- పుస్తక పరిచయం
- రచయిత: వనం జ్వాలా నరసింహారావు
పరమ భాగవతోత్తములు వసించి, భాషించి, భాసించిన పుణ్యభూమి ఈ భరతభూమి. ప్రపంచ దేశాలలోనే మహోన్నతమైన దేశంగా నీరాజనాలు పొందడానికి దోహదపడింది మన విలువల పునాదులు. ఆ పునాదులకు మూలమై, బీజమై,బీజాక్షరములై నిలిచింది మన పురాణాలు, కావ్యాలు, ఇతి హాసాలు. ఇందులో, రామాయణం మహాకావ్యం. భారతం మహా ఇతిహాసం. భాగవతం మహా పురాణం.
భారతీయ హృదయం
రామాయణ, భారత, భాగవతాలే భారతీయ హృదయం. వాల్మీకి, వ్యాస మహర్షులు మానవాళికి ప్రసాదించిన దివ్య ఐశ్వర్యమే ఈ త్రయం. వ్యాస భాగవతాన్ని తెలుగులో అనుసృజన చేసిన మహానుభావుడు, పరమ భాగవతోత్తముడు, మహాకవి బమ్మెర పోతనామాత్య. చిక్కని సంస్కృతాన్ని చక్కని తెలుగులో అందించిన తెలుగుల పుణ్యపేటి పోతన్న. పద్య,గద్యాత్మకంగా సాగిన ఈ మహారచన తెలుగువాడికి అత్యంత ప్రీతిపాత్రమైంది.
అందరి నాల్కలపై నాట్యమాడిన పద్యాలు
పల్లెల్లో జీవించే నిరక్షరాస్యులు మొదలు ఉన్నత విద్యావంతుల వరకూ అందరి నాల్కలపై నిన్న మొన్నటి వరకూ మన పోతన్న పద్యాలు నాట్యమాడాయి. ఆ కథలు అమ్మమ్మల నుండి, బామ్మల నుండి వినడం, ఆ పారాయణామృతాలను గ్రోలడం మొన్నటి తరం వరకూ తెలుగువాడికి అనుభవైక వేద్యం. మారుతున్న కాలంలో, మారిపోతున్న విద్యా విధానంలో పోతన్న భాగవతాన్ని, ఆ కథల సారాన్ని అర్ధం చేసుకోడం నేటి తరాలకు దుర్లభమనే చెప్పాలి.
ప్రయోజనకరమైన గొప్ప ప్రయోగం
బహుశా ఇందులో నుంచే ఈ భాగవత కథల పుస్తకం వెలుగు చూసిందని భావించాలి. ఈ వెలుగులను మనకు అందించినవారు వనం జ్వాలా నరసింహారావు. తెలుగు భాగవత సారాంశాన్ని కథలుగా జ్వాలావారు వాడుక భాషలో వచన రచనలో అందించారు. ఇది గొప్ప ప్రయోగం, అంతకు మించి గొప్ప ప్రయోజనకరం. అంతటి భాగవతాన్ని, అందులోని ముఖ్యమైన కథలను, విషయాలను, అంశాలను హాయిగా అర్ధం చేసుకొనే వెసులుబాటు నేటి తరం పాఠకులకు కలిగింది.
సంక్షిప్త సుందరం
ఇది కేవలం పురాణం కాదు. ఇందులో కావ్య పరీమళాలు ఉన్నాయి. బహుశాస్త్ర రహస్యాలు ఉన్నాయి. లోక చరిత్ర ఉంది. సృష్టి నిర్మాణం వుంది. సమస్త జీవరాసుల ప్రవర్తన ఉంది. మనిషి తెలుసుకోవాల్సింది మొత్తం వుంది. ఈ పుస్తకం ఇతర భారతీయ భాషల్లోకి అనువాదం కావాల్సిన అవసరం వుంది. జ్వాలా నరసింహారావు ఇక్కడ ముఖ్య కథలన్నింటినీ సంక్షిప్త సుందరంగా అందించారు. ఇది కేవలం కథల పుస్తకం కాదు. ఇది విజ్ఞాన సర్వస్వం (ఎన్ సైక్లోపెడియా).
ఓంకారం నుంచి విశ్వాకారం దాకా
దీనిపేరు భాగవత కథలు అని ఉన్నప్పటికీ, ఈ పుస్తకం ద్వారా కృష్ణచరితతో పాటు శ్రీరామ చరిత్ర తెలుసుకోవచ్చు. రామచరితతో పాటు కృష్ణానార్జున జన్మ రహస్యాలు, కలియుగ రాజ వంశాల చరిత్ర కూడా తెలుస్తుంది. ఓంకారం మొదలు నేటి విశ్వ ఆకారం వరకూ ఆన్నీ ఇందులో పొందుపరిచారు. వేదాలు, కాలం, పిండోత్పత్తి, భూమి నైసర్గిక స్వరూపం, ఖగోళ విజ్ఞానం, జీవరాశుల పరిణామ క్రమం మొదలు అనేకానేక విషయాలు, రహస్యాలు ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు.
సులభగ్రాహ్యం
ఈ పుస్తకాన్ని ఒక మత గ్రంథం గానో, పుక్కిటి పురాణాల పేటికగానో రచయిత మలచలేదు. అత్యాధునిక సర్వ శాస్త్ర గ్రంథంగా దీన్ని నిర్మించారు. అత్యంత పురాతమైన ఈ రచనను అత్యాధునికంగా మలిచారు. మధ్య మధ్యలో రసగుళికల్లాంటి పోతన్న పద్యాలను అందించారు. అన్ని స్కంధాలను పరిచయం చేశారు. జ్వాలావారు భాగవతాన్ని తెలిసి పలికారు. ఇంత తక్కువ సమయంలో, అంతటి ఉద్గ్రంథాన్ని చదివి, అర్ధం చేసుకొని, సామాన్య అక్షర జ్ఞానం కలిగినవారికి కూడ ఎంతో బాగా అర్ధమయ్యేట్టు రాయడమే చిత్రంబు. ఈ రచయిత చిన్నప్పటి నుంచీ విన్నంత, కన్నంత, తెలుసుకున్నదంతా ఇక్కడ తేట పరిచారు. వేదాంతం, భక్తి, మహా తత్త్వం ఆన్నీ ఈ రచనలో దర్శనమవుతాయి.
పెనుపూనిక
నవ విధి భక్తి మార్గాలను అరటి పండు వొలిచి పెట్టినంత అందంగా అందించారు. మహాకవి పోతనామాత్యుని అనువాద రీతి, కథాకథన సంవిధానం మనకు ఇక్కడ బాగా పరిచయం అయ్యాయి. కేవలం 27రోజుల్లో 2700 పేజీల పెద్ద సైజు పుస్తకాన్ని ఆమూలాగ్రం చదివి, ఒక్కొక్క స్కంధానికి క్లుప్తంగా సారాంశం రాసి, కేవలం 48 రోజుల్లో 88 కథలను “శ్రీ మద్భాగవత కథలు”గా పుస్తకంగా తేవడమంటే సామాన్యమైన విషయం కాదు. ఏదో ఒక పెద్ద పూనికతో ఈ గ్రంథ నిర్మాణం జరిగిందని ఊహించవచ్చు.
ప్రముఖుల ప్రశంసలు
ఈ పుస్తకం ఇప్పటికే చాలామంది పీఠాధిపతులు, కవి, పండితులు,సాహిత్యవేత్తల ప్రశంసలను గడించింది. అక్షరప్రియుల అభినందనలను అందుకుంది.రచయితకు ఎనలేని కీర్తి లభించింది. జ్వాలా నరసింహారావు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో పౌర సంబంధాల ప్రధానాధికారిగా కీలకమైన పదవిలో ఉంటూ తన బాధ్యతలను సమర్ధవంతంగా నెరవేరుస్తూ, అనేక సామాజిక, విధానపరమైన (పాలసీస్) అంశాలపై పత్రికలకు అసంఖ్యాకంగా వ్యాసాలు రాస్తూ, పురాణ, ఇతిహాస, కావ్యాలను చదువుతూ, వాటిని మళ్ళీ వ్యాసాలలో అందిస్తూ సమయాన్ని ఇంత సముచితంగా సద్వినియోగం చేసుకోవడం బహు ప్రశంసాపాత్రం.
వేదాల సారం అదనం
ఇటువంటివారు చాలా అరుదుగా ఉంటారు. ఈ భాగవత కథలను రాయడమే కాక, ప్రసంగాలు చేసి వీడియోలుగానూ అందించారు. జ్వాలావారి అకుంఠిత దీక్ష శతధా అభినందనీయం. ఈ పుస్తకంలో పాఠకులకు మరో అద్భుతమైన కానుకను అదనంగా అందించారు. దాశరథి రంగాచార్య రచించిన వేద సంహితల ఆధారంగా, వేదాల సారాన్ని సరళసుందరంగా రాసి, అనుబంధంగా ఇందులో పొందుపరిచారు.
జ్ఞానగ్రంధం
ఈ పుస్తకం ప్రతివ్యక్తీ తప్పకుండా చదవవల్సిన గొప్ప జ్ఞాన గ్రంథం. పాఠకుడిని కట్టిపడేసే శైలి ఈ రచనలో వుంది. చతుర్విధ పురుషార్ధ సాధన అనే అంశాన్ని అలా ఉంచగా, సమయాన్ని, జ్ఞానాన్ని అర్ధవంతంగా వినియోగించుకున్న వనం జ్వాలా నరసింహారావు పూర్ణ యశఃకాయులయ్యే విధంగా తన జీవితాన్ని మలచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఈ రచనాయత్నం చెబుతోంది. చదివించే శక్తి కలిగిన ఈ పుస్తకాన్ని చదువుదాం, చదివిద్దాం.