తమిళనాడులో 67ఏళ్ళ వయస్సులో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకొన్నారు స్టాలిన్. దాదాపు దశాబ్దం తర్వాత డిఎంకె పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చిన ఘనత కూడా ఆయనదే. స్వపక్షం, ప్రతిపక్షం అనే భేదభావాలు లేకుండా సోదర భావాన్ని చాటి చెబుతున్నారు. ప్రజల మధ్య సామాన్యుడుగా సంచరిస్తూ, కలిసిమెలిసి సాగుతూ తమిళనాడులోనే కాక, దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంటున్న స్టాలిన్ నేటి రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. స్టాలిన్ పోకడలు తమిళనాడు తరహా రాజకీయాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రతిపక్షాలను ఆగర్భశతృవులుగా భావించడం అక్కడి సంప్రదాయం. గడచిన చరిత్ర చూస్తే పరాకాష్టకు పర్యాయపదంగా ఆ సంఘటనలు నిలుస్తాయి. ఇప్పుడు ఆ వాతావరణమే లేదు.
Also read: అటు చైనా, ఇటు పాకిస్తాన్, అడకత్తెరలో భారత్
పగ, ప్రతీకార రాజకీయాలకు స్వస్తి
ఒకప్పటి తమిళనాడు మార్క్ పగ, ప్రతీకారాల రాజకీయాలు నేడు మిగిలిన రాష్ట్రాలకూ పాకాయి. విచిత్రంగా ప్రస్తుతం తమిళనాడులో కొత్త సంప్రదాయం వేళ్లూనుకుంటోంది. ఇది మంచి పరిణామం. సంక్షేమం, అభివృద్ధి వైపు అడుగులు వేస్తూనే పాలకులు -ప్రజల మధ్య దూరాన్ని చెరిపే ప్రయత్నం చేస్తున్నారు స్టాలిన్. ముఖ్యమంత్రిని నేరుగా కలిసి కష్టసుఖాలు చెప్పుకొనే పరిస్థితులు ప్రజలకు నేడు కనుమరుగైపోయాయి. పాలకులను సంప్రదించి, మంచిచెడు పంచుకొనే వెసులుబాటు పాత్రికేయులకు సైతం మృగ్యమైపోయిన దశలోనే ఉన్నాం.
Also read: వంద కోట్ల మందికి టీకాలు
తమ భావాలను, అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ మంత్రులు, అధికారులకు కూడా గగనకుసుమమై పోతోంది. ఇక ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆమడదూరంలో ఉండాల్సిందే. కొత్త ప్రభుత్వం రాగానే, పాత ప్రభుత్వ పధకాలను రద్దు చేయడం, పేర్లు మార్చడం అంతటా ఆనవాయితీగా మారిపోయింది. పాలకులను ప్రశ్నిస్తే ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఇదీ దాదాపు అన్ని రాష్ట్రాల్లో కనిపిస్తున్న వాతావరణం. దీనికి పూర్తి భిన్నంగా స్టాలిన్ సాగుతున్నారు. బస్సుల్లో, పార్కుల్లో,కార్యాలయాల్లో అకస్మాత్తుగా కనిపిస్తూ మంచిచెడు తెలుసుకుంటూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. కరోనా జాగ్రత్తల పట్ల ప్రజలను నేరుగా కలిసి అప్రమత్తం చేస్తున్నారు. పధకాల అమలుతీరును ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తున్నారు. అర్ధరాత్రి మెయిల్స్, ఆకస్మిక పర్యవేక్షణలు సంచలనంగా మారుతున్నాయి. జయలలిత స్థాపించిన కొన్ని పధకాలను కొనసాగించడమే కాక, ఆమె చిత్రపటాన్ని తొలిగించకుండా ఉండడంతో ప్రతిపక్షాలు సైతం స్టాలిన్ ను వేనోళ్ల ప్రశంసిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలను పరుగులు పెట్టిస్తున్నారు. మహిళలకు, శారీరక రుగ్మతలు ఉన్నవారి కోసం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం ప్రజల హృదయాలను గెలవడంలో ప్రముఖపాత్ర పోషిస్తోంది. వ్యవసాయానికి ప్రత్యేకమైన బడ్జెట్ ను కేటాయించడం మంచి అడుగు. మహామహులు సభ్యులుగా ‘ఆర్ధిక సలహా మండలి’ని ఏర్పాటు చేశారు. నోబెల్ పురస్కార గ్రహీత ఈస్థర్ డఫ్లో,ఆర్ బి ఇ మాజీ గవర్నర్ రఘురామరాజన్, భారత ప్రభుత్వ మాజీ ఆర్ధిక సలహాదారుడు అరవింద్ సుబ్రహ్మణ్యం వంటివారు అందులో సభ్యులుగా ఉన్నారు. ఈ తరహా నియామకం మేధావుల నుంచి చాలా ప్రశంసలు గుప్పించింది. ట్రిలియన్ డాలర్ ఎకానమీగా రాష్ట్రాన్ని ఆర్ధిక ప్రగతి వైపు నడిపించాలనుకోవడం మంచి సంకల్పం.
Also read: పారదర్శకతకు సరైన రూటు ఈ-ఓటు
ద్రవిడ సిద్ధాంత స్ఫూర్తి
అన్ని కులాలవారికి పురోహితులుగా అర్హత కల్పించి డి ఎం కె మూల సిద్ధాంతాలను ఆచరణలోకి తెచ్చారు. తద్వారా ద్రావిడ సిద్ధాంత అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నారు. కోవిడ్ ప్యానెల్ లో అన్నా డిఎంకె నేత, మాజీ ఉపముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ ను సభ్యులుగా నియమించి స్టాలిన్ ప్రతిపక్షానికి వినూత్న గౌరవాన్ని ఇచ్చారు. ఎస్ బాస్ అంటూ అన్నింటికీ జేజేలు కొట్టే భజన బృందాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి దూరంగా పెడుతూ అవకాశవాదులకు ఝలక్ ఇస్తున్నారు. స్టాలిన్ ను చూస్తుంటే అన్నాదురై గుర్తుకు వస్తున్నారని కొందరు పాతతరం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరిస్తూ,సెక్యూలర్ విధానానికి పెద్దపీట వేస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారంటూ తమిళనాడులో స్టాలిన్ మంచిపేరు తెచ్చుకుంటున్నారు. ప్రజల హృదయాలను కొల్లగొట్టి ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం కొనసాగడం, డిఎంకెను పది కాలాల పాటు అధికారంలో నిలబెట్టడం,తన వారసులకు బంగారుబాట వేయడం కోసం స్టాలిన్ అవిరామంగా కృషి చేస్తున్నారు. స్టాలిన్ కు రాజకీయ వ్యూహాలు, పదవీ స్వార్ధాలు ఉండి ఉండవచ్చు గాక. సర్వజన రంజకంగా పాలన సాగించాలనుకోవడం, మంచి నాయకుడుగా పేరు తెచ్చుకోవాలనుకోవడం ప్రశంసాపాత్రం,ఆదర్శనీయం.
Also read: కాంగ్రెస్ పునరుద్ధరణ ప్రారంభమైందా?