పన్నాల సుబ్రహ్మణ్యభట్టు
పాతికేళ్ల వ్యంగ్య రచనా ప్రయాణంలో శ్రీరమణ సాధించింది తక్కువేం కాదు.
పానుగంటి తరువాత సీట్ ఏకంగా శ్రీరమణదే. పానుగంటి వారి 142 ఉపన్యాసాలన్నీ ఒక చక్రం ఒక వైపు, శ్రీరమణ లెక్కకు మించిన ఏడు ఆకుల చక్రం మరోవైపు. ఇదీ మన తెలుగు హాస్య రథ ప్రయాణం.
పానుగంటి గంటు భాష నుండి శ్రీరమణ పన్ తీరాల వరకూ ఆదో ఇసుకలో పరుగె. ఆ రధం వెనుక నడిస్తే పాఠకుడి కాళ్ళ కింద ఇసుక కూరుకుపోతుంది. జారిపోతుంది. కాలు లేచినపుడల్లా మనసు తేలిక అయిపోతుంది. అదేమిటో హాస్య రచనలు చదివితేనే కాలికీ మనసుకీ బంధం తెలిసేది. ఇద్దరు రచయితలదీ ఓకే తంతు. పాఠకుడి కాలు కూరుకున్నప్పుడల్లా ఏదో కమ్మని తీపు. కాలు లాగితే చాలు దివినుంది గజమెత్తు గెంతినట్టుంటుంది.
పానుగంటి చిటికినవేలు సాక్షిగా రాజకీయాల జోలికి పోలేదు. శ్రీరమణ బొటనవేలెత్తి రాజకీయాలు శీర్షికలుగా చాలా పొడిచాడు. నిజానికి తెలుగు వారి అక్రమ విక్రమ నసక్రమ పరాక్రమ భీరుక్రమ విన్యాసాలు అన్నీ పెట్టాడు. పాము భ్రమ, తేలుకుట్టు, దొంగనట్లు, మెరుపుద్యుతి, ఆత్మాహుతి అన్ని లక్షణసారాలను చిలకరించాడు .
తేలికైన చప్పుళ్లతో, సూదయినగాటుతో, సామాజిక సందులో, సాంసారిక పడకల్లో, రాజకీయ హారతులతో నవ్వించే పొగపెట్టి నెట్టిన విసుగు చెందని వీరుడు శ్రీరమణ ఒక్కడే.
ఆయన పదాలు పలువరసల బీభత్స ప్రయాణాలు. కాయినింగ్, జాయినింగ్, బైటింగ్ గుర్తులు కనపడవు.
ఆయన ఈ నవ్వుల ప్రయాణంలో ఆల్ రౌండర్ ఆటగాడు .
జోగింగ్ లేకుండా బ్యాటింగ్ చేసిన వీరుడు .
ఆయన విసిరిన బంతి ఒకటి వెంకట సత్య స్టాలిన్ అనే పేరిట బాంబులు పేల్సింది. పుస్తక రూపంలో వస్తుంది తెలుగు వారి జాయింట్లు నలుగుతాయి. ఎక్కడనుంచి వచ్చిందో నేను కూపీ పట్టా. అప్పట్లో శ్రీశ్రీని నేను శీను అని పిలిచేవాడినంటూ నేమ్ డ్రాపింగ్ పేరిట 90లొనే శ్రీచానల్ లో రాసిన తర్వాత శ్రీరమణగారే డెవెలప్ చేసారు వటవృక్షంలా పెరిగిన సత్యస్టాలిన్ తెలుగు హాస్యచరిత్రలో గిరీశాన్ని మించుతాడు.
శ్రీరమణగారిది ఒక టోటల్ మొఘలుగార్డెన్ లాంటి హ్యూమర్ గార్డెన్. ఆ వెరైటీకి అందులో విరుపులకి, కుదుపులకి, కొసమెరుపులకి అంతు లేదు.
ఒక్క శీర్షికల మీదనే పదాల ‘ ఫన్ ‘ చాయతీ మీదనే ఒక దిగ్గజ గ్రంథం రాయవచ్చు .
ఇన్ని గునపాల ఆయుధాలతో సిద్ధమైన హాస్యావతారం తెలుగు వేళాకోలా సముద్రతీరంలో ఇంతవరకూ అవతరించలేదు .
ఆ పాటి చాలదూ ఆంధ్రామొఖాలకు!
(శ్రీరమణ పోయిన తర్వాత భట్టుగారు చేసిన రచన కాదు ఇది. అయిదేళ్ళ కిందట శ్రీరమణకు తెనాలిలో సన్మానం జరిగినప్పుడు సభలో పాల్గొని ఇంటికి వెళ్ళిన తర్వాత సరదాగా రాసింది. శ్రీరమణకు పంపలేదు.)