- సునిశిత పరిశీలన, వ్యంగ్యవైభవం
- వాసికెక్కిన కథకుడు
నోరువాయి పుష్కలంగా ఉండి, చమత్కారాన్ని నిలువెల్లా పండించి, మండించిన శ్రీరమణ లోకమనే ఇంటిని ఖాళీచేసి వెళ్లిపోయారు. ఆయన అసలు పేర్లు తెలిసినవాళ్ళు చాలా తక్కువమంది. ఒకటికాదు, ఆయనకు రెండేసి పేర్లు. పుట్టినప్పుడు పెట్టిన పేరు వంకమామిడి రాధాకృష్ణ. దత్తత వెళ్లిన తర్వాత కామరాజు రామారావు. రెండు పేర్లు, రెండు ఇంటి పేర్లు జనాల్ని గందరగోళంలో పడేస్తాయని ఒకే పేరు పెట్టుకున్నారు. అదే శ్రీరమణ! పేరుపెట్టుకున్న ముహూర్తబలం బాగానే పనిచేసింది. ‘శ్రీరమణ’గా ఆయన పేరుమోశారు. తెనాలి దగ్గర పల్లెలో పుట్టిన ఈ మనిషికి మనీష చాలా ఎక్కువ. అదే దిగ్గజాలను దగ్గరకు చేర్చింది. నూనూగు మీసాల నూత్న యవ్వనంలోనే నండూరి రామ్మోహనరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ వంటి దిగ్దంత సంపాదకులను ఆకర్షించాడు. ఇంకాస్త వయసొచ్చాక, బాపురమణలను కూడా అట్లే ఆకర్షించాడు. ఆ ఆకర్షణంతా ఆ కలంలో నిండివున్న చమత్కారంలో దాగివుంది. పల్లెదనం పుష్కలంగా వున్న వ్యక్తి. దానికి తోడు పఠనం, అంతకు మించి పరిశీలన, పుట్టుకతో వచ్చిన ప్రతిభ శ్రీరమణకు కీర్తిశ్రీలు అందించాయి. ఆ చమత్కారం కొండొకచో కొందరికి వెటకారం అని అనిపించవచ్చు! కానీ ఆ కలంలో, ఆ గళంలో తెలుగుదనం మూర్తీభవించిన చతురతే రాజ్యమేలేది. ఆయన పుట్టిపెరిగిన తెనాలి కళలకు, కథలకు కాణాచి. ఆ నీరుగాలి కూడా ఆయనను ఊరకుండనీయలేదు.
Also read: అదృష్టవంతుడు
రాతలోనూ, రీతిలోనూ సంప్రదాయం
భౌతికశాస్త్రం చదువుకున్నా, అక్కడ వుండనివ్వలేదు. పెన్నిచ్చి ప్రపంచంపైకి పంపించింది. సారస్వత ప్రపంచాన్ని పెద్దగా పరిచయం చేసింది. అధునాతన కథలపై ఎంత మోజును పెంచిందో, సంప్రదాయ సాహిత్యం, పద్య సారస్వతంపైనా అంతే రాగాన్ని రగిలించింది. పైకి ఎటువంటి చమక్కులు వేసినా, లోపల సంప్రదాయం చురుక్కుమంటూనే వుంటుంది. రాతలోనూ, రీతిలోనూ అది కనిపిస్తూనే వుంటుంది. భగవాన్ రమణ మహర్షిపై ఉండే భక్తితో ‘శ్రీరమణ’ గా తాను పేరు మార్చుకున్నారు. కథకుడిగా, పాత్రికేయుడిగా, పేరడీ, వ్యంగ్య రచయితగా దాదాపు ఐదున్నర దశాబ్దాల ప్రస్థానం సాగించారు. ఆంధ్రజ్యోతితో మొదలైన ఆ పయనం సాక్షి వరకూ నిక్షేపంగా సాగింది. కనీసం మూడు తరాలవారికి వారు దగ్గరయ్యారు. మధ్యలో, మధ్యమధ్యలో ఛాన్నాళ్ళు సినీమాల్లో తిరిగారు. తిప్పించినవాళ్ళు, తిప్పుకున్నవాళ్ళు బాపురమణలు. ఆ యా సినిమాల్లో ఆయన ఏంచేశారో కొందరికే తెలుసు! సినిమా ప్రపంచం ఏమిచ్చిందో ఆయనకే తెలుసు! తన కథ ‘మిధునం’ సినిమాగా వచ్చాక, ఆ కథ, ఆ కథతో పాటు ఆయన ఈ తరంవారితో సహా ఎందరికో ఎక్కువగా తెలిశారు. ఈ సినిమానిర్మాతలకు,దర్శకుడు తనికెళ్ళ భరణికి ఈ విషయంలో తెలుగువాళ్ళు కృతజ్ఞతలు చెప్పాలి.బాలుగారికి ఈ సినిమా అంటే వల్లమాలిన ప్రేమ. లక్ష్మిగారికి చెప్పలేని ప్రీతి.
