Saturday, December 21, 2024

శ్రీరమణీయం

అన్వర్

నేను పదవతరగతిలో ఉన్నప్పుడో, ఇంటర్ మీడియట్ లో ఉన్నప్పుడో సరిగా  గుర్తు లేదు కానీ  ఆంధ్రజ్యోతి లో ఓక పుస్తక ప్రకటన వచ్చింది . నవోదయ పబ్లిషర్స్ వారిది. “శ్రీ రమణ రంగుల రాట్నం. చమత్కారాలు, మిరియాలు, అల్లం బెల్లం, మురబ్బాలూ” అని. అప్పటికి  నాకు శ్రీరమణ ఎవరో తెలీదు. ముళ్ళపూడి వెంకట రమణే  శ్రీరమణ అని అనుకునేవాడిని. నాకు బాపుగారు తెలుసు. బాపు గారు ఏ రమణకి బొమ్మవేసినా ఆ రమణ శ్రీముళ్ళపూడి రమణే అయి ఉంటారని ఒక లెక్క తెలుసు. 

నాకు ఆ పత్రికా ప్రకటన లోని అల్లం బెల్లం మురబ్బాలు కావాలి అనిపించింది. మా రఘుగాడి  ధన సహకారంతో అనుకుంటా ఆ పుస్తకాన్ని పోస్ట్ లో తెప్పించుకున్నాను. అట్ట పైన, అట్ట లోపలా అంతటా  ఎంత బావుంటుందో ఆ పుస్తకం. రమణ గారి రాతల చమత్కారం, బాపు గారి బొమ్మల మహధ్భాగ్యం. రీచర్చీ కాలర్లు, చేయి జారిన అదృష్టరేఖలు, కథలూ-కజ్జికాయలు, మెంతికూర చింతామణి, ఉత్తరగ్రహణం, మూడు ప్రింట్లు ఆరు ఆటలూ, విద్యాలయాల్లో పిడకల వేట, కిటికీ పక్క సీటు, పొట్టలో చుక్క, కార్తీకంలో కవిత్వ సమారాధన, గళ్ళ నుడికట్టు చీర …… ఇట్లా ఒకటా రెండా ఎన్నెన్నో  శీర్షికల  మకుటాలతో ఆ  వ్యాసాలు  చక్కిలిగింతల హాస్యాలు పలికాయి. మొన్నటికి మొన్న  ఒకానొక రచయిత్రి గురించి అనుకుంటూ ” ఈ రచయిత్రి పెట్టే చివరి   సిరాచుక్క అంధ్ర సరస్వతి నొసట కస్తూరి చుక్క” అని ఎప్పుడు అవుతుందో కదా దేముడూ అని శ్రీరమణ భాషలో దండం పెట్టుకున్నా కూడా .

పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో కొనుక్కున్న, చదువుకున్న శ్రీరమణ గారిని ఈ రోజుకూ చదువుకోవడం, వాటిని గుర్తుగా తలుచుకోవడం అనేది  మన గొప్ప కాదు. శ్రీరమణ గారే అన్నట్టు “గింజకు జీవశక్తి ఉంటే అది ఎక్కడ పడేసినా పోదు”  తెలుగు  పాఠకుడికి బుర్ర ఉన్నంత కాలం అందులో జీవశక్తి ఉన్న గింజలు మాత్రమే బ్రతికి ఉంటాయి. శ్రీరమణ గారి నుడి ,ఆయన పలుకు అటువంటిది. అది పురాజన్మలో  శ్రీ మహావిష్ణువు చేతి బంగారు మురుగు. కలం రూపం ధరించి, రమణ అనే కలం పేరు దాల్చి కొంతకాలం ఇక్కడికి వచ్చింది. ఈ రోజు  అది వెనక్కి మరలి శ్రీహరి చేతినే చేరింది.

నా ఇంటర్ మీడియట్ రోజులు, చదువు దినాలు గడిచి,   అలా అలా నడిచి ఒకచోట వచ్చి నిలబడ్దాను. ఇదిగో ఇప్పుడు నేనున్న  నా ఇంటినుండి రెండో మలుపు దగ్గర సరాసరి కాస్త డౌన్ దిగితే శ్రీరమణ గారి ఇల్లు. వారానికి రెండు మూడు సార్లు ఆయన్ని కలిసి  బోలెడన్ని కబుర్లు గడిచేవి.  ఫోన్ లో కాలక్షేపాలు నడిచేవి.  వారి ఇంటికి వెడితే  శ్రీమతి  జానకి గారి కాఫీ ఆతిథ్యాలు. మా ఆవిడ ఎప్పుడయినా ఏదయినా పనిమీద   ఊరికి వెడితే మొహమాటపడకుండా తమ ఇంటికి వచ్చి భోజనం చెయ్యమనేవారు. నేను ఓ యెస్, తప్పకుండా వస్తా  అనేవాడ్ని,  రాకుండా అలానే మొహమాటపడేవాడ్ని. కాస్త సాహిత్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా మా ఇంటికి వస్తే వారిని పిలుచుకుని మా మేనమామ గారి ఇంటికి వెళ్ళినంత చనువైన దర్జాతో ఆయన ఇంటికి తీసుకు వెళ్ళి కబుర్లు పెట్టించేవాడిని.  ఆయనకు నేనంటే వాత్సల్యం ఉండేది. నా పుట్టినరోజు పండగ నాడు ఉదయాన్నే ఆయన కాళ్లకు దండం పెట్టుకుని వారి ఆశీస్సులు తీసుకునేవాడిని. నా  తొలి పుస్తకం రాగానే దగ్గరి వారని,  పెద్ద దిక్కని, ఆయన వద్దకు వెళ్ళి  పుస్తకాన్ని  అందించాను. ఆయన ఆ పుస్తకం సలక్షణీయతను ముచ్చటగా రెపరెపలాడించి, నా భుజం మీద చేయి వేసి బాపు గారు ఈ రోజు ఉండి, ఈ పుస్తకం చూసి ఉంటే ఎంత పొంగిపోయి ఉండేవారో తెలుసా?  అని నా కళ్ళలో చిన్న తడిని తెప్పించారు.

తెల్లవారుఝామున వాకింగ్ కని నాలుగు గంటలకు లేచి నడుస్తూ అక్కడ మలుపు తిరుగుతానా, నా కళ్ళు శ్రీరమణ గారి ఇంటి గేటుకు అంటుకు పోయి ఉంటాయి. ఎన్నిసార్లు బిగుతైన ఆ గేటు కిర్రుకిర్రులని పలకరించి ఉంటాను? ఆ ఇంట్లో ఒక కుక్క ఉండేది. అది ఎవరు వచ్చినా తెగ అరుస్తూ గోల చేసేది. గత రెండు, రెండున్నర సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. కరోనా రోజుల్లో  రమణ గారు వారి పెద్దబ్బాయి ఇంటికి వెళ్ళిపోయారు. నేను రోజూ ఉదయపు నడకలో  ఆ ఇంటివైపు చూస్తాను. రమణ గారు వచ్చి ఉంటారేమోనని  ఆశ. కలిసి బోల్డని కబుర్లు చెప్పుకోవచ్చని కోరిక.  ఆయన ఆరోగ్యం చాలా కాలంగా బావుండటం లేదని కబురు తెలుసు నాకు. అయినా ఆయన దగ్గరికి వెళ్లలేక పోయా.  ఎప్పుడు కలిసినా కూర్చుని మాట్లాడే ఆయనని  మంచం మీద చూడ్డం నాకు ఇష్టం లేకుండా ఉండింది. రమణగారు నాతో ఒక పుస్తకం గురించి చెప్పేవారు దాని శీర్షిక “సింహాల మధ్య నేను” అని  గొప్పగొప్ప వారి మధ్య గడిపిన ఒక వ్యక్తి జ్ఞాపకాల సమాహారం ఆ పుస్తకం. అట్లాంటి పుస్తకం నేను ఒకటి వ్రాస్తానండి. ఎంత గొప్పవారి మధ్య గడిపాననుకున్నారు నేను  అని చెప్పుకుని  పొంగిపోయేవారు ఆయన. శ్రీరమణ గారూ,  నేనూ మీ వంటి ఒక సింహం సాన్నిహిత్యంలో గడిపాను సర్. మిమ్మల్ని గుహలో చూడటమే నాకు తెలుసు. మంచం మీద దుప్పటి కప్పుకున్న సింహన్ని ఈ కళ్ళతో చూడలేక పోయాను సర్. అందుకే ప్రతి  రోజూ మీరు తిరిగి వచ్చే రోజుకోసం మీ ఇంటివైపు చూపులను అట్టిపెట్టేవాడ్ని.

నేను చిన్నతనం రోజులనుండి చదువుకున్న శ్రీరమణ గారిని రెండు వేల రెండు ఆ ప్రాంతాల్లో ఆంధ్రజ్యోతిలో మొదటిసారిగా  కలిసాను. మునుపు కాలంలో  మూతపడ్డ ఆంధ్రజ్యోతిని అప్పుడు కొత్తగా మళ్ళీ మొదలెట్టారు. నాకు ఆ పత్రికలో శ్రీ రమణగారు ఉద్యోగం చేస్తూ ఉన్నారని తెలీదు.  నేను కార్టూనిస్ట్ శంకర్ ని కలవడానికి అక్కడికి వెళ్ళాను. శంకర్ కూచునే దగ్గరలోనే రమణగారి సీటు. నేను ఆయన్ని చూస్తూనే ఆయన దగ్గరికి వెళ్ళి “మీరెవరో నాకు బాగా తెలుసు అనిపిస్తుంది. కాని తెలీదు, మీరు ఎవరు సార్” అని అడిగా. ఆయన నవ్వుతూ ఆయన ఎవరో చెప్పారు. నేను థ్రిల్ అయిపోయా, ఈయనేనా నా బాల్య స్నేహితుడు. ఈయన రచనలనేగా నవ్వులు నవ్వులుగా చదువుకున్నది . ఈ రోజు కళ్ళ ఎదురుగా నా ముందు … ఆ రోజు కలిసిన మహూర్త బలం గొప్పది. ఇక ప్రతి రోజూ ఆయన్ని కలిసేవాడిని.  అప్పుడు   నా ఉద్యోగం ఆంధ్రప్రభలో పతంజలి గారితో, ఉదయం పూట ఆయనతో  ఎన్నెన్ని కబుర్లు నవ్వులు గోల. సాయంత్రం కాగానే శ్రీరమణ గారితో ముచట్లు. ఎట్లాంటి రోజులవి. ఎంత బంగారు సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు అవి ! వెలిగిన రోజులవి.

ఒక సాయంత్రం శ్రీరమణ గారి కలిస్తే  నవ్వుతూ అన్నారు కదా” మీ గురువు గారిని కాస్త మమ్మల్ని క్షమించి దయ చూడమనవచ్చు కదా  మీరు”

“ఏమీ సర్?  ఏవయ్యింది,”

“నేనిలా అన్నానని మీరు ఆయనతో చెప్పండి చాలు”

నేను మరుసటి రోజు పతంజలి గారిని కలిసి శ్రీరమణ గారు ఇలా అన్నారు, ఏమిటి సర్ విషయం అని అడిగా.

“నిన్న ఒక ఎడిటోరియల్ వ్రాసాను మిత్రమా” అన్నారు పతంజలి గారు. అది తెచ్చుకుని చదివా. నాకు గుర్తున్నంతరకు దానిపేరు “ఒక చిరునవ్వు, ఒక వెక్కిరింత, ఒక లేమి”

అటువంటి ఒక సాహితీ చురక వ్రాయలన్నా, దానిని పుచ్చుకుని సిగ మల్లెగా దరించాలన్నా, సరస్వతీ దేవి అద్దంలో తనను చూసుకుంటూ వ్వే వ్వే వ్వే అనుకొడమే. లేరిక అటువంటి సాహితీవేత్తలు. రారిక ఆ మత్తేభాలు, శార్దూలాలూ.

బాపు రమణల గురించి కానీ , ఆ కాలం సాహితీ జనం గురించి కాని, ఎన్ని కబుర్లు, ఎన్ని విశేషాలు ఆయన దగ్గర ఉండేవో! ఫలానా కథ గురించి చెప్పాలన్నా, ఫలానా సాహితీ విశేషం గురించి ముచ్చటించాలన్నా, ఆనాటి సినిమా తెర వెనుక ముచట్ల వంటి అల్లం మురబ్బా ఘాటు  నుండి శార్వరి నుండి శార్వరి దాక ఎన్ని విశేషాల లోతుల్లోకి మునకలు వేయించేవారో!   శార్వరి నుండి అంటే నాకు గుర్తుకు వచ్చింది , రమణగారు మీరు నాకు విశ్వనాథ వారి నవల సెట్టు బాకి ఉన్నారు. మాట దక్కించుకోకుండా ఎలా వెల్లిపోయారు మీరు?  మా ఇద్దరికి ఉన్న మరో పిచ్చి స్టేషనరీ.  రంగు రంగు కాగితాలు  పెన్నులు పెన్సిల్లు, క్లిప్పులు. తాను మదరాసు లో ఉన్నప్పుడు కొన్న సరంజామా గురించి చక్కగా వినిపించేవారు. ఆయనకు గుర్తు వచ్చినప్పుడల్లా నా పైలట్ ఎలాబో పెన్నును అడిగి తీసుకుని దాన్ని అలా ఇలా తిప్పి చూసేవారు. జాగ్రత్తగా ఉంచుకొండి దీన్ని, చాలా ఖరీదైన పెన్ను కదా ఇలా చొక్కా జేబుకు తగిలించుకు తిరగవద్దు, అని హెచ్చరించేవారు. పదేళ్ల క్రితమే దాని ధర పన్నెండు వేల రూపాయలు. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ. అన్నం పెట్టే విద్యకు సంబంధించిన టూల్స్ ని ఇలా భక్తిగా కొనుక్కునే నా గుణంపై ఆయనకు చాలా మక్కువగా అనిపించేది. మేము చివరిసారిగా కలవడానికి ముందు ఇంటికి పిలిచి ఒక మంచి తోలు బ్యాగు కానుకగా ఇచ్చారు. ‘‘నాకు దీని క్వాలిటీ బాగా నచ్చిందండి, రెండు తీసుకున్నా. నాకొకటి, మీకొకటి.’’ ఇప్పుడు  అవన్నీ తలుచుకున్న కొద్ది   బాధగా ఉంటుంది. మనమేం పుణ్యం  పెట్టి పుట్టాం ఇంత అభిమానం, ప్రేమ పొందడానికి.  నేను స్కూటర్ కొన్న కొత్తలో కార్టూనిస్ట్  జయదేవ్ గారూ, నేనూ ఒక పత్రికలో కలిసి పని చేసేవాళ్లం. నాకు ఆయన్ని స్కూటర్ మీద ఎక్కించుకుని తిరగాలని చాలా కోరిగ్గా ఉండేది. ఆయనకు నా డ్రయివింగ్ మీద అపనమ్మకం  కాబోలు. ఎపుడు రమ్మన్నా, మీరు పదండి అన్వర్, నేను మీ వెనుకే నడుచుకుంటూ వస్తాగా అని నవ్వేవాడు. నేను కారు కొనబోతున్న కొత్తలో కార్ల గురించి శ్రీరమణ  కబుర్లు పెట్టేవాణ్ణి. ఆయనా చాలా విషయాలు చెప్పేవారు కార్ల గురించి  , బెజవాడలో నవత డ్రయివింగ్ స్కూలు వారి గురించి, వారితో స్నేహం, బాపు గారు వ్రాసి ఇచ్చిన లోగో గురించి. ‘‘సర్, నేను కారు కొన్నాకా నా కారు ఎక్కుతారా మనం కలిసి  తిరుగుదామా?’’  అనేవాడ్ని, తప్పకుండా అండి అని ఆయనా  భరోసా ఇచ్చారు. కానీ మేము ఇద్దరమూ వేరే కార్లు ఎక్కి తిరిగాము కానీ,  మా కారు మాత్రం  ఎక్కి తిరగలా. అది ఎందుకో కుదరలా. ఒకసారి ఒక ప్రయాణం ప్రపోజల్ పెట్టారు. ఏవండీ ఓడ ఎక్కి శ్రీలంక వెళ్లి వద్దామా?  ప్రయాణం భలే బావుంటుంది. మీరు వస్తాను అంటే మీకు కూడా టికెట్ బుక్ చేపిస్తా అన్నారు . అయితే ఓడ కన్నా ముందే కరోనా వచ్చింది. ప్రయాణం మునకేసింది.

ఆయన హాస్యమూ, చురకా రెండూ పదునైనవి. దానికి ఎటువంటి మినహాయింపులు ఉండేవి కావు. ఫలానా ఆయన ఈయనకు బాగా దగ్గరివారు అనుకుంటామా ,ఆ దగ్గరి వారిపైన అయినా  ఒక చురక వేయవలసి వస్తే  వేయడమే కానీ మన పర అని ఏమి ఉండేవి కావు.  బాపు గారి దగ్గర ఉండి ఉండి రమణ గారికి కూడా  బొమ్మల లోతుపాతులు కొంతమేరకు తెలుసు . పిచ్చి బొమ్మ, వంకర బొమ్మ, బొమ్మ తక్కువ బొమ్మ, మేధావి బొమ్మల మీద ఆయనకు బాగా చిన్న చూపు. ఇదంతా దొంగ బొమ్మల సంగతి. అలా అని ఆయనతో పికాసో గురించో, లక్ష్మాగౌడ్ గురించో, తోట వైకుంఠం గురించో మాట్లాడి చూడండి. పులకించి పోతూ చెబుతారు.  ఒకసారి ఒక పత్రికాఫీసులో  మేమిద్దరం కబుర్లు చెబుతూ కూచున్నామా, స్కానింగ్ డిపార్ట్మెంట్ నుండో , ఆర్ట్ డిపార్ట్మెంట్ నుండో ఒకాయన వచ్చి “సర్ ఆర్టిస్ట్ బొమ్మ వేసి ఇంటికి  వెల్లిపోయారు, అయితే బొమ్మ ఏది పై భాగమో, ఏది కింది భాగమో అర్థం అవడం లేదు. మీరు కాస్త చెప్పండి అన్నారు ఆయన ఆ బొమ్మని ఎత్తి పట్టుకుని.” ఈ బొమ్మని ఇలాగే   ఎడిట్ పేజీలో ఆర్టికల్ కి ఉపయోగించుకోండి, ఇదే బొమ్మని కుడివైపుకు తిప్పి ఎడిట్ పేజిలోనే ఆ చివర ఒక కవిత వస్తుంది కదా, దానికి వాడుకోండి. బొమ్మని ఎడమ వైపుకు తిప్పి పెట్టుకుని ఆదివారం అనుబంధంలో కథకు ఇలస్ట్రేషన్ గా పెట్టుకోండి. ఇక ఈ రోజు మన కార్టూనిస్ట్ రాకపోతే ఆ కార్టూన్ ప్లేస్ లో ఈ బొమ్మని తలకిందులు చేసి పెట్టుకుంటే సరిపోతుంది” మొహంలో  కోపం, విసుగు, చిరాకు ఏమీ లేకుండా ఆయన అలా కూల్ గా చెబుతుంటే , మనం పేపరాఫీసు పైకప్పు ఎగిరి పోయేలా నవ్వుతూ ఉంటే ఏం మర్యాద? రమణ గారు ఒక రచయితకు ముందు మాట వ్రాస్తూ ఇలా అన్నారు “మనం ఒక పుస్తకం అచ్చుకి ఇస్తున్నాము అంటే దాని అర్థం  ఒక వెదురు పొదను సమూలంగా నాశనం చేస్తున్నామని. ఒక వెదురు పొద పచ్చగా బ్రతకాలా? లేదా మీ పుస్తకం బయటికి రావాలా? అనేది మీ  విజ్ఞత కే వదిలేస్తున్నా.

చెప్పాగా, ఆయనకు నేనంటే వాత్సల్యం ఉండేది. లక్షల రూపాయల పనులని ఆయన నాకు ఇప్పించారు. ఆయన వ్రాసిన ఒక పుస్తకానికి నేను బొమ్మలు వేసి ఋణం కొద్దిగా మాత్రమే తీర్చుకున్నాను. ఆయన వెంకట సత్య స్టాలిన్ పుస్తకానికి బొమ్మలు వేద్దామని నాకు చాలా కోరిగ్గా ఉండేది.  శ్రీరమణ గారికి ఉన్న అభిమానుల్లో ఒక పెద్ద అభిమాని చిత్రకారులు శ్రీ మోహన్ గారు. ముచ్చట పడి ఆయన   వెంకట సత్య స్టాలిన్ కి బొమ్మలు వేస్తానని చెప్పి వేసి పెట్టారు. నిజానికి ఆ బొమ్మలు ఏమీ బాగో ఉండవు. ఆ విషయంలో  శ్రీరమణ గారు హెల్ప్ లెస్. అయితే  మోహన్ గారు, శ్రీరమణ గారు ‘చిలకల పందిరి’ అని ఒక సూపర్ డూపర్ హిట్ శీర్షిక నడిపారు. ఆ రచన, ఆ బొమ్మలు బంగారం మరియూ తావే. మోహన్ గారన్నా, ఆయన వచనం అన్నా, ఆయన రేఖలు అన్నా శ్రీరమణగారికి కూడా చాలా ముచ్చట. ఆ మధ్య పాత పుస్తకాలు వెదుకుతుండగా ఆయన సోడా నాయుడు కథకి గోపి గారు వేసిన నలుపూ తెలుపు  బొమ్మ నా కంటపడింది. ఎంత అందం? కథంత అందం ఆబొమ్మది. పత్రికాఫీసుల్లో పని చేసారు కదా ఆయనకు చాలా చాలామంది చిత్రకారులతో పరిచయం , చాలా దగ్గరితనం ఉండేది. అయితే ఆయన రచనలకు బాపు గారు తెచ్చిన అందం ఎవరూ తేలేదు, తేలేరు కూడా. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా కూడా ఆయనకు ఇష్టమైన చిత్రకారులు బాపు కాకుండా మోహన్ గారు, గిరిధర్ గౌడ్ గారు మాత్రమే నని నాకు తెలుసు. 

ఈ రోజు ఉదయం శ్రీరమణ గారిని చివరి చూపుగా పలకరించడానికి ప్లోటిల్లా అపార్ట్మెంట్ కి  వెళ్ళాము నేను, కవి నాయుడు గారు. రమణ గారు అద్దాల పెట్టె లో పడుకుని ఉన్నారు. అలా మాటడకుండా, నిశ్శబ్దంగా ఉంటే ఆయనేం శ్రీరమణ?  నా కంటి అద్దాల లోపల నీరు గిర్రున తిరిగింది, అద్దాలు తీసు కళ్ళు తుడుచుకునే పని చేయలేదు. ఆ గాజు పెట్టె లో నిలువెల్లా ఆయన నాకు కనపడుతున్నారు. ఏదో లోపం, ఏదో తప్పు జరిగింది, నేనేదో మరిచిపోయా.  కొంత కాలం క్రితం ఒకసారి మా ఇద్దరి  మాటల్లో మనం   ఎవరి ఇంటికయినా వెడుతూ వారికి ఏమీ పట్టుకు వెడితే బావుంటుంది? మనం ఖర్చు పెట్టే రూపాయ ఎట్లా వృధా పోకుండా ఉండాలి? ఆ ఇంట్లో వాళ్లకు షుగర్ ఉంటే ఎలా? ఈ పూలు, బొకేలు అవీ పట్టుకు పోతారు కదా, పూలు ఎట్లాగూ వాడిపోతాయి కదా ,దానికి డబ్బులు దండగ కదా  అని శ్రీరమణ గారితో మాటలు పెట్టుకున్నాను . దానికింత గొడవెందుకండి?  ఏదయినా పట్టుకు వెళ్ళొచ్చు.  ఆ ఇంట్లో వయసు పెద్ద వాళ్ళే ఉండి , వారికి షుగర్ ఉంటే మాత్రమేం?  తీసుకు వెళ్ళిన స్వీట్లు వాళ్ళ ఇంట్లో పిల్లలు తింటారు, పిల్లలు లేకపోతే పక్కింటి వారికో, లేదా వారి పనివారికో పంచుతారు. పూల బొకేలు ఇస్తే  డబ్బులు దండగ ఏమీ కాదు.   పూల గుత్తిని  చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందండి. వాంగో సన్  ప్లవర్స్ పెయింటింగ్ లాగా, దాని రంగులు, రెక్కలు  చూస్తూ గడపవచ్చు కదా. అప్పుడు ఇంటికి ఇంటికి వచ్చిన వారెవరైనా ఎక్కడిది పూలగుత్తి, ఏమిటి విశేషం అని అడిగితే “మమ్మల్ని చూడ్డానికి ఇంటికి అన్వర్ గారు వచ్చి వెళ్లారు. మా కోసం పూలు పట్టుకు వచ్చారు” అని సంతోషంగా చెప్పుకుంటారు కదా. శ్రీరమణ గారు ఈ రోజు మీకొక పూల మాల తేవాల్సింది నేను. తేనందుకు మీరు ఫీల్ అయ్యేది ఏమీ లేదు. సింహాల  మధ్య తిరిగి ఉండి కూడా నేను మర్యాద తెలీని శిష్యుడిగా మిగిలిపోలా! ఇపుడు ఏం చేసేది? బుద్ది లేని జన్మ. థూ!

ఒకసారి నేను ఒక కథ చదివాను . వేలూరి శివరామశాస్త్రి గారిది. కథ పేరు  ‘తల్లి లేని పిల్ల”ఆ కథలో ఇలా ఉంటుంది

“చిట్టెమ్మ మేకల మంద నడుమ కూచుంది. చుట్టూ పది పన్నెండు దుత్తలు, ఐదారు చెంబులూ. చిట్టెమ్మ కొడుకు రాఘువులు మేకపాలతో ఒక చిన్న గుంట అలికి దానిలోనూ, ఒక చిన్న రాతి తొట్టిలోనూ కుక్కలకూ, కుక్క పిల్లలకూ మేకపాలు పోస్తున్నాడు. రాఘువులు తండ్రి నాగాయ మంద చివర నించుని మేకలని పరీక్ష చేసి పళ్ళు కదిలిన వానికి క్షౌరం చేసి చక్రాంకితాలు వేశాడు. కొన్ని మేకల డెక్కల నడుమ ముళ్ళు లాగాడు. ఒక మేకవి కాలిమీది వెంట్రుకలు లిక్కితో కోసి నెత్తురు కంటచూసి- ‘ఓరే నాయనా! ఉప్పుపెట్టి రుద్దు” అని పురమాయించాడు”

నాగాయ తన కొడుకును పురమాయిస్తే పురమాయించాడు కానీ, నాకు అనుమానాలు, ఎందుకుని ఈ చక్రాంకితాలు, అదీనూ పళ్ళుకదిలినవాటికే ఎందుకు? లిక్కి దూసి మేక నెత్తురు పరీక్ష చెయ్యడం అదేవిటి? సరే ఉప్పు రాయడం ఎందుకో కాస్త అంచనాకు అందిందనుకో. ఎవరిని  అడిగితే వీటికి సమాధానం దొరకాలి? అపుడు నాకు ప్రతి ప్రశ్నకు సమాధానంగా శ్రీరమణ గారు ఉండేవారు. మహానుభావుడు. కేవలం  ఆధునిక సాహిత్యాన్ని, ప్రాచీన వాగ్మయాన్ని చదువుకున్న మనిషే కాదు. జీవితాన్ని పరిశీలనగా చూసిన వాడు కూడా. పల్లెలో పుట్టి పెరిగినవాడు, అన్నీ తెలుసు. తెలిసిన వాటిని విప్పి చెప్పే హృదయం ఉంది. ఇలా ఉన్న హృదయాలన్ని మూసుకుపోయి ఇప్పుడు మనసు లేని  మనస్సుల, మనుష్యుల మధ్య బ్రతకడం ఎంత కష్టమో, చికాకో సింహాల మధ్య తిరిగిన మీకు ఏమి తెలుస్తుంది? చెప్పినా ఏమి అర్థమవుతుంది?

అన్వర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles