(ఒక మహోన్నత యోధుడి మననం)
“..అతడు వాయు వేగంతో నా వద్దకు చేరుకున్నాడు. నా రక్తం ఉడికిపోతోంది. అతడి ఛాతీని చీల్చి అందులోంచి వేడి రక్తం ఉబికి వస్తుంటే చూసే సమయం కోసమే నేను కాచుకుని కూర్చున్నాను. నేను నా తుపాకి తీసుకుని అతడు ఏమి జరుగుతుందో తెలుసుకునే లోగానే కాల్చిపారేసాను. తర్వాత అతడి తలను, చేతులను కూడా నరకడం ప్రారంభించాను. నాపై మరతుపాకుల్ని ఎక్కుపెట్టాలని కోరుకున్న చేతులవే. తర్వాత నేను అతడి తలను గుర్తుగా, భద్రంగా దాచాను!” (పేజి 7)
30 ఏళ్ళ క్రితం 1993 లో ‘ఇండియా టుడే’ పత్రికకి శ్రీనివాస్ హత్యను గురించి వీరప్పన్ స్వయంగా చెప్పిన మాటలివి. ఇంతకీ ఎవరీ శ్రీనివాస్? దేశవ్యాప్తంగా నవంబరు 10న అటవీ అధికారుల స్మృతిదినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు? రాజమండ్రిలో రోడ్డుకీ, పార్కుకీ సరే కానీ దేశంలోనే అత్యున్నత శిక్షణా సంస్థలైన డెహ్రాడూన్, ముస్సోరీ వంటి చోట్ల ఆయన చిత్రాలు పెట్టి జీవితాన్ని పాఠ్యాంశంగా ఎందుకు బోధిస్తున్నారు!?
కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగుళూరు ఫారెస్ట్ కాంప్లెక్స్ లో ఈ తెలుగు వీరుడి కాంశ్యవిగ్రహం పెట్టడానికి కారణం ఏంటి? వీటన్నింటి కంటే ముఖ్యంగా, తమిళనాట వీరప్పన్ సొంత గ్రామమైన ‘గోపీనాథం’ లో శ్రీనివాస్ పటాన్ని శాశ్వతంగా ప్రతిష్టించుకున్న గ్రామస్తులు, మారియమ్మ దేవాలయాన్ని శ్రీనివాస్ స్మృతికి సమష్టిగా అంకితం చేయడానికి కారణమేంటి? శ్రీనివాస్ చనిపోయిన దశాబ్దాల తరువాత కూడా ఆ గ్రామం ఆయన్ని దేవుడిగా ఎందుకు పూజి స్తోంది!?
“శ్రీనివాస్ తన జీవితాన్ని తాను ఎంచుకున్నాడు. తనే నిర్మించు కున్నాడు. ఒక సాధారణ యువకుడు తన ఆదర్శం పట్ల సీరియస్ గా ఉంటే, పట్టుదలగా కృషి చేస్తే, ఎంత సాధించగలడో, ఎంత మార్పు తేగలడో తన జీవితాన్ని ఎంతగా ధన్యం చేసుకోగలడో, ఒక లెజెండ్ గా మారి తన వ్యక్తత్వంతో ఒక తరానికి ఎలా స్పూర్తి ఇవ్వగలడో చెప్పడానికి శ్రీనివాస్ జీవితమే ఒక ఉదాహరణ.!”(పేజి 15)
“మన తెలుగు ప్రజల దురదృష్ట మేమిటంటే, అటువంటి మహనీయమూర్తి త్యాగమయ, వీరోచిత జీవిత ఘట్టం సమకాలీన చరిత్రలో మన కళ్ళ ముందే ఆవిష్కృత మైనా గుర్తించలేనంత అంధులమై పోయాం మనం. వర్తమాన భావితరాల యువతరానికి అపూర్వమైన స్పూర్తిని అందించగల శ్రీనివాస్ జీవితం, కేవలం ఒకరోజు పత్రికలో మొదటిపేజీ వార్త అయ్యింది మన దుర్భాగ్య ఆంధ్ర దేశానికి. అంతకుమించి మరేమీకాలేదు. లోకోత్తరమైన కరుణని, వెరపెరుగని పోరాటదీక్షని ప్రతిబింబించే శ్రీనివాస్ జీవితం గురించి కంటే, అలవిమాలిన దుష్ట త్వానికి ప్రతీకయిన వీరప్పన్ గురించే ఎక్కువ తెలుసు తెలుగు దేశానికి.!”(పేజి 8)
ఒక నిబద్దత, నిజాయితీ కలిగిన IFS అటవీ శాఖ అధికారిగా, ప్రజాపక్ష ఆలోచనా పరుడిగా, సంఘ సంస్కరణాభిలాషిగా, సేవాతత్పరునిగా, అరుదైన ప్రజాహిత ఉద్యోగిగా, అకళంకిత కర్తవ్య నిర్వహణ శీలిగా, నైతిక విలువలు పాటించే గాంధేయ వాదిగా గాఢమైన ముద్ర వేసిన కీర్తిచక్ర పందిళ్ళ పల్లి శ్రీనివాస్ స్మగ్లర్ వీరప్పన్ చేతిలో అన్యాయంగా, దుర్మార్గంగా హత్య చేయబడిన తెలుగువాడు. ఇరవై ఏళ్ళ క్రితం జనహర్ష తన మొదటి ప్రచురణగా శ్రీనివాస్ తల్లి దండ్రులకి అంకితమిచ్చి తీసుకువచ్చిన ఏకైక తెలుగు పుస్తకం ఇది!
కీర్తిచక్ర పందిళ్ళపల్లి శ్రీనివాస్ స్పూర్తిని గ్రహిస్తూ ఆయన తల్లిదండ్రులకు ‘మహాత్మా గాంధీ హార్మనీ అవార్డు’ను అందించడం మొదలు, అప్పట్లో హెచ్.బి.టి వాళ్ళు ప్రచురించిన గంధపు చెక్కల వీరప్పన్ పుస్తకం మీద సాధికారిక విమర్శ వరకూ తెలుగు జాతి విస్మరించిన ఒక గొప్ప యోధుడి ఆశయాల మననం జనహర్ష ప్రచురించిన ఈ పుస్తకం. 36 ఏళ్ళ వయసులో అనితరసాధ్యమైన అంకిత భావంతో అహర్నిశలూ ఈ దేశంకోసం పనిచేసి అసువులు బాసిన శ్రీనివాస్ స్పూర్తి నలువైపులా విస్తరించాలనీ ఆకాంక్షిస్తూ, ఆయన 32 వ వర్ధంతి సందర్భంగా మిత్రులు, పెద్దలు జైభారత్ రమణమూర్తి సరిగ్గా 20 ఏళ్ళ క్రితం 2003లో వెలువరించిన ఈ పుస్తకం కోసం చాలా ఆలస్యంగా చిన్న రైటప్!
(చదవాలనుకునే వారి కోసం నెట్లో పుస్తకం సాఫ్ట్ కాపీ పంపుతున్నాను. “Srinivas was a true Gandhian. Lived as Gandhian, died as a Gandhian ” అనే మాట ఈరోజు ఎంత నిజమో యువతరంలోని గుప్పెడు మందైనా గ్రహించ గలిగితే సంతోషం. ఎందుకనేది స్పష్టం,”శ్రీనివాస్, శ్రీనివాస్. సైతాన్ క్రూర వీక్షణం పైన దైవిక శక్తుల విజయహాసం అతడు. జీవితాన్ని జెండాగా ఎగరేసిన సాహసి. ఈ భూగోళం మీద ఇప్పటివరకూ ఉద్భవించిన అద్భుతాల్లో మానవత్వమే, మానవత్వమే..మానవత్వమే మహోన్నతమని చాటిన మరొక ఉదాహరణ శ్రీనివాస్!.”)
– గౌరవ్