విండోస్ 2020
కిటికీ తెరిస్తే
భారత స్వాతంత్ర్యోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులు. వల్లభాయ్ పటేల్ కూడా గాంధీని అనుసరిస్తూ సత్యాగ్రహాలలో పాల్గొంటున్నారు. పరిస్థితిని దేశం గమనిస్తోంది. అప్పట్లో ఓ పత్రికా విలేకరి ‘‘దేశంలో ఏ సమస్య వచ్చినా గాంధీజీ ఆలోచించకుండా నిర్భయంగా ఆమరణ నిరాహారదీక్షకి కూచుంటున్నారు. మీరు ఒక్కసారి కూడా దీక్షకి దిగలేదేమండీ’’ అని అడిగి, జవాబుకోసం చెవులు రిక్కించాడు. దానికి సర్దార్ సన్నగా నవ్వి, ‘‘గాంధీజీ దీక్షకి దిగితే జనమంతా గగ్గోలుపెట్టి ఎలాగో అలాగ మూడో రోజుకి ఉపవాసదీక్షని విరమింప చేస్తున్నారు. నేను రంగంలోకి దిగితే, ఆపేవాళ్లుండకపోతే సంగతేమిటని నాభయం…’’ అన్నారట. శంకరాచార్యుల వారు మరిగించిన సీసం సేవించారని శిష్యులు సేవించబోవడం పూర్తిగా అవివేకం.
మనకి స్వాతంత్ర్యం పటేల్ కి పేరు ప్రతిష్ఠ వచ్చాక ‘‘ఏం సారూ! ఎక్కడా మీ కాంస్య విగ్రహం పెట్టారు కాదేమండీ’’ అటు గుజరాతీలోనూ, ఇటూ హిందీలోనూ చాలామంది వేధించడం మొదలు పెట్టారు. దాంతో ఆ నిలువెత్తు మనిషి సౌమ్యంగా నవ్వి, తీరా విగ్రహాలు నిలబెట్టాక, ఈ బొమ్మ ఎవరిదని పదిమందీ అడిగే కంటే అసలు విగ్రహ ప్రతిష్ఠ లేకపోవడం గౌరవప్రదం అన్నారట. అడిగినవారు అవాక్కైనారు.
అయితే, జాతి మహనీయుల్ని వారి సేవల్నీ ఎన్నటికీ మర్చిపోదు. 2013 అక్టోబర్ లో సమున్నతమైన సర్దార్ ఉక్కు విగ్రహ పనులు చురుకుగా అందుకున్నాయి. అక్టోబరు 31, 2013న ప్రముఖ శిల్పి రామ్ వి.సుతార్ సారధ్యంలో పటేల్ విగ్రహ నిర్మాణం శ్రీకారం చుట్టుకుంది. ఆయన భారతదేశ తొలి ఉపప్రధాన, ఇంకా తొలి దేశీయాంగ మంత్రి. స్వాతంత్రానంతరం దేశంలో చిన్న చిన్న కోటలతో రాజ్యాలేలుతున్న సంస్థానాధీశులను ఏ గొడవా అల్లరి లేకుండా వశపరుచుకున్న ధీశాలి పటేల్. అదొక నిశ్శబ్ద విప్లవంగా సర్దార్ నేతృత్వంలో నడిచింది.