Also read: కొమర్రాజుకు కోటి దండాలు
పన్నెండేళ్ళకే జాతీయ స్థాయిలో కీర్తి
పన్నెండేళ్ల వయస్సులోనే రమణ కలం పదునెక్కింది. వివేకానందునిపై రాసిన వ్యాసం జాతీయ స్థాయిలో కీర్తినిచ్చింది. ఆ చిన్న వయస్సులోనే వరుసగా అరేళ్ళు ప్రథముడుగా నిలిపింది. పన్నెండేళ్ల ప్రాయంలోనే ఆకాశవాణిలో ఇంటర్వ్యూ చేయబడేంత పేరు తెచ్చింది. ఈ మాట, ఆ రాత నండూరి రామ్మోహనరావు చెవిన పడడంతో శ్రీరమణ రాత మారిపోయింది. జ్యోతిలో ఉద్యోగం వచ్చింది. తదాదిగా ఆంధ్రప్రభ, నవ్య, పత్రిక మొదలైన అనేక వేదికలపై ఆ కలం వేడుక చేసింది. కథలు, పేరడీలతో పాటు ఆయన రాసిన ‘కాలమ్స్’ చాలాకాలం సందడి చేశాయి. సమకాలీన రాజకీయాలపై, మారుతున్న మనిషిపై, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కొత్త కొత్త సంస్కృతులపై మాటల చురకత్తులు విసిరి చూపించారు. నాటి కవులు,సాహిత్యవేత్తల తీరు తెన్నులను ఆవిష్కరిస్తూ రాసిన రచనలు,చెప్పిన కబుర్లను తలుచుకుంటే చాలు! ఆయనలోని పరిశీలనాశక్తి, వ్యంగ్య వాగ్వైభవం దర్శనమవుతాయి. ‘మిధునం’ లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. ఈ స్థాయిలో అమ్ముడుబోయిన తెలుగు రచనలు కోటికొకటి ఉంటాయి. ఈ రచన భారతీయ భాషలతో పాటు మిగిలిన విదేశీ భాషల్లోకి అనువాదమై అపరిమితమైన కీర్తిని ఆర్జించి పెట్టింది. ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ‘టీ కప్పులో సూర్యుడు’ సూపర్ హిట్!
Also read: ‘పలుభాషల పలుకుతోడు – పాటల సైజోడు’ ఎస్పీ బాలసుబ్రమణ్యం….
అరుదైన అబ్బురం
మిధునం కథ ఆధారంగా మలయాళంలో సినిమా కూడా వచ్చింది. కన్నడ రంగస్థలంలో విభిన్న ఆకృతులు దాల్చి అలజడి చేసింది. విశ్వనాథ, జరుక్ శాస్త్రి, జాషువా, దేవులపల్లి, శ్రీశ్రీ ఒకే బోగీలో ప్రయాణం చేస్తూ వుంటే వాళ్ళ మధ్య కబుర్లు ఎట్టా ఉంటాయో శ్రీరమణ రాసిన తీరు నభూతో న భవిష్యతి! శ్రీరమణ వంటివారి పుట్టుక కూడా అరుదుగా జరిగే అబ్బురం! ‘శ్రీరమణుడు’ బ్రోచుగాత ఆత్మకు శాంతినిచ్చి దయన్.
Also read: శతాధిక సార్వభౌముడు ఎన్ టీ ఆర్