Saturday, December 21, 2024

శ్రీమద్విరాటపర్వం-1

మహాభారతం

మనిషి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి (Learning is a continuous process). ఏది ఎప్పుడు ఎందుకు ఉపయోగ పడుతుందో తెలియదు.

పాండవులు రాజకుమారులు. మహావైభవంగా పెరిగినవాళ్లు. దృపదరాజ పుత్రి యాజ్ఞసేని ద్రౌపది. అల్లారుముద్దుగా అంతఃపురంలో పెరిగింది. ఈ భోగాలు, ఈ వైభవాలు ఆఖరికి తమ గుర్తింపును కూడా విడిచిపెట్టి వారంతా బ్రతుకవలసిన పరిస్థితి. (We crave for recognition! It is human tendency! But they had to live losing their identity)

ఒక సంవత్సరంపాటు, తమతో పోలిస్తే అన్ని విషయాలలో అతి సామాన్యుడైన రాజు దగ్గర సేవకులుగా పని చేయాల్సి వచ్చింది. అప్పుడే వారు నేర్చుకున్న అదనపు విద్యలే అక్కరకొచ్చాయి.

(దురదృష్టవశాన ఇవ్వాళ మనం కొన్ని విద్యలను కొన్ని వృత్తులను చాలా ఉత్తమమైనవి, మరికొన్ని వృత్తులు అధమమైనవనే భావనలో కొట్టుమిట్టాడుతున్నాం. అన్ని విద్యలూ అన్నం పెట్టేవే. అయినప్పుడు ఏది గొప్ప, ఏది తక్కువ? ఈ గొప్ప తక్కువ భావనలే కులాల మధ్య కుంపట్లు రగులుస్తున్నాయి)

సరే, విరాటరాజు కొలువులో ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో వారు ఎందులో నిష్ణాతులో ఒకరొకరుగా పాండవులు చెపుతున్నారు  చూడండి..

రాచకొలువు అంటే ఆషామాషీ కాదు. ధర్మరాజు ద్యూతక్రీడలో నిష్ణాతుడు, మోసమనేదే లేకపోతే అందులో ఆయనను ఓడించగలిగే వారే లేరు. ‘‘నేను మహారాజ కొలువులోచేరి ఆయనకు ద్యూత క్రీడద్వారా వినోదం కలిగిస్తాను’’ అని ధర్మజుడు మిగిలిన వారితో చెప్పాడు.

‘‘నేను వంటలు చేయడంలో అపార ప్రావీణ్యం గడించాను. బల్లవుడనే పేరుతో వంటవాడిగా చేరి అప్పుడప్పుడు మల్లయుద్ధంలో వినోదాలు రాజుకు చూపుతుంటాను’’ అని భీముడంటాడు.

అర్జునుడు నాట్యశాస్త్ర ప్రవీణుడు. రెండుచేతులా శరసంధానం చేయగలడు.  లాఘవంగా శరీరంతో హావభావ ప్రదర్శన చేయగలడు. ‘‘నేను షండుడిగా మారి అంతఃపురకాంతలకు నాట్యం నేర్పుతాను’’ అని అర్జునుడు అంటాడు.

అశ్వహృదయం నలుడి తరువాత అంతగొప్పగా నకులుడికే తెలుసు. అన్నిరాజ్యాలవారూ నకులుడిని సంప్రదించి కానీ అశ్వాలజోలికి ఎవరూ వెళ్ళరు. He was a consultant. “నేను విరటుడి అశ్వరక్షకుడిగా మారతాను’’ అని నకులుడు అంటాడు.

సహదేవుడు పశువైద్యశాస్త్రంలో నిష్ణాతుడు. He was an ultimate authority in it.

‘‘అన్నా! ఒక గిత్త మూత్రం వాసన చూసి ఒక గొడ్డావుకూడా దానిద్వారా చూడుకడుతుందో లేదో చెప్పగలను. నేను గోసంరక్షకుడిగా చేరతాను’’ అని సహదేవుడు  చెపుతాడు. (`సహదేవచిట్కాలు` అని మనకు బయట దొరుకుతాయి. అవి పశువైద్యానికి సంబంధించిన అమూల్యమైన విషయాలు)

ఇక సుకుమారి, ఒకళ్లతో చేయించుకోవడమేగానీ తానెవరికీ సేవ చేసి ఎరుగని ద్రౌపది వంతు వచ్చింది. “స్త్రీలకు అలంకరణ చేయడంలో నాది అందెవేసిన చెయ్యి. అందులో నాకు అద్బత నైపుణ్యం ఉంది. రాణీవాసంలో సైరంధ్రిగా ఉంటాను“ (బ్యూటీషయన్) అని ద్రౌపది చెపుతుంది.

మా పుట్టుక చాలా గొప్పది. ఇవేం విద్యలు అని అనుకొని ఉంటే పాండవులు అజ్ఞాతవాసం చేయగలిగేవారా?

ధౌమ్యులవారు,పాండవుల రాజపురోహితుడు. ఎటు వెళ్ళవలసినవారిని అటుపంపి తాము అజ్ఞాత వాసానికి బయలుదేరబోతున్నప్పుడు పాండవులతో ఇలా అంటాడు… “ధర్మరాజా!  మీరు ఎవరికైనా ఆజ్ఞలు ఇచ్చిన వారే కానీ ఇంతకు ముందెన్నడూ తీసుకొని ఎరుగరు. సేవకులతో పనులు చేయించుకున్నవారే కానీ సేవ ఎవరికీ చేసి ఉండలేదు. ఇంకొక రాజు పంచన బ్రతుకుతూ వారి ఆజ్ఞలు పాటిస్తూ బ్రతకడానికి కొంత నేర్పు కావాలి. మీకు తెలవదు అని కాదు,  అయినా మరొక్కమారు చెపుతాను“ వినండి. (BOSS MANAGEMENT)

‘‘ముందుగా ఒక మాట. ఆ రాచకొలువులో  మీ మీ శక్తిసామర్ధ్యాల ప్రదర్శన జరుగరాదు. తన వద్ద పనిచేసేవారు తనకన్నా శక్తివంతమైనవారని తెలిసిన ఏ రాజు దానిని భరించలేడు (You can’t be smarter than your BOSS).

‘‘అర్జునుడు ఒక్కడే ఈ ప్రపంచములో గాండీవము ధరించినవాడు. అది అన్ని ధనుస్సులకన్నా శ్రేష్ఠమైనది. మరి భీమసేనుడి ఆయుధము  ప్రచండ గదాదండము. మిగిలిన మీ మువ్వురి ఆయుధములు కూడా పెనుమంటలవంటివి. వాటిని ధరించిన మీరు అగ్నులలాంటివారు. అసలే కాలము మీకు ఎదురు తిరుగుతూ ఉన్నది. అది మరచిపోయి మీ బలపరాక్రమ ప్రదర్శన ఏ మాత్రం జరిగినా అజ్ఞాతవాసము భంగమవుతుంది. కావున అలవికాని చోట అధికులమనరాదు. అని చెప్పి ముందు మీమీ ఆయుధాలు దాచుకోండి’’ అని సూచించారు ధౌమ్యులవారు.

గమనిక:

అంటే? మన బాసుల వద్ద మన తెలివితేటలు, శక్తిసామర్ధ్యాలు ప్రదర్శించరాదు. అధికారము, అహంకారము జంటపక్షులు. ఒకదానిని విడిచి మరొకటి ఉండలేదు.

రాజులు అధికారదర్పంతో ఎగిరెగిరి పడుతుంటారు. కాబట్టి తగిన పద్దతిలో మాత్రమే వారున్నచోట అడుగుపెట్టాలి. మన రూపం కానీ, వేషంకానీ (dress code) వికృతంగా ఉండకూడదు. సమయం తెలుసుకొని మసలుకోవాలి.

రాజు (boss) కంటే అందమైన దుస్తులు (dress) వేసుకోవద్దు. ఆయన కన్నా ఎక్కువ విహారాలు చేసినట్లుండకూడదు. ఆయన ఇంటికన్నా గొప్పగృహము కట్టరాదు. అన్ని పనులలో తలదూర్చి నాకన్నీ తెలుసు అన్నట్లుగా ప్రవర్తించరాదు. దానివల్ల రాజుతో సాన్నిహిత్యం పెరుగవచ్చు కానీ తోటివారికి కష్టం కలిగించినవాడివవుతావు. తోటివారు సమయంకోసం కాచుకొని వుండి అదనుచూసి పదునైన దెబ్బ వేస్తారు

సహచరుని నిర్వహణ (Peer management). ఎందుకని?

 మనిషికి అసూయ సహజము. అందులో తనక్రిందవాడికి ఉండి తనకులేదే అని తెలిసినప్పుడు పైవాడు ఖచ్చితంగా హాని చేస్తాడు. అదేవిధంగా తోటివాడు “వీడు నాకంటే ఎందులో గొప్పని“ అంచనాలు వేస్తూ ఉంటాడు.

రాజు (boss)వద్ద ఉన్నప్పుడు మన దృష్టి (attention)ఎల్లప్పుడూ ఆయన మీదే ఉండాలి. ఆయన మాట్లాడిన ప్రతి విషయం అత్యంత గోప్యంగా (confidential) ఉంచాలి. అలానే మనం విన్నవిషయాలు ఏది చెప్పవచ్చో ఏది చెప్పగూడదో విచక్షణ కలిగి వుండాలి. ఎప్పుడూ అప్రియమైన విషయాలు చెప్పరాదు. వాళ్ళ సమక్షంలో ఆవులించడం, తుమ్మటం, నవ్వడం, అసలే పనికిరాదు.

Peter F Drucker అని ఒక management expert… “Why you should adopt your BOSS ways ” అనే విషయం మీద పెద్ద వ్యాసాలే వ్రాశాడు.

BOSS MANAGEMENT కొరకు వేరే క్లాసులేల. విరాటపర్వం చదివితే చాలని అనిపిస్తున్నది కదూ!

(సశేషం)

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles