ఫొటో రైటప్ : తన చిత్రాలున్న పుస్తకం చూపుతూ ప్రఖ్యాత చిత్రకారుడు ఎస్ వి రామారావు
ఎస్ వి రామారావు
మహోన్నత రచయిత, చాల అతి సాధారణ వ్యక్తిగా కనిపించే శ్రీరమణ గారు – మనమధ్య లేకపోవడం – ఊహించలేని బాధ మనందరికి. కాని వారి రచనలు – ప్రజాదరణ పొందినవి – దివ్యమైన వి, వారిని మనముందుంచుతాయి. వచ్చే తరాల వారి ముందుగూడ. శ్రీరమణ గారి ఆత్మ శాంతి కి ప్రార్ధన చేస్తున్నాను.
నా జ్ఞాపకాలు : శ్రీరమణ గారితో పరిచయం వారు ఆంధ్రప్రభ వారపత్రికలో, హైద్రాబాద్ లో ఉండగా. దాదాపు రోజూవారీ ఆఫీసులో వారితో కూర్చొని సంభాషించుట. జోకులు వేసేవారు. కాని, వారు తనకు వచ్చిన కథలు చదువుతూనే ఉండేవారు. వారి పనిలో లోపంలేకుండగనే, వచ్చిన వారితో మాట్లాడేవారు. అదే నిజాయితి వారిపట్ల ఉన్నది జీవితమంతా. తెనాలిలోని సురేష్ గారితో వెళ్లాను హైదరాబాదు నగరానికి, ప్రముఖ చిత్రకారులు గారితతోగూడ కలిసి. హైదరాబాదులో ప్రముఖులు ఆంధ్ర ప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకరైన బుద్ధప్రసాద్ గారు, పాత్రికేయులుగా ప్రసిద్ధిపొందిన రామచంద్ర మూర్తిగారు, బహు గ్రంథకర్త, మహాకవి నగ్నమునిగారు – మేమందరం కలిసి శ్రీరమణగారిని చూచేందుకు వారింటికి వెళ్లాం. ఆయన మంచంమీదనే పడుకుని ఉన్నారు. మగత మైకంలో. అసలు పూర్తిగా లేవలేరట. అన్నీ మంచంలోనే. అందరితో, కష్టమైనాసరే, ఎక్కడ నుండో తెచ్చుకొన్న బలంతో చాల సేపు మాట్లాడారు. అందరం వెళ్లి వారిని చూ చేందుకు వచ్చినందుకు సంతోష పడ్డారు. నన్ను పరిచయంచేస్తే “యస్.వి.రామారావుగారా. ఎందుకు తెలియదు! సంజీవదేవ్ గారి మిత్రులు గదూ!” అన్నారు. నాకు పరమానందం కలిగింది నన్ను గుర్తుపట్టినందుకు, ఎన్నో, ఎన్నెన్నో సంవత్సరాల తర్వాత. కాని నా హృదయం అంతా , బయటకు కనుపించని దుఖంతో నిండిపోయింది, వారున్న దీనావస్థ చూ చి. దూరంగా వచ్చాను వారి దగ్గరనుండి. అదే చివరి సారిగా చూచింది శ్రీరమణ గారిని. మిత్రమా “మా అందరి మిత్రుల హృదయాలలో నీవున్నావు – అలాగే ఉంటావు. తెలుగులో నీ రచనలు చదివే ముందు తరాల వారందరిలో. గొప్ప రచయితగా కలకాలం తెలుగు రాష్ట్రాలలో నీది చిరస్థానం. ఇప్పుడు మరో లోకాలలో, ఎక్కడ ఉన్నా సరే, నీ చుట్టూ , ఎప్పుడూ ఎంతోమంది గుమిగూడతారు నీ మాటలు వింటూ. నువ్వు మాత్రం నిత్యానందంగా ఉండు. నీ మిత్రుడు – నేనే, ఇంకెవరూ – ఆర్టిస్టు యస్.వి.రామారావు, చికాగో,అమెరికా.