గుజరాత్ రాష్ట్రంలో సూరత్ కి 150 కిలోమీటర్ల దూరంలో, 182 మీటర్లు (597 అడుగుల) విగ్రహం భారత ప్రధాని నరేంద్రమోది సంకల్పబలంతో ఈ సమతా మూర్తి ఉక్కు విగ్రహం ఒక అద్భుతంగా జాతికి అందింది. దీనికిగాను సుమారు మూడు వేల కోట్ల వ్యయంతో, రాష్ట్రీయ ఏక్తా ట్రస్ట్ సహకారంతో రూపుదిద్దుకుంది. రైతులు, శ్రామికులు తమ వృత్తులలో పంటచేలలో వాడిన కొడవళ్లు, నాగళ్లు, సుత్తులు, కమ్మరి చక్రాలను సేకరించి ఈ విగ్రహానికి కావలసిన ముడిసరుకుని సిద్ధం చేశారు. అయిదు మెట్రిక్ టన్నుల మూల పదార్ధాన్ని దేశ శ్రామికులు అందించారు. మోది గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ పథకానికి పునాదులు పడ్డాయి. 31 అక్టోబరు 2018 ఈ విగ్రహం సంపూర్ణమై జాతికి దర్శనార్థం అందుబాటులోకి వచ్చింది. దేశ పర్యాటకులకు గొప్ప ఆకర్షణగా నిలిచింది. Statue of unity!
ఈ మహా నిర్మాణంలో 250 మంది ఇంజనీర్లు, మూడు వేల మంది శ్రామికులు పనిచేశారు. ఏడున్నర లక్షల క్యూబిక్ అడుగుల సిమెంటు, ఆరున్నరవేల టన్నుల ఉక్కు లోహం, 1700 టన్నుల కాంస్యం దీనికై వినియోగించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పూనికతో దేశంలో స్వతంత్రం తర్వాత ఉన్న 562 చిన్నా చితక రాజాస్థానాల్ని రిపబ్లిక్ ఇండియాలో విలీనం చేశారు. వాటిలో నైజామ్ రాజ్యం కూడా ఉంది. మొదట్లో సష్టపరిహారంగా ఇచ్చిన రాజాభరణాలను తర్వాత రద్దుచేశారు. పటేల్ లాంటి ధీశాలిని జాతి ఉక్కు మనిషిగా శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటుంది. అందులో సందేహం లేదు. సర్దార్! సిందాబాద్!
పెన్ సెల్స్
- విద్యావెత్త, మేథావి కట్టమంచి రామ లింగారెడ్డి సహజసంభాషణా చతురులుగా కూడా వాసికెక్కారు. జాతీయోద్యమం దేశంలో పవళ్లు తొక్కుతున్న రోజుల్లో ఒకసారి గాంధీజీని కలిశారు. ఇష్టాగోష్ఠిలో, ‘‘ఈ వృద్ధుడి సత్యాగ్రహాల మీద మీ అభిప్రాయం తెలుసుకోవచ్చా’’ అని గాంధీజీ అడిగారట. దానేకేం భాగ్యం. సత్యం మీలో ఉంది. ఆగ్రహం మీ శిష్యగణంలో ఉంది అన్నారట కట్టమంచి తడుముకోకుండా.
- తలపండిన రాజకీయనాయకుడితో తొందరపడి పెట్టుకోవద్దు. పవర్ కోసం, పదవికోసం వారెంతకైనా తెగిస్తారు. ఆఖరికి చివరి అస్త్రంగా ప్రజాసేవకైనా పాల్పడగలరు. అంతకు బరితెగించగలరు జాగ్రత్త!
- రచయిత, నిర్మాత చక్రపాణికి ‘‘నేటివ్ జీనియస్’’గా గొప్ప పేరుంది. సినిమాల్లో కథాగమనాన్ని అసామాన్యంగా కాక అతిసామాన్యంగా నడిపించేవారు. టిక్కెట్టు కొని సినిమాకి వచ్చిన వారికి కథ జిలెబి తిన్నంత హాయిగా అర్థం కావాలన్నది ఆయన సిద్ధాంతం. ఒక విలేకరి చూడవచ్చి, ఈ మీ చిత్రంలో మెసేజి ఏమైనా ఉందా’’ అని అడిగాడు. చక్రపాణి తడుముకోకుండా మెసేజికోసం లక్షలుపోసి సినిమా తియ్యడం దేనికి, రూపాయి పావలాతో ఓ టెలిగ్రాం కొడితే పోలా?’’ అన్నారట తన సహజధోరణిలో.
Humorous comments especially Panuganti`s are well taken. Perhaps more of such will enhance the presitige!