శ్రీ రమణ వెళ్లిపోయేట్ట పొద్దుటే అన్వర్ చెప్తే తెలిసిన వార్త ఇది. చాలా రోజులుగా నాకు ఆయనగురించిన కబుర్లేవీ తెలీదు. కానీ శరీరం అనారోగ్యాలని నేను మరి భరించను అని చెప్పేసే రోజు ఒకటి వొస్తుంది అందరి బతుకుల్లోనూ . మృత్యువు తప్పదు.
శ్రీరమణ నాకిష్టమైన కాలమిస్ట్, కధకుడు. మా ఇద్దరికీ మధ్య పరస్పర గౌరవాదరాలు ఉండేవి .
కబుర్లు చెప్పడంలో శ్రీరమణ ఆరితేరిన వాడు. ముందటి తరాల రచయితలని గురించి, కవులని గురించి కధలు బాగా చెప్పేవాడు. హాస్యం ఆయన కబుర్లలో అంతర్లీనంగా ఉండేది.
అందరికీ మహా నచ్చేసిన ఆయన కథ “మిధునం” నాకు నచ్చింది కాదు. ఆయన ఇంకొక కథ “బామ్మ – బంగారు మురుగు ” లో ఉన్న చలాకీ సమయస్ఫూర్తీ ఉన్న బామ్మ గారిని సృష్టించాకా మిధునం కధ ని శ్రీరమణ ఎలా రాయగలిగేడో మరి! పాతకాలం పిలక బ్రాహ్మడి దృష్టి మీది – అన్నాను నేను అక్కసు తో శ్రీరమణ తో ! స్త్రీల శారీరక శ్రమనీ అందులోని కష్టాన్నీ ఏమాత్రం గుర్తించకుండా స్త్రీల వంటింటి శ్రమ కి ఒక సెంటిమెంట్ ని జోడించి వాళ్ళ చాకిరీని గ్లామరైజ్ చేసి మొగుడి రుచులని తన పాకశాస్త్రప్రావీణ్యం తో నిరంతరం మెరిపించిన ఒక వయసు మళ్ళిన భార్య కధ శ్రీరమణ రాసిన “మిథునం.” సహజంగానే అది తెలుగు మగవారిని బాగా ఆకట్టుకుంది. ఆకట్టుకోకపోతే ఆశ్చర్యం గానీ – ఇష్టపడితే అందులో వింత ఏముందీ? అనే నేను శ్రీరమణ తో అన్నమాట! ఆ తరవాత అది సినిమా గా వచ్చింది అనీ ఆ సినిమా తనకి నచ్చలేదనీ అన్నాడు శ్రీరమణ. నేను ఆ సినిమాని చూడలేదు. అంత సహనం నాలో లేదు మిధునం కథని ఒక విమర్శ అన్నదే లేకుండా ఏకగ్రీవంగా నచ్చేసుకున్న తెలుగు మగ సమాజం లాగే – మరి శ్రీరమణ కూడా ఎక్కువ సంప్రదాయబద్ధుడే ! అందువల్లనే ఆయనకీ నా ” రసఝరీయోగం ” కథ నచ్చలేదు సహజంగానే ! నా వయ్యారి అమ్మమ్మ ఆయనకీ – ఆయన చాకిరీ అమ్మమ్మ నాకు నచ్చలేదు. నా కథ శ్రీరమణకి కోపం తెప్పించింది. పాతకాలం స్త్రీల మీద వెన్నెల చార సోకినా నేను నేను సహించలేను అన్నాడు శ్రీరమణ నాతో. ఇవన్నీ మా టెలిఫోన్ సంభాషణల్లో, ఉత్తరాల్లో సాగిన మాటలు. శ్రీరమణా నేనూ ఆంధ్రప్రభ వారపత్రికలో చేరి ఒక కాలమ్ రాస్తూ ఉన్న రోజులవి . ఒకసారి నా కాలమ్ ” ప్రతికూల ” పవనాలు”లో నేను “మంగతాయారి మొగుడు” అని ఒకటి రాసేను వ్యంగ్యంగా! అది శ్రీరమణ మీద రాసిన వెటకారమే!) ఇట్లా ఇద్దరమూ ఒకరినొకరు విమర్శించుకుంటూ కూడా ఉండే వాళ్ళం. సరదాగానే. అయినా నా ‘‘రసఝరీయోగం’’ కథ ఆయనని బాధపెట్టినట్టుంది. ఆయననే కాదు బ్రాహ్మణ రచయితలలో కొందరు మగ రచయితలనీ ఆ కధ ఇబ్బంది పెట్టింది. దాన్ని మించిన కథ మరేదీ పోటీకి రాకపోయినా న్యాయ నిర్ణేతలుగా ఉన్న బ్రాహ్మలు ఆ కథని బహుమతికి ఎంపిక చేయలేకపోయారు. ఇది జరిగింది 1996 లో మాట. అయినా ఆ కథ వీరందరి అసమ్మతినీ దాటుకుని పాఠకాదరణ పొంది, అనేక కథా సంకలనాలలో మళ్ళీ మళ్ళీ ప్రచురితమౌతూనే వొచ్చింది.)
అందుకనే కాబోలు నేను రాసిన అన్నమయ్య విమర్శనా సంపుటి మొదటి భాగాన్ని బాగా నాంచి నాంచి ఎప్పటికో ఆంధ్రజ్యోతిలో ఒక రివ్యూ అయితే రాసేడు గానీ అది నా పుస్తకాన్ని అందులోని విషయాన్నీ ఆ పుస్తకపు జాణ తనాన్నీ ఈషన్మాత్రం గా కూడా పరిచయం చేయలేకపోయింది. ఆ తరవాత నేను మరొక పరిచయ పుస్తకాన్ని మరింతగా అన్నమయ్య పద పరిచయాన్ని విస్తరించి ప్రచురించాను. అప్పుడు ఆయన మరింక ఏమీ అనలేక ఊరుకున్నాడు. “మీ ఎదుట చెప్పులతో నుంచో లేదు చూడండి ఆయన చెప్పులు విడిచి నమస్కరించాడు మీకు” — అని అన్నాడు తన పరిచయస్తుడిని పరిచయం చేస్తూ ఇదిగో మీ అభిమాని అని, ఆయన కొడుకు పెళ్ళికి వెళ్ళినప్పుడు నాతో!
చెప్పేదేమంటే ఆయన దృష్టిలో ఒక ఊహారూపం ఉంది పాత తరం బ్రాహ్మణ స్త్రీని గురించి . మేము ఇద్దరమూ బ్రాహ్మణ కుటుంబాల వారిమే! పాతకాలం బ్రాహ్మణ స్త్రీలు మా ఇద్దరికీ అంతే సమానం గా తెలుసు. కుటుంబాలలో పురుషుల ఆధిపత్య ధోరణికిందా … అనంతమైన చాకిరీ కిందా .. బ్రాహ్మణ వర్గాలలోని స్త్రీలు ఎంతగా ఇబ్బంది పడ్డారో తెలియక ఏమీ కాదు. నేను స్త్రీల చాకిరీ గురించి మాట్లాడేను విడిగా సందర్భం ఒచ్చినప్పుడల్లా! శ్రీరమణ అస్సలు ఆ పనిని ఒక్కనాడూ ఎక్కడా చేయలేదు– తన ఏ ఒక్క రచనలో గానీ! అది మా దృక్పథాలలో ఉన్న తేడాని ప్రతిబింబిస్తుంది. పాత్రల చిత్రీకరణలో శ్రీరమణ లో ఉన్న చాదస్తానికి నేను పరమ వ్యతిరేకిని. ఆసంగతి ఆయనకి కూడా స్పష్టంగానే తెలుసు. అయితే నా రచనలు ఆయనకి ఇష్టం. అది నాకూ తెలుసు. అందువలన నేను పెద్దగా ఆయన చాదస్తాలని పట్టించుకునే దాన్ని కాను. ఎప్పుడు మాట్లాడుకున్నా ఇష్టంగానే సంభాషించుకునే వాళ్ళం!
శ్రీరమణ కాలమ్స్ ని ఎక్కువ ఇష్టపడేదాన్ని నేను. కబుర్లు బాగా చెప్పేవాడు శ్రీరమణ. తన రచనల లోనూ … తన మాటలలోనూ కూడా పాత సంగతులని బాగా రక్తికట్టించేలా మాట్లాడటం శ్రీరమణకి వచ్చు. శ్రీకాంత శర్మ, శ్రీరమణ ఉన్న చోట ఎప్పుడూ కాలక్షేపం బాగా అయ్యేది.
ఇప్పుడింక శ్రీరమణ తనకి బహు ఇష్టులైన బాపూ రమణలతో ముచ్చటలాడడానికి కాబోలు 70 సంవత్సరాలికే భూమిని వొదిలిపెట్టేసాడు. శ్రీరమణ శ్రీమతి జానకికి నా సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను. మా దొడ్డ ఇల్లాలు ఆమె! భర్తని కంటికి రెప్పలా కాచుకుంది. ఆమెకి భర్త లేని ఎడబాటుని తట్టుకునే శక్తి లభించుగాక!
జయప్రభ
జూలై 19 , 2023