తిగా మారిపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి  తమిళనాడుపై ప్రత్యేక దృష్టిని సారిస్తోంది. అన్నా డిఎంకె అండతో చక్రం తిప్పాలని చూసింది. కాకపోతే, మొన్నటి ఎన్నికల్లో ఆ వ్యూహం బెడిసికొట్టింది. అనుకున్నది సాధించపోయినా, నాలుగు సీట్లను సంపాయించుకుంది. బిజెపి వ్యూహాన్ని ముందే పసిగట్టిన స్టాలిన్ ఎన్నికల సమయంలోనే సరికొత్త వ్యూహ రచన చేసుకున్నారు.

Also read: బుధజన బాంధవుడు బూదరాజు

స్టాలిన్ ఎత్తుగడ

హిందూవులకు వ్యతిరేకం కామని, సెక్యూలర్ భావజాలం కలిగిన వాళ్ళమని ముద్రవేసుకొనే ప్రయత్నం చేశారు. అది విజయవంతంగానే ఫలించింది. పెరియార్ రామస్వామి ప్రభావంతో ఆర్యవ్యతిరేక ముద్ర కలిగిన డిఎంకె పార్టీకి, స్టాలిన్ కొత్త రంగులు అద్దుతున్నారు. హిందూ దేవాలయాలకు, వైదిక, ధార్మిక వ్యవస్థల పునః నిర్మాణాలకు, వైభవానికి 1000కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రకటించి హిందువుల హృదయాలను దోచుకొనే ప్రయత్నం చేయడమే కాక, పాత సిద్ధాంతాల నుంచి కొత్త సంస్కరణల వైపుకు వెళ్తున్నట్లు సంకేతలను ఇచ్చారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉండడమే కాక, ఉపముఖ్యమంత్రిగా, మంత్రిగా, మేయర్ గా, పార్టీ అగ్రనేతగా కొంత అనుభవాన్ని సంపాయించారు. ఎంజిఆర్, కరుణానిధి, జయలలితలకు ఉన్నంత ప్రజాకర్షణ లేకపోయినా, పార్టీపై గట్టిపట్టే ఉంది. 

Also read: ఆత్మీయునికి అశ్రునివాళి

అనుభవం దండిగానే ఉంది

పరిపాలనలోనూ కొంత అనుభవం ఉంది. జయలలిత తోనూ మంచి సంబంధాలే ఉండేవి. కరుణానిధి వలె తీవ్రస్వభావం కలిగిన వ్యక్తి కాకపోయినా, రాజకీయ వ్యూహాలు తెలిసినవాడే. కాబట్టే, డిఎంకెను ఇక్కడ దాకా తీసుకువచ్చారు. గడ్డుకాలంలో  స్టాలిన్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. పెనుసవాళ్లు ఆయన ఎదురుగా ఉన్నాయి. ప్రస్తుతం అన్నింటి కంటే ముఖ్యమైనవి కోవిడ్ కల్పించిన సమస్యలు. రోజుకు దాదాపు 20వేల కేసులు నమోదవుతున్నాయి. ఆక్సిజన్ కొరత, సిబ్బంది, సదుపాయాల కొరత, వ్యాక్సినేషన్ మొదలైనవి చాలా కీలకమైనవి.

Also read: అనివార్యమైన లాక్ డౌన్

పళనిస్వామి పర్వాలేదనిపించారు

నిన్నటి దాకా ముఖ్యమంత్రిగా ఉన్న పళనిస్వామి సాధ్యమైనంత మేరకు మంచిపాలననే అందించారు. కరోనా కష్టాలను ఎదురొడ్డి, మంచి సేవలు అందించి, ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. కరోనా ఉధృతి గతంలో కంటే చాలా ఎక్కువ వుంది. ఎన్నోరెట్లు కష్టపడితే కానీ, పరిస్థితులను అధిగమించలేరు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. నిన్నటి ఎన్నికల్లో అన్నా డిఎంకెకు పోటీపడి ప్రజలకు హామీలను గుప్పించారు. వాటిని ఆచరించడం ఆషామాషీ కాదు. జయలలిత, కరుణానిధి ప్రభుత్వాలతో పాటు, పళనిస్వామి పాలనతో స్టాలిన్ పరిపాలనను ప్రజలు సరిపోల్చిచూసే వాతావరణం ఎక్కువగా ఉంది. వారిని తలపించి, మరిపించి, తన ముద్రను వేసుకోవడం స్టాలిన్ కు పెద్ద సవాల్ గా నిలుస్తుంది.

Also read: పత్రికాలోకాని వేగుచుక్క కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు

కేంద్రం సహకరిస్తుందా?

బిజెపి వ్యతిరేక కూటమిలో ఉన్న స్టాలిన్ ప్రభుత్వానికి, కేంద్రం నుంచి ఏ మేరకు సహకారం అందుతున్నది అనుమానమే. మమతా బెనర్జీ,స్టాలిన్ మొదలైనవాళ్ళు మోదీ వ్యతిరేక నాయకులుగా పెద్ద ముద్ర వుంది. భవిష్య జాతీయ రాజకీయాల్లో స్టాలిన్ పాత్ర ఎలా ఉండబోతుందో అనే చర్చలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. కేంద్రంతో వివాదాలు పెట్టుకోకుండా, కేవలం తన రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా వ్యవహరించిన నాయకుడు ఎంజిఆర్ ఒక్కరు మాత్రమే. జయలలిత, కరుణానిధి వీలైనప్పుడల్లా యుద్ధం చేశారు. వాటి ఫలితాలను కూడా అనుభవించారు. ఈ నేపథ్యంలో, స్టాలిన్ వ్యవహార శైలి ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

Also read: పాలకపక్షాలకే మళ్ళీ పల్లకీ

కేంద్ర ప్రముఖులతో స్టాలిన్ రహస్య మంతనాలు?

ఈపాటికే, కేంద్ర పెద్దలు – స్టాలిన్ మధ్య రహస్యంగా మాటలు జరిగినట్లు తమిళనాడులో వినిపిస్తోంది. నిజానిజాలు ఎలాగూ కొన్ని రోజుల్లోనే తెలిసిపోతాయి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా ప్రబలంగా ఉంది. పరిశ్రమలు -కాలుష్యం మధ్య సమతుల్యం లేకపోవడం వల్ల, తమిళనాడులో పారిశ్రామిక వాతావరణం ఆరోగ్యంగా లేదు. నీటి సమస్యలు కూడా ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. విద్యా రంగం స్థంభించి పోయింది. వైద్య, ఔషధ రంగాలు, ప్రజారోగ్యం కూడా కష్టాల కడలిగానే ఉన్నాయి. ప్రభుత్వానికి ఋణభారం కూడా చాలా ఎక్కువగా ఉంది. స్థానిక ఎన్నికల ప్రక్రియ కూడా ఇంకా సంపూర్ణంగా జరుగలేదు.

Also read: భారత్ – రష్యా సంబంధాలలో మలుపు

ఆర్థికంగా అనేక ఇబ్బందులు

కేంద్రం ప్రభుత్వం నుంచి రావాల్సిన జిఎస్ టి వాటాను తెప్పించుకోవడంలో ఏ మేరకు సఫలీకృతమవుతారో చూడాలి. స్థానిక పన్నుల వసూళ్లు కూడా ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, కష్టంగానే మారే అవకాశం ఉంది. పర్యావరణ అంశాలతో, చాలా ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి. గతంలో, డిఎంకె కు రౌడీలు, గూండాల రాజ్యమనే పేరుండేది. ఆ చెడ్డపేరును పోగొట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. రాష్ట్రంలోని మైనారిటీలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. మహిళల్లో మంచిపేరు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. నిన్నటి ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఎక్కువమంది అన్నా డిఎంకె వైపు మొగ్గారు. వారిని తమ పార్టీ వైపు మళ్ళించుకోవాల్సిన రాజకీయ అవసరం ఉంది.

Also read: బహుముఖ ప్రజ్ఞాశాలి కాళ్ళకూరి

తెలుగుపైన చిన్నచూపు తగదు

తమిళనాడులో అధికారిక లెక్కల ప్రకారం సుమారు 2.87 కోట్లమంది తెలుగువారు ఉన్నారు. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. గతంలో బోధనలో తెలుగు భాషను రద్దు చేయడం మొదలైన తెలుగు వ్యతిరేక కార్యక్రమాలను డిఎంకె ప్రభుత్వం చేపట్టింది. నిజం చెప్పాలంటే  స్టాలిన్ కుటుంబ మూలాలు ఆంధ్రప్రదేశ్ లోనే వున్నాయి. వారు పూర్తిగా తెలుగువారే (నెల్లూరు -ప్రకాశం). బతుకుతెరువు కోసం కరుణానిధికి పూర్వం ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వారి కుటుంబం వలస వెళ్ళింది. తెలుగు మూలాలు ఉన్నప్పటికీ, తెలుగుపై వారికి ప్రత్యేక ప్రేమానురాగాలు ఏమీలేవనే చెప్పాలి. జయలలిత సగం తెలుగువ్యక్తియే అయిన కారణంగా  తెలుగు భాషా, సంస్కృతులను బాగా గౌరవించారు. ఆమె తెలుగులో మాట్లాడటానికి బాగా ఇష్టపడేవారు.ఆమె దగ్గర కొంతమంది సిబ్బంది, పనివాళ్ళు తెలుగువారే ఉండేవారు. కరుణానిధి, స్టాలిన్ లో ఆ ఛాయలు పెద్దగా కనిపించలేదు.

Also read: సంచార జీవితానికి ఆస్కార్ పురస్కారం

కరుణానిధికంటే భిన్నంగా ఉంటారా?

సామాజిక, సాంస్కృతిక, సంప్రదాయాల సమతుల్యతను సాధించాల్సిన అవసరం ఉంది. కరుణానిధి కంటే, కాస్త భిన్నమైన ధోరణి, శైలి, వ్యూహాలతో  స్టాలిన్ ముందుకు వెళ్తారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కేంద్రంతో స్టాలిన్ ఘర్షణాత్మక వైఖరిని అవలంబించరనే మాటలు వినిపిస్తున్నాయి. డిఎంకె పాలనలో పోలీసులు స్వతంత్య్రంగా వ్యవహారిస్తారనే పేరుంది. ఇలా అనేక అంశాలను సమన్వయం చేసుకుంటూ, సమస్యలు, సవాళ్ళను, రాజకీయ ప్రతివ్యూహాలను అధిగమిస్తూ ముందుకు సాగడం కత్తిమీద సాము.

Also read: సకల సద్గుణ సంపన్నుడు హనుమ

తన ముద్ర వేసుకుంటారా?

డిఎంకె సంప్రదాయాన్ని కాపాడుతూ, వారసత్వాన్ని నిలబెడుతూ, తనదైన ముద్రను వేసుకోవడంలో స్టాలిన్ విజయాన్ని సాధిస్తారని భావిద్దాం. తన  వారసత్వాన్ని కూడా నిర్మించడం చాలా అవసరం. కుమారుడు ఉదయనిధి కొత్తగా ఎంఎల్ ఎ అయ్యాడు. కనిమొళి, దయానిధి మారన్, ఇతర కుటుంబ సభ్యులతో కూడా సత్ సంబంధాలను కాపాడుకుంటూ, తమిళనాడును స్టాలిన్ అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆకాంక్షిద్దాం.

Also read: భారత ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles